TS News: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై గవర్నర్ సీరియస్
ABN, First Publish Date - 2023-06-16T15:31:09+05:30
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని వీసీని గవర్నర్ ఆదేశించారు. ఇద్దరు విద్యార్థినులు కూడా ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత(17) హాస్టల్ భవనం నాలుగో అంతస్థు నుంచి కింద పడింది. ట్రిపుల్ ఐటీ సిబ్బంది వెంటనే ఆమెను నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లిఖిత మృతి చెందింది.
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే యూనివర్సిటీలో దీపిక అనే విద్యార్థిని బాత్ రూంలో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆ ఘటనను మరువక ముందే అనుమానాస్పద స్థితిలో హాస్టల్ భవనం పై నుంచి మరో విద్యార్థిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) సీరియస్ అయ్యారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని వీసీని గవర్నర్ ఆదేశించారు. ఇద్దరు విద్యార్థినులు కూడా ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత(17) హాస్టల్ భవనం నాలుగో అంతస్థు నుంచి కింద పడింది.
గమనించిన ట్రిపుల్ ఐటీ సిబ్బంది వెంటనే ఆమెను క్యాంపస్‌లోని ఆస్పత్రికి.. తర్వాత భైంసాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లిఖిత మృతి చెందింది. భవనం పై నుంచి పడటంతో ఆమె వెన్నుపూసకు బలమైన గాయాలయ్యాయి. కాగా, లిఖిత మృతికి కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. ఆమె యూట్యూబ్ చూస్తూ ప్రమాదవశాత్తు భవనం సైడ్ వాల్ పై నుంచి కింద పడిందని, విద్యార్థినిది ఆత్మహత్య కాదని వీసీ వెంకటరమణ ప్రకటించారు. మరోవైపు, కుక్కలు వెంట పడటంతో లిఖిత భయంతో భవనం పైకెక్కిందని, అక్కడి నుంచి కింద పడిపోయిందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. లిఖిత ప్రమాదవశాత్తు కింద పడిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధికారుల ఒత్తిడితోనే వారు అలా ఫిర్యాదు చేశారనే విమర్శలున్నాయి. మరోవైపు ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.
Updated Date - 2023-06-16T15:31:09+05:30 IST