MLC Kavita: మేడమ్‌కు 33%
ABN, First Publish Date - 2023-03-11T02:39:00+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. సౌత్ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ పిళ్లై కవిత బినామీయేనని పునరుద్ఘాటించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు అందిన ముడుపులు!
సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడి
కేజ్రీవాల్‌తో కవితకు రాజకీయ సంబంధాలు
ఆమె పాత్రను ప్రత్యేకంగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ
ఆప్ నేతలకు ముడుపులపైనా మరిన్ని సాక్ష్యాలు
ఆ సొమ్మును గోవా ఎన్నికల్లో ఉపయోగించారు
నేడు కవితను విచారించనున్న ఈడీ
పిళ్లై, సిసోడియాతో కలిపి ప్రశ్నించే అవకాశం?
ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు రంగం సిద్ధం!
వాంగ్మూలం ఉపసంహరణకు అనుమతివ్వండి
సీబీఐ కోర్టులో పిళ్లై పిటిషన్.. ఈడీకి నోటీసులు
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. సౌత్ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ పిళ్లై కవిత బినామీయేనని పునరుద్ఘాటించింది. ఈ కుంభకోణంలో ‘మేడమ్ (కవిత)కు 33 శాతం’ ముడుపులు అందినట్లు పేర్కొంది. మొత్తం వ్యవహారాన్ని సిసోడియా, ఆప్ నేతల ప్రతినిధి అయిన విజయ్ నాయర్ నడిపారని.. కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్‌రెడ్డి, రాఘవ్‌రెడ్డితో కూడిన సౌత్ గ్రూప్‌తో కుమ్మక్కయ్యారని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించిన మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. కవిత శనివారం విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ రిమాండ్ రిపోర్టులో మద్యం కుంభకోణంలో ఆమె పాత్రపై మరింత స్పష్టత ఇచ్చింది. దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
నాయర్‌ను కలిసిన కవిత..
ఆప్ అగ్రనేతలతో ఉన్న రాజకీయ అవగాహనలో భాగంగానే 2021 మార్చి 19-20 తేదీల్లో కవిత విజయ్ నాయర్‌ను కలుసుకున్నారని ఈడీ తెలిపింది. ఈ విషయాన్ని ఆడిటర్ బుచ్చిబాబు తెలిపారంటూ ఆయన వాంగ్మూలాన్ని ఉటంకించింది. విజయ్ నాయర్ తరఫున సౌత్ గ్రూప్ నుంచి దినేశ్ అరోరా ద్వారా గోవాకు చెందిన చారియట్ ప్రొడక్షన్స్ డబ్బులు వసూలు చేసిందని, గోవాలో ఈ సంస్థ ఆప్ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూప్ నుంచి విజయ్ నాయర్‌కే గాక.. అభిషేక్ బోయినపల్లికి, అక్కడి నుంచి దినేశ్ అరోరా, అక్కడి నుంచి రాజేశ్ జోషి, అక్కడి నుంచి చారియట్ ప్రొడక్షన్స్‌కు డబ్బులు మళ్లించిన వైనాన్ని చార్టుల ద్వారా వివరించింది. సిసోడియా ఢిల్లీ మద్యం విధానం నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించడం, లాభాల మార్జిన్‌ను 6 నుంచి 12 శాతానికి పెంచడం వంటి అనేక అక్రమాలకు పాల్పడిన విషయాన్ని ఈడీ సాక్ష్యాధారాలతో సహా రిమాండ్ రిపోర్టులో తెలియజేసింది. అంతేగాక కుంభకోణంలో కవిత పాత్రను ప్రత్యేకంగా పేర్కొంది.
