KCR: బండారం బయటపడుతుందనే.. విశ్వగురువులే అవసరం లేదు.. దేశ గురువులుంటే చాలు
ABN, First Publish Date - 2023-02-12T16:43:38+05:30
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విమర్శలు గుప్పించారు. ఒక్క వందే భారత్ రైలును మోదీ ఎన్ని సార్లు ప్రారంభిస్తారు?, బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడైందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి లిఫ్ట్‌లను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని, ఇదేనా దేశాన్ని నడిపే పద్ధతి? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశాన్ని ముంచాయని, కేంద్రం జనాభా లెక్కలు ఎందుకు చేయడం లేదు?, 140 ఏళ్లలో ఒక్కసారి కూడా జనాభా లెక్కలు ఆగలేదని కేసీఆర్ అన్నారు.
తన బండారం బయటపడుతుందనే జన గణన చేయడం లేదని, జనాభా లెక్కులు లేకుండా ఏ దేశంలో పాలన సాగడం లేదని కేసీఆర్ గుర్తు చేశారు. దేశానికి ఓ లక్ష్యం అంటూ ఉందా?, ఏటా 50 వేల టీఎంసీల నీరు వృధాగా పోతోందని మండిపడ్డారు. దేశంలో నీటి కోసం యుద్ధాలు ఎందుకు?, ఈ పరిస్థితులు పోవాలంటే రైతు రాజ్యం రావాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీతో కాలేదు కాబట్టే... బీఆర్‌ఎస్ పుట్టిందని, తమ నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటైనా ఎందుకు వేయాలి?, కేంద్రం తీరుతో తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
వడ్లు కొనమంటే నూకలు తినమంటూ అహంకారంతో మాట్లాడారని, వడ్లు పండించడంలో పంజాబ్‌తో పోటీ పడుతున్నామని, త్వరలో తెలంగాణ మొదటి స్థానంలోకి వస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ వేసి 20 ఏళ్లు దాటిందని, కేంద్రానికి నీళ్ల లెక్కలు తేల్చడం చేతకావడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. 40 వేల టీఎంసీలు ఇస్తే దేశంలో నీటి యుద్ధాలే ఉండవని, దీనికి విశ్వగురువులే అవసరం లేదు.. దేశ గురువులుంటే చాలు అని, దేశానికి కొత్త ఇరిగేషన్ పాలసీ అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతి ఎకరానికి.. ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామని, రాబోయేది తమ ప్రభుత్వమే.. చెప్పింది చేసి చూపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-02-12T16:47:30+05:30 IST