DAV School Issue: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో ఆకృత్యాలపై నాంపల్లి కోర్టు కీలక తీర్పు
ABN, First Publish Date - 2023-04-18T13:02:21+05:30
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో ఆకృత్యాలపై నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.
హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో (Banjarahils DAV School) ఆకృత్యాలపై నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు (Nampally Fast Track Court) కీలక తీర్పునిచ్చింది. డ్రైవర్ రజనీకుమార్‌కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో డీఏవీ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై డ్రైవర్ రజనీకుమార్ లైంగిక దాడులకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలికపై రజనీకుమార్ పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నించగా.. ప్రిన్సిపాల్ మాధవి.. తన డ్రైవర్‌ను కాపాడేందుకు అనేక మార్లు ప్రయత్నించింది.
ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై చిన్నారి తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. దీంతో అక్టోబర్ 19న రజనీకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించి సాక్ష్యాధారాలను బంజారాహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈరోజు తీర్పు వెలువడింది. డ్రైవర్ రజనీకుమార్‌కు దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రిన్సిపాల్ మాధవిని మాత్రం నాపంల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది.
Updated Date - 2023-04-18T13:07:08+05:30 IST