Governor: సనాతన ధర్మంతో మానవాళికి మేలు
ABN, First Publish Date - 2023-11-28T11:25:40+05:30
సనాతన ధర్మం కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశమే కాదని అది శాస్ర్తీయంగా మానవాళికి మేలు కలిగించే జీవన విధానమని
- గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
మంగళ్‌హాట్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మం కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశమే కాదని అది శాస్ర్తీయంగా మానవాళికి మేలు కలిగించే జీవన విధానమని రుజువు చేయబడిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai Soundararajan) అన్నారు. సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో 45 రోజుల పాటు నిర్వహించిన భారత భాగ్య సమృద్ధి యజ్ఞంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రధాన యాగస్థలిలో ప్రదక్షణలు చేసి, వేదాశీస్సులు పొందారు. అనంతరం యజ్ఞ నిర్వాహకురాలు మాధవి లత కొంపెల్ల.. గవర్నర్‌ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 45 రోజులపాటు యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని శివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఓంకారం నిరంతరం పలకడం మానవ శరీరానికి, మానసికంగా ఎంతో మేలు చేస్తుందని నిరూపణ అయిందన్నారు. మానవ నాడిపై ఓంకారం ఎంతో ప్రభావం చూపుతుందని చెప్పారు. ఇలాంటి యజ్ఞాలు సమాజంలో చెడు ప్రభావాన్ని తగ్గించి మంచిని పెంచుతాయని వివరించారు.
యజ్ఞ నిర్వాహకురాలు మాధవి లత కొంపెల్ల మాట్లాడుతూ.. సోమవారం యజ్ఞం ముగిసిందని తెలిపారు. హాజరైన వారికి అభినందనలు తెలిపారు. నిర్వాహకులు, ఉమ్మడి రాష్ట్ర బజరంగ్‌దళ్ మాజీ అధ్యక్షుడు యమన్‌సింగ్, ప్రమోద్‌కుమార్, ఆర్‌ఎల్‌ఎన్. రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-28T11:25:42+05:30 IST