హవాలా మార్గంలో ముడుపులు
హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో విజయ్ నాయర్ తరఫున దినేశ్ అరోరా.. అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అర్జున్ పాండేను కలుసుకుని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.20-30 కోట్లు హవాలా ద్వారా మళ్లించే విషయంపై చర్చించినట్లు ఈడీ తెలిపింది. 2021 జులై-అక్టోబరు మధ్య దినేశ్ అరోరా ఈ డబ్బును తీసుకొచ్చారని వెల్లడించింది. అభిషేక్ బోయినపల్లి లేదా ఆయన కజిన్ లుపిన్ ఒక నోటు నంబరు ఇచ్చేవారని, దాని ఆధారంగా సుధీర్ లేదా రాజేశ్ ఢిల్లీలో డబ్బు వసూలు చేసుకునేవారని వివరించింది. ఒకసారి దినేశ్ అరోరా స్వయంగా బెంగాలీ మార్కెట్‌లోని హవాలా ఆపరేటర్ నుంచి రూ.కోటి వసూలు చేసుకున్నట్లు తెలిపింది. కవిత భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్‌కు అక్రమ ప్రయోజనాలు ఎలా దక్కాయన్న విషయాన్ని ఈడీ మరోసారి వివరించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వామ్యం కల్పించడం, అతిపెద్ద ఉత్పత్తిదారుల్లో ఒకరైన పెర్నార్డ్ రికార్డ్‌కు ఇండోస్పిరిట్స్‌ను పంపిణీదారుగా చే యడం, సౌత్ గ్రూప్ పలు రిటైల్ జోన్లను చేపట్టేందుకు అనుమతించడం.. ఈ ప్రయోజనాల్లో భాగమని తెలిపింది. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్‌లో 65 శాతం వాటాను అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్‌కు ఇచ్చారని.. నిజానికి వారే కవితకు, మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు బినామీలని వెల్లడించింది.
నేడు ఈడీ కార్యాలయానికి కవిత
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మద్యం కుంభకోణం విషయంలో ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అమిత్ అరోరా, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాలు కవిత పాత్రపై ఇప్పటికే వాంగ్మూలాల్లో స్పష్టంగా వివరించారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో మద్యం విధానం రూపకల్పనకు సంబంధించి జరిగిన సమావేశంలో కవిత పాల్గొన్నట్లు ఈడీ పలు సందర్భాల్లో కోర్టుకు తెలిపింది. కాగా, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినల్లి, మాగుంట రాఘవరెడ్డితో పాటు ఇతరులతో ఉన్న వ్యాపార సంబంధాలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గం ద్వారా చెల్లించిన ముడుపులు.. ఇండోస్పిరిట్స్ కంపెనీలో అరుణ్ పిళ్లై పేరిట ఉన్న 32.5 శాతం వాటాలు.. వంటి అంశాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించనున్నారు.
ముగ్గురినీ కలిపి ప్రశ్నించే అవకాశం?
కవితకు బినామీగా చెబుతున్న పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను శుక్రవారం కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేర్వేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశముందని ఈడీ వర్గాలు తెలిపాయి. విడిగా కూడా కవితను ప్రశ్నిస్తారు. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. మరోవైపు కవిత కూడా పలుసార్లు ఫోన్లు మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న క్రమంలో వాటిపైనా ప్రశ్నించే అవకాశం ఉంది. విచారణకు సహకరించపోతే కవితను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా మందిని ఈ కారణంతోనే ఈడీ అరెస్టు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది.
కవిత పాత్రపై బుచ్చిబాబు ఏం చెప్పారంటే..
కేజ్రీవాల్, సిసోడియాలతో కవితకు రాజకీయ అవగాహన ఉంది. వారి ప్రతినిధి విజయ్ నాయర్‌ను ఆమె కలుసుకున్నారు.
మద్యం విధానాన్ని ఆప్ నేతల తరఫున నాయరే రూపొందించారు. ఈ విధానంలో తాను ఏ మార్పులు చేయగలనో కవితకు వివరించారు.
ఆప్‌కు నిధులు సమకూరిస్తే.. విధానంలో మార్పుల ద్వారా తాను ఏ ప్రయోజనాలు సమకూర్చగలనో ఆయన కవితకు తెలియజేశారు.
2021 ఆగస్టు 17న ఒక వాట్సాప్ సందేశంలో ‘వియ్ నీడ్స్ మనీ’ అని ఉంది. అంటే విజయ్ నాయర్‌కు ముడుపులు అవసరమని అర్థం.
2021 ఆగస్టు 24న మాగుంట రాఘవరెడ్డికి పంపిన వాట్సాప్ సందేశంలో ‘సమీకి 33, మీకు 33, మేడమ్‌కు 33 కోసం ప్రయత్నిస్తా’ అని బుచ్చిబాబు వెల్లడించారు. అంటే సమీర్‌కు 33 శాతం, మాగుంట రాఘవరెడ్డికి 33 శాతం, కవితకు 33 శాతం అని అర్థం. (ఇక్కడ మేడమ్ అంటే కవిత అని స్పష్టమవుతోంది)
ఆప్ నేతలతో కుదిరిన ఒప్పందంలో భాగంగా కవితకు సమీర్ కంపెనీలో భాగస్వామ్యం, పెర్నార్డ్ రికార్డ్ పంపిణీలో వాటా కల్పించారు.
