ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTR : మోదీ పాలనలో బాగుపడ్డది అదానీయే

ABN, First Publish Date - 2023-02-01T03:34:59+05:30

హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈటలకు నీతినిజాయితీ ఉంటే వంద లక్షల కోట్లు అప్పు చేసిన ప్రధాని మోదీ గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు

ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు

ప్రధాని మోదీ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు

రూ.100 లక్షల కోట్ల అప్పు మాత్రం చేశారు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడు

జమ్మికుంట సభలో మంత్రి కేటీఆర్‌ విమర్శలు

ఉద్యోగాలు చేసేవాళ్లుగా కాదు.. ఇచ్చేవాళ్లుగా ఎదగాలి

కమలాపూర్‌లో విద్యార్థులతో కేటీఆర్‌ వ్యాఖ్యలు

రూ.49 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన

కేటీఆర్‌కు ఏబీవీపీ, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తల నిరసన సెగ

జమ్మికుంట/ జమ్మికుంట రూరల్‌, జనవరి 31: హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈటలకు నీతినిజాయితీ ఉంటే వంద లక్షల కోట్లు అప్పు చేసిన ప్రధాని మోదీ గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి జన్‌ధన్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పారని, ఎవరికైనా డబ్బులు అందాయా? అని అడిగారు. మోదీ పాలనలో అదానీ మాత్రమే బాగుపడ్డాడని, ప్రపంచంలోనే కుబేరుడిగా ఎదిగాడని చెప్పారు. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి మోదీ గద్దెనెక్కారని తెలిపారు. ఆ హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. 2014లో పెట్రోల్‌ ధర రూ.70 ఉండేదని, ఇప్పుడు 110 రూపాయలకు చేరిందని.. ఫలితంగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. 14 మంది ప్రధాన మంత్రుల్లో ఏ ఒక్కరూ చేనేత వస్త్రాల మీద పన్ను వేయలేదన్నారు. మోదీమాత్రమే 5 శాతం జీఎస్టీ వేశారని తెలిపారు. ‘మసీదులు తవ్వుదాం.. శవం బయటపడితే మీది, శివం వస్తే మాది’ అంటూ రెచ్చగొట్టే వాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్‌కు మరొకటి చేత కాదని ధ్వజమెత్తారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో పరిశ్రమలు కట్టేందుకు పునాదులు తవ్వుదాం రండి అని పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసలు ఈటల లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారని హుజూరాబాద్‌కు పరిచయం చేసింది కేసీఆర్‌ కాదా అన్నారు. తండ్రి లాంటి కేసీఆర్‌ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఇప్పుడు ఈటల అంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ‘కౌశిక్‌రెడ్డి నువ్వు ఇదే విధంగా కష్టపడు. ఫలితం కచ్చితంగా మనకే అనుకూలంగా ఉంటుంది. నీకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది’ అని కేటీఆర్‌ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు హుజూరాబాద్‌, కమలాపూర్‌ నియోజకవర్గాల్లో సాగు నీళ్ల గోసలు ఎట్లా ఉన్నాయో రైతులు గుర్తు తెచ్చుకోవాలన్నారు. మంత్రి గంగుల కమాలాకర్‌ మాట్లాడుతూ ఫాదర్‌ ఆఫ్‌ తెలంగాణ కేసీఆర్‌ అయితే ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ మన రామన్న అన్నారు. ‘ప్రధాని మోదీ, ఎంపీ బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముగ్గురు బీసీలే కదా.. ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్‌ సమావేశాల తర్వాత కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ తెస్తే, తాను 25 ఏళ్లుగా పెట్టుకుంటున్న బంగారు కడియాన్ని ఈటల, సంజయ్‌కు తొడుగుతా’ అని గంగుల చెప్పారు. కరీంనగర్‌ సర్క్యూట్‌ రెస్ట్‌హౌస్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను కేటీఆర్‌ ప్రారంభించారు.

కేటీఆర్‌ను అడ్డుకునే యత్నం

కరీంనగర్‌లో కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. మంత్రి కాన్వాయ్‌ రెస్ట్‌హౌ్‌సలోకి వస్తుండగా ప్రధాన ద్వారం ఎదుట పోలీసులను ఛేదించుకొని ఏబీవీపీ కార్యకర్తలు కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా మరికొందరు ఏబీవీపీ కార్యకర్తలు కేటీఆర్‌ వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు.

ఉద్యోగాలిచ్చేవాళ్లుగా ఎదగాలి: కేటీఆర్‌

ఓరుగల్లు:‘ఉద్యోగాలు చేసేవాళ్లుగానే కాదు.. ఇచ్చే వాళ్లుగా ఎదగాలి. డ్రోన్‌ కెమెరా కేవలం ఫొటోలను మాత్రమే తీయదు. మహిళల రక్షణకు సైతం ఉపయోగపడుతుందని తెలుసా?’ అని మంత్రి కేటీఆర్‌ విద్యార్థులతో అన్నారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో పర్యటించారు. రూ.49 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బీసీ బాలికల గురుకుల సంక్షేమ పాఠశాల ఆవరణలో విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చదువుకుని ఏమవుతారని విద్యార్థులను ప్రశ్నించారు. మంచి ఉద్యోగాలు చేద్దామని అనుకుంటున్నామని వారు బదులిచ్చారు. దీంతో ‘ఎందుకు ఉద్యోగాలు చేయాలి? మనమే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి కదా?’ అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును పిలిచి.. 10, 11వ తరగతి చదువుతున్న విద్యార్థులను టీహబ్‌లోని టాస్క్‌ సెంటర్‌కు పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక విద్యార్థి కంప్యూటర్‌ ల్యాబ్‌ కావాలని అడగడంతో ప్రిన్సిపాల్‌, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ముఖ్యమంత్రి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తప్పలేదు. కేజీబీవీ పాఠశాల వద్ద ఒక్కసారిగా కేటీఆర్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తూ ఎన్‌ఎ్‌సయూఐ విద్యార్థులు కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. కాగా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ ప్రకారం ఎమ్మెల్యే హాజరుకావాల్సి ఉంటుంది. తనకు ఆహ్వానమే లేనప్పుడు ఎలా హాజరవుతానని ఈటల ప్రశ్నించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనందున ఆహ్వానాన్ని ఆయన పీఏకు అందించామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో ‘శాండోస్‌’ కేంద్రం

హైదరాబాద్‌: ప్రముఖ అంతర్జాతీయ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ శాండోస్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్‌ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఇక్కడ తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత ఆ సంఖ్యను 1800కు పెంచనున్నట్లు ప్రకటించింది. శాండోస్‌ కంపెనీ సీఈవో రిచర్డ్‌ సెయ్‌ నోర్‌ నేతృత్వంలోని బృందం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. శాండోస్‌ కంపెనీ గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-01T03:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising