ఆవిష్కరణల కేంద్రం రెడీ
ABN, First Publish Date - 2023-03-03T03:42:14+05:30
దేశంలోనే అతిపెద్ద హార్డ్‌వేర్ ప్రొటోటైపింగ్ సెంటర్ ‘టి-వర్క్స్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ప్రారంభమైంది.
‘టి-వర్క్స్’ను ప్రారంభించిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు
గ్రామీణ ఆవిష్కర్తలకు మరింత ప్రోత్సాహం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద హార్డ్‌వేర్ ప్రొటోటైపింగ్ సెంటర్ ‘టి-వర్క్స్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ప్రారంభమైంది. ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు గురువారం దీన్ని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. దీని ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టి-వర్క్స్‌ను రాష్ట్రానికి, దేశానికి అంకితం చేయడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ అత్యాధునిక పరికరాలను ఉపయోగించి గ్రామీణ ఆవిష్కర్తల సహకారంతో వెంటిలేటర్, ఎలక్ర్టిక్ వాహనాలు, వ్యవసాయ ఆవిష్కరణలు ఇప్పటికే తయారు చేశామన్నారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఆవిష్కరణ, డిజైన్ ఆలోచనలకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ఆవిష్కర్తలు ఇప్పటికే అనేక విజయాలు సాధించారని, వారి వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలను ఇక్కడ మరింత ప్రోత్సహిస్తామన్నారు. ఐటీ అంటే తన దృష్టిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే కాదని.. ఇండియా, తైవాన్ అని అభివర్ణించారు. భారతదేశం సాఫ్ట్‌వేర్ నైపుణ్యం, తైవాన్ హార్డ్‌వేర్ నైపుణ్యంతో తాము పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తామని, ప్రపంచస్థాయి ఉత్పత్తులతో యువతను బయటకు వచ్చేలా చేయగలమన్నారు.
కేసీఆర్ నాయకత్వంపై ప్రశంసలు
ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు మాట్లాడుతూ టి-వర్క్స్ ఒక కాన్సె్‌ప్టగా అద్భుతంగా ఉందని, ప్రజలకు అవసరమైన అనేక యంత్రాలు ఇక్కడ రూపొందించవచ్చన్నారు. ఈ ప్రపంచ స్థాయి కేంద్రాన్ని వేగంగా నిర్మించడం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చాలా వేగవంతంగా ఉందని, సీఎం కేసీఆర్‌ను కలిశాక ఆయన వివరించిన అభివృద్ధి పనులు చూసి చాలా స్ఫూర్తి పొందానన్నారు. ఏడేళ్లలో ఎంతో వేగంగా అభివృద్ధి పనులు చేశారంటూ ప్రశంసించారు. సీఎంను కలిశాక తమ సంస్థ కూడా వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు వ్యాపారాన్ని చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు. ఈ కేంద్రానికి తాము కూడా సహకారం అందిస్తామని, హై-ఎండ్ ఎలక్ర్టానిక్స్ సర్క్యూట్ బోర్డ్‌లను అసెంబ్లింగ్ చేయడానికి ఉపయోగించే ఎస్‌ఎంటీ (సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ) లైన్‌ను టి-వర్క్స్‌కు విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ఐటీ సంస్థ క్వాల్‌కాం ఇంజనీరింగ్ విభాగం ఉపాధ్యక్షుడు శశిరెడ్డి మాట్లాడుతూ.. త్రీడీ ప్రింటింగ్‌లో కావాల్సిన సహకారాన్ని తమ సంస్థ టి-వర్క్స్‌కు ఉచితంగా అందిస్తుందని ప్రకటించారు. స్విడ్జర్లాండ్ నుంచి దిగుమతి చేసిన ప్రత్యేక యంత్రాలనూ తమ సంస్థ విరాళంగా అందించిందన్నారు. టి-వర్క్స్ సీఈఓ సుజయ్ కర్మాపూర్ మాట్లాడుతూ.. 60 మంది నిపుణులతో కూడిన బృందం ఇక్కడి ఆవిష్కర్తలకు సహకారం అందిస్తుందన్నారు. ప్రస్తుతం రూ.11.5 కోట్ల విలువైన పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది చివరినాటికి రూ.110 కోట్ల యంత్రాలు సిద్ధమవుతాయని తెలిపారు. కొత్త యంత్రాలు తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారికి, ఆవిష్కర్తలకు ఈ కేంద్రం ఎప్పుడూ తెరచే ఉంటుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, స్టార్ట్‌పలు, ఎంఎ్‌సఎంఈలు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
Updated Date - 2023-03-03T03:42:14+05:30 IST