Fish medicine: ముగిసిన చేప మందు పంపిణీ.. ఈసారి ఆశించిన స్థాయిలో..
ABN, First Publish Date - 2023-06-10T09:17:20+05:30
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు పంపిణీ ముగిసింది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప మందు (Fish Medicine) పంపిణీ ముగిసింది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 2 లక్షల మందికి బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేశారు. ఈరోజు ఉదయానికి చేప మందు పంపిణీ ముగియగా.. కేవలం క్యూ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే నిర్వాహకులు చేప మందును పంపిణీ చేస్తున్నారు. ప్రతీసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేప మందు కోసం వస్తుంటారు. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో ఆస్తమా బాధితులు రాలేదని తెలుస్తోంది.
నిన్న(శుక్రవారం) ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేప మందు కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఒకరోజు ముందే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీస్ అధికారులు ఆంక్షలు విధించారు.
అలాగే చేప మందు వచ్చే ప్రయాణీకుల కోసం 9, 10వ తేదీలలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతల నుంచి 80 బస్సులు ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-06-10T09:17:20+05:30 IST