మొత్తం రూ.100 కోట్ల ముడుపులు హవా లా మార్గంలోనే చెల్లించారు. కాగా, మంత్రిమండలికి సమర్పించడానికి రెండు రోజుల ముందే ఢిల్లీ మద్యం విధానం సిగ్నల్ యాప్ ద్వారా విజయ్ నాయర్.. బుచ్చిబాబుకు అందజేశారని ఈడీ తెలిపింది.
వాంగ్మూలం ఉపసంహరణకు అనుమతివ్వండి: పిళ్లై
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అరుణ్ పిళ్లై మాట మార్చారు. ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవలే అరెస్టయిన పిళ్లై.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. కవితకు తాను బినామీగా వ్యవహరించానని ఈడీకి ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఇండోస్పిరిట్స్ కంపెనీలో ఆయనకున్న 32.5 శాతం వాటాలు కవితవేనని ఈడీ కోర్టుకు తెలిపింది. మద్యం వ్యాపారంలో గడించిన లాభాల్లో ఇండోస్పిరిట్స్ కంపెనీ నుంచి పిళ్లై ఖాతాకు రూ.33 కోట్ల మేర బదిలీ చేసినట్లు కోర్టుకు తెలియజేసింది. పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్ల విలువైన స్థలాన్ని ఈడీ జనవరి 25న అటాచ్ చేసింది. అయితే, కవితను విచారించడానికి ఒక్క రోజు ముందు పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
కవిత, సిసోడియా కలిసే కుట్ర చేశారు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో 292 కోట్ల అక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తించాం
మనీశ్‌ను పది రోజుల కస్టడీకి ఇవ్వండి
రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు
17 దాకా కస్టడీకి ఇచ్చిన న్యాయస్థానం
న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర గురించి ఈడీ మరోసారి ప్రస్తావించింది. కవిత, మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, ఇతరులు కలిసే కుట్ర పన్నారని ఆరోపించింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గురువారం అరెస్టు చేసిన ఈడీ.. శుక్రవారం రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఎదుట ఆయన్ను ప్రవేశపెట్టింది. సిసోడియాను 10 రోజులపాటు తమకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. వారంరోజులపాటు (ఈ నెల 17వ తేదీ వరకూ) ఈడీ కస్టడీకి అనుమతించారు. విచారణ సందర్భంగా ఈడీ తరఫున న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపించారు. సౌత్ గ్రూపునకు ప్రయోజనం కలిగేలా..కొన్ని ప్రైవేటు సంస్థలు భారీ లబ్ధి చేకూర్చేలా.. మద్యం విధానంలో మార్పులు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విధానానికి సంబంధించి ప్రజలు, భాగస్వాముల నుంచి సలహాలు, సూచనలను కేవలం కంటితుడుపుచర్యగా మాత్రమే స్వీకరించారని వెల్లడించారు. కార్టలైజేషన్‌కు అనుకూలంగా ఉండేలా.. మంత్రుల బృందం (జీవోఎం) నివేదికలో సంస్థల నిర్వచనాన్ని నీరుగార్చిందని తెలిపారు. దీనిపై తాను సూచనలు చేసినప్పటికీ.. మనీశ్ సిసోడియా వాటిని పట్టించుకోలేదని అప్పటి ఆయన కార్యదర్శి వెల్లడించారని చెప్పారు.
