Stray Dogs: వీధికుక్కల బెడదపై జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీకి ఫిర్యాదుల వెల్లువ
ABN, First Publish Date - 2023-02-26T16:03:41+05:30
వీధికుక్కల (Stray Dogs) బెడదపై జీహెచ్‌ఎంసీ (GHMC) టోల్‌ఫ్రీకి ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. బల్దియా టోల్‌ఫ్రీ నెంబర్‌కు 3 రోజుల్లో 30 వేల ఫిర్యాదులు వచ్చాయి.
హైదరాబాద్: వీధికుక్కల (Stray Dogs) బెడదపై జీహెచ్‌ఎంసీ (GHMC) టోల్‌ఫ్రీకి ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. బల్దియా టోల్‌ఫ్రీ నెంబర్‌కు 3 రోజుల్లో 30 వేల ఫిర్యాదులు వచ్చాయి. వీధికుక్కలను పట్టుకునేందుకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో రోజుకు 300 ఫిర్యాదులు మాత్రమే జీహెచ్‌ఎంసీ పరిష్కరిస్తోంది. గ్రేటర్ పరిధిలో రోజూ 100కు పైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad), పరిసరాల్లో 13 లక్షల వీధికుక్కలున్నట్లు చెబుతున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ లెక్కలు మాత్రం ఇందుకుభిన్నంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం నగరంలో 5.75 లక్షల కుక్కలున్నాయి. ఇందులో 75 శాతం స్టెరిలైజేషన్ జరిగిందని అధికారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. 2020లో బల్దియా వెల్లడించిన వివరాలే ఇందుకు నిదర్శనం. అప్పుడు చేసిన సర్వేలో నగర వ్యాప్తంగా 5.61 లక్షల కుక్కలు ఉండగా.. వాటిలో 1.99 లక్షల శునకాలకు మాత్రమే స్టెరిలైజేషన్ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇటీవల వెటర్నరీ విభాగం మేయర్‌కు ఇచ్చిన వివరాల ప్రకారం 2020 నుంచి 2023 వరకు 1.63 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. ఈ లెక్కన చూసుకున్నా.. ఇప్పటి వరకు శస్త్రచికిత్సలు చేసిన కుక్కల సంఖ్య 3.5 లక్షలు మించదు. 5.75 లక్షల్లో ఈ మొత్తం.. 75 శాతం ఎలా అవుతుందో అధికారులకే తెలియాలి.
పెరుగుతున్న బాధితులు
గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి కుక్కల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకే రోజుకు 300 మందికి పైగా కుక్కకాటు బాధితులు వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎండలు ముదిరితే కుక్క కాటు బారిన పడే వారి సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు. కుక్కకాటుకు గురైన వారికి ప్రభుత్వ పరంగా నారాయణగూడ (Narayanaguda)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో టీకా సదుపాయం ఉంది. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వ్యాక్సిన్ అందిస్తున్నారు.
ఐదేళ్లలో రూ.75 కోట్లు..
నగరంలోని ఐదు ప్రాంతాల్లో యానిమల్ కేర్ సెంటర్లున్నాయి. ఫిర్యాదుల మేరకు వీధుల్లో పట్టుకొచ్చిన కుక్కలకు శస్త్రచికిత్స చేయడంతో పాటు.. ఐదు నుంచి వారం రోజులపాటు అక్కడే ఉంచి మందులు, ఆహారం అందజేస్తారు. ఇందు కోసం ఏటా రూ.15 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.70-80 కోట్ల వరకు ఖర్చు చేశారు. సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన వివరాల ప్రకారం ఒక్క సికింద్రాబాద్ (Secunderabad) జోన్‌లో ఏటా సగటున రూ.2.5 కోట్లు ఖర్చు చేశారు. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తోన్నా.. కుక్కల సంఖ్య ఎందుకు తగ్గడం లేదంటే అధికారులు అలవాటైన కాకి లెక్కలు చూపుతున్నారు. కుక్కలు, కోతులకు వేసే దాణానూ మెక్కేసినట్టు గతంలో విజిలెన్స్ విచారణలో తేలింది. చేయని స్టెరిలైజేషన్ చేసినట్టు.. చేయని వ్యాక్సినేషన్ చేసినట్టు.. ఆహారం పెట్టినట్టు కాగితాల్లో కనికట్టు చేసి కోట్టు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
Updated Date - 2023-02-26T16:03:42+05:30 IST