BiBi Nagar: ఇప్పుడు బీబీనగర్‌లో ల్యాండ్ గానీ ఇల్లు గానీ కొంటే జరిగేదేంటంటే..
ABN, First Publish Date - 2023-08-15T22:09:20+05:30
ఉప్పల్, బీబీనగర్ మెట్రో కారిడార్ ఏర్పాటు కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోనుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బీబీనగర్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది.
బీబీనగర్ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఇప్పటికే పారిశ్రామికవాడ, ఎయిమ్స్‌తో బీబీనగర్ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. విశాలమైన జాతీయ రహదారి దాని వెంటే రెండు లేన్ల రైల్వే మార్గానికి మెట్రో తోడవడంతో ప్రయాణం సులభతరం కానుంది. దీంతో హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న బీబీనగర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందనుంది. ఓవైపు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే ఇక్కడ విల్లాలు,ఫాంహౌస్‌లు నిర్మించుకోగా, వ్యాపారవేత్తలు భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉప్పల్, బీబీనగర్ మెట్రో కారిడార్‌తో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. గ్రేటర్ హైదరాబాద్‌కు బీబీనగర్ కేవలం 25 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఘట్కేసర్ ఔటర్ దాటి ముందుకురాలేదు. ఒకవేళ మెట్రో కార్యరూపం దాల్చితే మాత్రం సిటీ పరిధి వేగంగా బీబీనగర్ వరకు విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే పారిశ్రామిక పట్టణంగా పేరు గడించగా ప్రతిష్టాత్మకమైన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ రాకతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. విశాలమైన జాతీయ రహదారి దాని వెంటే రెండు లేన్ల రైల్వే మార్గానికి మెట్రో తోడవడంతో మెరుగైన రోడ్డు, రవాణా, ప్రయాణ సౌకర్యాలను అందిపుచ్చుకుంది. దీంతో ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధితోపాటు వాణిజ్య, వ్యాపారాలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడానికి ఇతరత్రా వ్యాపార, వాణిజ్య సంస్థలు నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. దీంతో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రజల జీవన స్థితిగతుల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రజల్లో ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. దీంతో రానున్న రోజుల్లో బీబీనగర్ ముఖచిత్రం మారనుంది.
మహానగరాలకే పరిమితమైన మెట్రో రైలు ఇప్పుడు గ్రామీణ పట్టణం బీబీనగర్‌కు రాబోతుంది. రాజధాని నగరం హైదరాబాద్‌ను ఊపిరాడకుండా చేస్తున్న ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఔటర్ చుట్టూ మెట్రో మార్గాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫేజ్-3 కింద రూ.60వేల కోట్లతో 278కిలోమీటర్ల మేర ఎనిమిది మెట్రో కారిడార్లకు రూపకల్పన చేసింది. ఇందులో ఒకటి ఉప్పల్ నుంచి ఓఆర్‌ఆర్ ఘట్కేసర్ మీదుగా బీబీనగర్ వరకు రూ.6,900కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ప్రాజెక్టు కార్యరూపం దాల్చి నాలుగేళ్లలో పూర్తి చేసినట్లయితే బీబీనగర్ ముఖ చిత్రమే మారిపోనున్నది.
మెరుగుపడనున్న ప్రయాణ సౌకర్యాలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరువలో 163వ జాతీయ రహదారిపై ఉన్న బీబీనగర్ పట్టణానికి ఇప్పటికే విశాలమైన రోడ్డు మార్గంతోపాటు రెండు లేన్ల రైల్వేమార్గం కూడా ఉండగా, ఇప్పుడు మెట్రోలైన్ అదనంగా చేరనుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింతగా మెరుగుపడనున్నది. గ్రేటర్ హైదరాబాద్‌కు చేరువలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉండడం మరింత కలిసి వచ్చే అంశం, హైదరాబాద్ నగరానికి జిల్లా పరిధి 50 కిలోమీటర్ల దూరం మించి ఉండదు. దీంతో సరిహద్దు జిల్లా జనగాంలోని పరిధిలోని కొన్ని ప్రాంతాలతో పాటు యాదాద్రి జిల్లాలోని ఆలేరు, రాజాపేట, మోత్కూరు, ఆత్మకూర్(ఎం), యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ తదితర మండలాల నుంచి వేలాది మంది విద్య, ఉద్యోగం, వ్యాపార రీత్యా నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అలాగే సిటీలో ఉంటూ జిల్లాలోని పలు మండలాల్లో ఉద్యోగాలు చేసేవారు. వ్యాపారాలు నిర్వహించే వారు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు. దీంతో ఉదయం సాయంత్రం సమయాల్లో ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఊపిరాడనంతగా కిక్కిరిసిపోతాయి. దీంతో నిత్యం ప్రయాణం చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సొంత వాహనాల్లో రాకపోకలు కొనసాగించే వారి వల్ల ఉదయం, సాయంత్రం సమయాల్లో రహదారులన్నీ రద్దీగా మారి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్తగా మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి చేరితే జిల్లా ప్రజలకు మెరుగైన వేగవంతమైన ప్రయాణం సులభతరంకానుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, హైదరాబాద్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే వెసులుబాటు దొరుకుతుంది.
ఊపందుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఉప్పల్, బీబీనగర్ మెట్రో కారిడార్ ఏర్పాటు కానుండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోనుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బీబీనగర్ ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్‌కు చేరువలో హెచ్‌ఎండీఏ పరిధిగల ఇక్కడ స్థిరాస్థుల కొనుగోలుకు హైదరాబాద్‌వాసులు ఆసక్తి చూపిస్తుండడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో భూముల ధరలు బాగా పెరిగాయి. మెట్రో రైలు రాకతో ఘట్కేసర్ ఔటర్ నుంచి బీబీనగర్ వరకు జాతీయ రహదారికి ఇరువైపుల నివాస సముదాయాలు రానున్నాయి. ఇండిపెండేంట్ హౌజ్, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లతోపాటు కొత్త కొత్త కాలనీలు ఏర్పాటుకానున్నాయి. దీంతో నగర శివారులోని బీబీనగర్ ప్రాంతంలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవాలనే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. నివాస సముదాయాలకనుగుణంగా విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు వెలుస్తాయి. దాంతో హైదరాబాద్ సిటీ పరిధి బీబీనగర్‌కు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. దీంతో ఇక్కడి భూముల రేట్లు, ప్లాట్ల స్థలాలు మరింతగా పెరగనున్నాయి.
Updated Date - 2023-08-15T22:09:23+05:30 IST