Himanshu Kalvakuntla: సీఎం మనవడు వెళ్లే దారిలో సొబగులు సరే కానీ..
ABN, First Publish Date - 2023-07-12T12:53:54+05:30
కేశవనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తరగతి గదుల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, బెంచ్‌లు, వంటి సదుపాయాలతో పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా హిమాన్షు ఏర్పాటు చేయించారు. బుధవారం హిమాన్షు రావు పుట్టిన రోజు సందర్భంగా ఆ పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
సీఎం మనవడా.. మజాకా?
హుటాహుటిన రోడ్లకు మరమ్మతులు
ఆ దారిలో చెత్త తొలగింపు
నేడు కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల ప్రారంభం
సుమారు రూ. కోటి నిధులు సేకరించి.. సదుపాయాలు కల్పించిన హిమాన్షు
వయసులో చిన్నవాడైనా.. ఆయన ముఖ్యమంత్రి మనవడు.. ఓ మంత్రికి తనయుడు.. ఇంకేముంది ఆయన వస్తున్నారంటే అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. ఏళ్ల తరబడి గుంతలమయమైన రోడ్డుకు మరమ్మతులు చేశారు. ఆయన వచ్చి, వెళ్లే దారిలో చెత్త తొలగించారు. ఓ రకంగా స్థానికులకు ఇది మంచిదే అయినా, అదే ప్రాంతంలో మిగతా చోట్ల దుర్భరంగా ఉన్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే, ఆయన వచ్చే మార్గంలో తీసిన చెత్తను పక్క వీధిలో డంప్ చేయడం గమనార్హం.
రాయదుర్గం (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు వస్తుండడంతో గౌలిదొడ్డి గ్రామంలోని కేశవనగర్‌కు మహర్దశ పట్టింది. కొన్ని సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను ఒక్కరోజులో పరిష్కరించి జీహెచ్‌ఎంసీ అధికారులు తమ భక్తిని చాటుకున్నారు. ఖాజాగూడ గ్రామంలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్‌లో సీఎం మనవడు చదువుతున్నారు. ఇదే స్కూల్‌కు చెందిన విద్యార్థులు కమ్యూనిటీ యాక్సెస్ సర్వీస్‌లో భాగంగా కేశవనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పేవారు. ఆ పాఠశాలలో కనీస సదుపాయాలు లేకపోవడంతో పాఠశాల రూపురేఖ మార్చాలని హిమాన్షు భావించారు.
దీంతో ఆయన సీఎస్‌ఆర్ కింద నిధుల సమీకరణ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థుల ద్వారా సుమారు. రూ. 90 లక్షలు సేకరించారు. ఆ నిధులతో కేశవనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తరగతి గదుల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, బెంచ్‌లు, వంటి సదుపాయాలతో పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఏర్పాటు చేయించారు.
బుధవారం హిమాన్షు రావు పుట్టిన రోజు సందర్భంగా ఆ పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమెతో పాటు హిమాన్షు వస్తుండటంతో జీహెచ్‌ఎంసీ సర్కిల్ -20 అధికారులు మంగళవారం తెల్లవారు జాము నుంచే కేశవనగర్ బస్తీలో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్డు మరమ్మతులు చేశారు.
ప్రమాదాన్ని వదిలేసి..
సీఎం మనవడు వెళ్లే దారిలో సొబగులు సరే కానీ.. గౌలిదొడ్డి గ్రామం నుంచి కేశవనగర్‌కు వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని అధికారులు పట్టించుకోలేదు. స్తంభం రోడ్డు మధ్యలో ఉండడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అయినా అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ప్రజల సమస్యలు పట్టవా..
మంత్రి, హిమాన్షు వచ్చి వెళ్లే రహదారిని మాత్రమే శుభ్రం చేసి ఆ రోడ్డులో చెత్తను బస్తీ పక్కనే ఉన్న మరో రోడ్డులోకి అధికారులు డంప్ చేశారు. కానీ, మిగతా ప్రాంతాల్లోని పారిశుధ్యాన్ని పట్టించుకోలేదు. కేవలం మంత్రి, హిమాన్షు మెప్పుకోసమే ఆ ప్రాంతంలోని ఓ దారిని శుభ్రం చేసి, బస్తీలోని ఇతర ప్రాంతాల్లోని చెత్త, డ్రైనేజీ సమస్యలను పట్టించుకోక పోవడంపై బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-07-12T12:53:57+05:30 IST