Telangana Elections: నిద్రపోతున్న హైదరాబాద్ నగరం.. తక్కువ పోలింగ్ నమోదు
ABN, First Publish Date - 2023-11-30T15:41:03+05:30
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ హడావుడి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా.. రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతోంది.
Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ హడావుడి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా.. రూరల్ ఏరియాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అవుతోంది. కానీ.. హైదరాబాద్ నగరంలో మాత్రం తక్కువ పోలింగ్ నమోదవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ వంటి సినీ తారలతో పాటు ఇతర ప్రముఖులు బాధ్యతగా ఓటు వేస్తుంటే.. నగర ప్రజలు మాత్రం ఇంట్లో నిద్రపోతున్నారు.
నిజానికి.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి.. అందరూ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పోలింగ్ నాడు సెలవు ప్రకటించారు. అయినా సరే.. నగరవాసులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ కేంద్రాలతో పాటు రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇళ్లకే పరిమితం అయ్యారే తప్ప, పోలింగ్ బూత్‌లవైపు పావులు కదపడం లేదు. ఒంటి గంట వరకు హైదరాబాద్‌లో 20 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యిందంటే, పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి.
ఈ ఒక్కసారే కాదు.. గతంలోనూ హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులే వెలుగు చూశాయి. నగరవాసులు తమ ఓటు హక్కును పెద్దగా వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఈసారి అలా జరగకుండా.. నగర ఓటర్లంతా బయటకు రావాలని ఈసీ పిలుపునిచ్చింది. ప్రత్యేకంగా సెలవు కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఓటర్లు బయటకు రావడం లేదు. దీంతో.. పోలింగ్ వేళ నగర ప్రజలు ఇంటి నుంచి బయటకు రారని, ఓటు వేసేందుకు ఆసక్తి చూపరన్న అపవాదుకి మరింత బలం చేకూరింది.
ఒకవైపు అక్షరాస్యత తక్కువగా ఉండే పల్లె ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నికలను పండుగలా భావించి పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తుంటే.. ఓటు విలువ తెలిసిన నగర వాసులు మాత్రం ఇళ్లల్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. అభివృద్ధి, అక్షరాస్యత, విలువల గురించి ఎన్నెన్నో లెక్చర్లు ఇచ్చే నగరవాసులు.. ఇలాంటి అసలైన సమయాల్లో మాత్రం ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం నిజంగా దారుణం. ఇలాంటప్పుడు మార్పు ఎలా వస్తుంది?
Updated Date - 2023-11-30T15:41:05+05:30 IST