ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSRTC GOVT Employees : ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వోద్యోగులు

ABN, First Publish Date - 2023-08-01T03:46:13+05:30

అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది.

  • 43,373 మంది ఆర్టీసీ సిబ్బందిని విలీనం చేస్తూ సర్కారు కీలక నిర్ణయం

  • వరద నష్టంపై రూ.500 కోట్ల తక్షణ సాయం

  • రూ.60 వేల కోట్లతో మెట్రో రైలు విస్తరణ

  • గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై

  • శాసనసభలో రెండోసారి తీర్మానం

  • అనాథ పిల్లల సంరక్షణకు ఆర్ఫన్‌ పాలసీ

  • వరంగల్‌ విమానాశ్రయానికి 253 ఎకరాలు

  • హకీంపేట ఎయిర్‌పోర్టు 2వ విమానాశ్రయం

  • మరో ఎనిమిది వైద్య కళాశాలలకు ఆమోదం

  • ఎమ్మెల్సీలుగా దాసోజు, కుర్రా సత్యనారాయణ

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. ఆర్టీసీ సిబ్బంది(RTC staff) దీర్ఘకాలికంగా చేస్తున్న పలు డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌(CM KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet meeting) ఇందుకు ఆమోదం తెలిపింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇక హైదరాబాద్‌ మెట్రోరైలు(Hyderabad Metro Rail) ను మరో 415 కిలోమీటర్లకు విస్తరించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఆరు ప్రాంతాల్లో 113 కిలోమీటర్ల మేర విస్తరించాలన్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. వీటితోపాటు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రెండోసారి తీర్మానం చేయాలని నిర్ణయించింది. ఇక బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రావణ్‌, కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్‌ తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి కేటీఆర్‌(Minister KTR) మీడియాకు వివరించారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకుగాను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకుగాను విధివిధానాల ఏర్పాటుకు అధికారులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో కార్మిక, రవాణా శాఖ కార్యదర్శులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. ఆగస్టు 3న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.

భారీ వర్షాలపై ప్రాథమిక నివేదిక..

రాష్ట్రంలో జూలై 18 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై సమాచారం సేకరించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం సహా.. మొత్తం పది జిల్లాల్లో నష్టం ఎక్కువగా సంభవించినట్లుగా ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మొత్తం నష్టం వివరాలను అంచనా వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన నష్టంపై తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ నిధులతో తాత్కాలిక అత్యవసర మరమ్మతులు చేయనున్నామని వెల్లడించారు. ప్రధానంగా దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లకు తక్షణ మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మందిని ప్రత్యేక కేంద్రాలకు తరలించి ఏర్పాట్లు కల్పించామని, వారందరికీ పునరావాసం కల్పించాల్సిందిగా సీఎం ఆదేశించారని అన్నారు. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 40 మందికి పైగా మరణించారని, వారందరి కుటుంబాలకూ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. వర్షాలతో చెరువులు నిండినందున.. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పంట నష్టంపై పూర్తి నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు. భారీ వర్షాల్లోనూ వృత్తిధర్మాన్ని పాటించిన విద్యుత్తు శాఖ హెల్పర్‌, లైన్‌మెన్‌తోపాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు వినయ్‌ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. ఇక మున్నేరు వాగు వరదలు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తకుండా మున్నేరు నది వెంట ఆర్‌సీసీ గోడ నిర్మించాలని నిర్ణయించామన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదన పంపాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేయడం మానుకొని సహాయం చేయాలని అన్నారు.


గవర్నర్‌ ఆమోదించాల్సిందే

గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్రప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. పంచాయతీరాజ్‌, విద్యాశాఖకు సంబంధించిన కీలక బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగులో ఉన్నాయన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లులపై రెండోసారి తీర్మానం చేసి పంపిస్తామని, అప్పుడు గవర్నర్‌ తప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని, మరో మార్గం ఉండదని అన్నారు. ఇక అనాథ పిల్లల సంరక్షణను రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుంటుందని, వీరిని చిల్డ్రన్‌ ఆఫ్‌ స్టేట్‌గా భావిస్తూ ‘ఆర్ఫన్‌ పాలసీ’ని రూపొందిస్తామని తెలిపారు. అనాథ చిన్నారులు పెరిగి ప్రయోజకులై, ఓ కుటుంబం వారు అయ్యేంతవరకు వారికి రాష్ట్ర ప్రభుత్వమే సంరక్షకుడిగా ఉంటుందన్నారు.

415 కిలోమీటర్లకు విస్తరించనున్న మెట్రో..

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ గుండెకాయ లాంటిదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు, ప్రజారవాణాను విస్తృత పరిచేందుకు మెట్రోరైలును వచ్చే మూడు నాలుగేళ్లలో మరింత విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు. విమానాశ్రయం వరకు పొడిగింపునకు సంబంధించి పనులకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇక పటాన్‌చెరు నుంచి ఇస్నాపూర్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట్‌ వరకు, శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు, ఉప్పల్‌ నుంచి బీబీనగర్‌ వరకు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వరకు కారిడార్లను 113 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట, పారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు 29 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు 136 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ.. కారిడార్‌ను పొడిగించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా 278 కిలోమీటర్ల మేర మూడో దశ విస్తరణకు రూ.60 వేల కోట్లు కానుంది. ఇందులో 142 కిలోమీటర్ల విస్తరణకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా మెట్రోరైలుకు ఆదేశాలు జారీచేశామని కేటీఆర్‌ తెలిపారు. మూడు దశలు కలిపి 415 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌లో మెట్రో నిర్మాణం జరగనుందని చెప్పారు. మెట్రో ఖర్చుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. లేదంటే 2024 తర్వాత కేంద్రంలో ఎలాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, అందులో బీఆర్‌ఎస్‌ పాత్ర కీలకంగా ఉంటుదని, అప్పుడైనా.. కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు అడుగుతామని అన్నారు.

Updated Date - 2023-08-01T04:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising