Gangula Kamalakar: నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది.. బొత్సకు గంగుల స్ట్రాంగ్ కౌంటర్
ABN, First Publish Date - 2023-07-13T14:11:16+05:30
ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు అంటూ ఏపీ మంత్రి బొత్ససత్యానారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కరీంనగర్: ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో (Telangana) పోల్చి చూడటం సరికాదు అంటూ ఏపీ మంత్రి బొత్ససత్యానారాయణ (AP Minister Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఫెయిల్ అయిందన్నారు. ‘‘బొత్స సత్యనారాయణ ముందు నువ్వు తెలుసుకో.. నీ దగ్గర ఉన్న గురుకులాలు ఎన్ని.. మా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు.. నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా.. నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది. మా దగ్గర 1009 గురుకులాలు ఉంటే.. నీ దగ్గర 289 కూడా లేవు.. టీఎస్‌పీఎస్సీలో దొంగలను పట్టుకుంది మేమే. ఏపీపీఎస్సీలో సీతారామరాజు అనే దొంగ అడ్డంగా దొరకలేదా. జగన్ దొంగ నాటకాలను ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ మీద ఇంకా కుట్రలేనా’’ అంటూ మంత్రి గంగుల విరుచుకుపడ్డారు.
హిమాన్షు చెప్పింది కరెక్టే...
అలాగే `సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఉమ్మడి పాలన పాపాలను కడిగేస్తున్నామన్నారు. మన ఊరు... మన బడితో పాఠశాల రూపురేఖలు మార్చామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పుకొచ్చారు.
ఇంతకీ హిమాన్షు ఏమన్నారంటే...
అన్ని హంగులతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పుట్టిన రోజు సందర్భంగా హిమాన్షు నిన్న (బుధవారం) ప్రారంభించారు. ఈ పాఠశాలలో పరిస్థితిని చూసి చలించిన హిమాన్షు స్కూల్‌ను దత్తత తీసుకుని, తాను సేకరించిన నిధులతో బడిని ఆధునికీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిమాన్షు భావోద్వేగంగా ప్రసంగించారు. తాను తొలిసారిగా ఈ బడిని సందర్శించినప్పుడు సౌకర్యాల లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చూసి ఎంతో బాధపడ్డానని.. కళ్లలోంచి నీళ్లొచ్చాయని హిమాన్షు పేర్కొన్నారు.
కాగా.. కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ బడుల దుస్థితికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనమంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-07-13T14:17:08+05:30 IST