మంత్రివర్గానికి జీవోఎం నివేదిక సమర్పించే రెండు రోజుల ముందు.. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఆ నివేదికలోని అంశాలు చేరాయని వెల్లడించారు. ఈ మొత్తం కుట్రను విజయ్ నాయర్ సమన్వయం చేశారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూపు దాదాపు రూ.100 కోట్ల మేర ముడుపులు చెల్లించిందని.. ఆ నగదును హైదరాబాద్ నుంచే ఢిల్లీకి తరలించారని తెలిపారు. తద్వారా ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతం వాటాను ఒక పెద్ద కార్టెల్ చేజెక్కించుకుందని స్పష్టం చేశారు. లాభంలో 12 శాతం మార్జిన్‌ను ఏకపక్షంగా చేర్చారన్నారు. విజయ్‌నాయర్ సిసోడియా తరఫున ప్రతినిధిగా వ్యవహరించారని.. ఆయన్ను కవిత కలిసినట్లు వాంగ్మూలాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
పార్టీ ఫండ్స్ విషయంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అమిత్ అరోరాతో ఫోన్‌లో మాట్లాడారని వెల్లడించారు. ఇండోస్పిరిట్స్ కంపెనీకి ఎల్1 లైసెన్సు లభించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని, జెట్‌స్పీడ్‌లో దరఖాస్తులు వచ్చాయని, కొద్ది రోజుల వ్యవధిలోనే వాటిని ఆమోదించి లైసెన్సులు కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలను సిసోడియా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఏడాది వ్యవధిలో 14 ఫోన్లను ఆయన ధ్వంసం చేయడం లేదా మార్చడం చేశారని పేర్కొన్నారు. ఇతరుల పేరిట ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్లు కొనుగోలు చేశారని, ఇతరుల పేర్ల మీద సిమ్ కార్డులు పొందారని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో దాదాపు రూ.292 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. మనీశ్ సిసోడియాతో కొంతమందిని ముఖాముఖిగా కూర్చోబెట్టి (కన్‌ఫ్రంటేషన్) ప్రశ్నించాల్సి ఉందని, అందుకు తాము ఏడుగురికి నోటీసులు జారీ చేశామన్నారు. 10 రోజుల పాటు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈడీకి పరిధి లేదు..
సిసోడియా తరఫున న్యాయవాది దయన్ కృష్ణన్ వాదిస్తూ.. మద్యం విధానంలో లోపాలు ఉన్నాయని ఈడీ వాదిస్తోందని, ఆ పరిధి ఈడీకి లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్వరూపం ప్రకారం అది కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధించిన అంశమని, ప్రజల కోసం విధానాలను రూపొందించడం అధికార విధి అని తెలిపారు. మద్యం విధానంలో 12 శాతం మార్జిన్లపై లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా సిసోడియా వద్ద లభించలేదని, సిసోడియా తరఫున విజయ్ నాయర్ ప్రతినిధిగా వ్యవహరించారనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ కేసులో సిసోడియాకు ఈడీ ఇంతకుముందెప్పుడూ నోటీసులు జారీ చేయలేదని.. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌కు విచారణకు వస్తున్న ఒకరోజు ముందు అరెస్టు చేసిందని, ఈ విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆయనను నిర్భందంలోనే ఉంచాలన్న దురుద్దేశంతో ఈడీ అరెస్టు చేసిందని పేర్కొన్నారు. సిసోడియా తరఫున వాదనలు వినిపించిన మరో న్యాయవాది మోహిత్ మథుర్.. ఈ కేసులో కస్టడీకి కోరే అధికారం ఈడీకి లేదన్నారు. పైగా ఈ కేసులో ఏడేళ్లకు మించి శిక్ష పడబోదని స్పష్టం చేశారు. సిసోడియా తరఫున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్.. ఫలానా రాజకీయ నేతలు డబ్బులు తీసుకున్నారని ఆరోపించి జైలుకు పంపించడం సులభమని, ఇలాంటి చర్యలను ఆమోదిస్తే మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 19 అవసరం ఉండదని వాదించారు. కాగా.. సీబీఐ కేసులో మనీశ్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 21కి కోర్టు వాయిదా వేసింది.
సిసోడియాను ప్రహ్లాదుడితో పోల్చిన కేజ్రీ!
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన మనీశ్ సిసోడియాను ప్రహ్లాదుడితో పోల్చారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అయితే ఆ మాట నేరుగా అనకుండా.. పురాణాలను ప్రస్తావిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘హిరణ్యకశిపుడు తనను తాను దేవుడిగా భావించుకోవడం మొదలుపెట్టి.. దేవుడి బాటలో నడుస్తున్న ప్రహ్లాదుణ్ని అడ్డుకోవడానికి పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ప్రహ్లాదుడిపై పలు వేధింపులకు పాల్పడ్డాడు. అదే కోవలో ఈ రోజుల్లో కూడా కొంతమంది తమను తాము దేవుడుగా భావించుకోవడం మొదలుపెట్టారు. దేశానికి, పిల్లలకు సేవచేస్తున్న ప్రహ్లాదుణ్ని జైల్లో పెట్టా రు. కానీ అప్పుడూ ప్రహ్లాదుణ్ని ఆపలేకపోయారు. భవిష్యత్తులోనూ ఆపలేరు’’అని కేజ్రీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-03-11T02:42:18+05:30 IST