TSPSC: లీకైన పేపర్ విలువెంత?
ABN, First Publish Date - 2023-03-20T01:51:48+05:30
‘‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. మళ్లీ ఐదేళ్ల దాకా ఉద్యోగ నోటిఫికేన్లు రావు. తెలంగాణ వచ్చాక.. ఎనిమిదేళ్ల తర్వాత.. రాక రాక వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్.
అప్పులు చేసి ప్రభుత్వ ఉద్యోగానికి అభ్యర్థుల సన్నద్ధం..
రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో శిక్షణ
గ్రూప్-1 రద్దుతో ఒత్తిడిలో ఉద్యోగార్థులు
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. మళ్లీ ఐదేళ్ల దాకా ఉద్యోగ నోటిఫికేన్లు రావు. తెలంగాణ వచ్చాక.. ఎనిమిదేళ్ల తర్వాత.. రాక రాక వచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్. ఈ అవకాశం పోతే మళ్లీ రాదు. ఏది ఏమైనా.. ఈసారి కొలువు కొట్టాల్సిందే. ఎంత కష్టమైనా భరించాల్సిందే. ప్రైవేటు కొలువు వదిలేస్తే మళ్లీ సంపాదించుకోవచ్చు. కోచింగ్ కోసం అప్పులు చేస్తే.. తల తాకట్టు పెట్టయినా తిరిగి తీర్చేయొచ్చు. పచ్చడి మెతుకులు ఉన్నా పర్లేదు.. పూట గడిస్తే చాలు. ఆరునూరైనా పుస్తకాలన్నీ ఔపోసన పట్టాల్సిందే. జాబ్ కొట్టేదాకా ఊరి ముఖం చూడనన్న మాటను నిలబెట్టుకోవాల్సిందే.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు..’’ గ్రూప్-1 కోసం అన్నీ వదిలేసి.. కేవలం ఉద్యోగమే లక్ష్యంగా పరీక్షకు సిద్ధమవుతున్న అనేక మంది అంతరంగం ఇది.
అయితే పేపర్ లీక్‌తో వాళ్ల కలలన్నీ కల్లలయ్యాయి. ఇన్నాళ్లూ నోటిఫికేషన్లు లేవని బాధపడిన అభ్యర్థులు.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. అప్పులు చేసి చదువుకుంటున్న వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసిన వారు అయోమయంలో ఉన్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారికి మరిన్ని నెలలు కష్టాలు తప్పేలా లేవు. మొత్తంగా గ్రూప్-1 అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ లీక్‌తో వారంతా ఆత్మస్థైర్యం కోల్పోయారు.
ప్రిలిమ్స్ రద్దుతో వేదన..
వరంగల్‌కు చెందిన ఉజ్వల గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. మెయిన్స్ పరీక్ష కోసం అశోక్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో రెండు నెలలుగా శిక్షణ తీసుకుంటోంది. గ్రూప్-1 మెయిన్స్‌తోపాటు గ్రూప్-2 కోసం వేర్వేరుగా శిక్షణ పొందుతోంది. ఈ రెండు కోర్సులకు ఆమె రూ. 51 వేలు ఫీజు చెల్లించింది. హాస్టల్‌కు ప్రతినెలా రూ.10 వేల చొప్పున రెండు నెలలకు రూ.20 వేలు, పుస్తకాలకు రూ.7 వేలు.. ఇలా గ్రూప్-1 మెయిన్స్ కోసం ఇప్పటి దాకా ఆమె చేసిన ఖర్చు రూ.78 వేలు. పేపర్ లీకై గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయడంతో.. కోచింగ్ సెంటర్‌లో శిక్షణను నిలిపేశారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధమవుతూ భవిష్యత్తు గురించి ఎన్నో కలలుకన్న ఉజ్వల.. తాజా పరిణామాలతో తీవ్ర మనోవేదనతో కుంగిపోతోంది. ఒక్క ఉజ్వల మాత్రమే కాదు.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుతో ఆవేదన చెందుతున్నవారి సంఖ్య రాష్ట్రంలో వేలల్లో ఉంది. పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన అశోక్‌నగర్‌లో రూ.లక్షలు ఖర్చు చేసి శిక్షణ పొందుతున్న వారి వేదన వర్ణనాతీతం.
కోచింగ్ సెంటర్లకు మళ్లీ పండగ..
ఒకేసారి 503 పోస్టులు ఉండటంతో ఈసారి ప్రకటించిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు అందాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపికచేయడంతో.. ఈసారి అనేకమంది పరీక్షకు సిద్ధం అవుతున్నారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు, ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు కొలువులను వీడి చదువుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వారు దీర్ఘకాలిక సెలవు పెట్టి అశోక్‌నగర్‌లో శిక్షణ పొందుతున్నారు. ఈసారి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో అశోక్‌నగర్‌లో ఎన్నడూ లేనంత రద్దీ కనిపిస్తోంది. అనేక సంస్థలు గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం రూ.30-50వేల వరకు ఫీజులు వసూలు చేయగా.. మెయిన్స్ ఫీజు మరింత పెంచాయి. మెయిన్స్‌కు ఎంపికైన వారి ఫలితాలు జనవరిలో ప్రకటించడమే ఆలస్యం.. లాంగ్ టర్మ్, క్రాష్ కోర్సులు, ఆన్‌లైన్ తరగతులు అంటూ.. మూడు నెలలుగా హడావిడి నడుస్తోంది.
ప్రిలిమ్స్‌ను ఆషామాషీగా తీసుకుని స్వల్ప మార్కులతో అర్హత సాధించిన వారు మెయిన్స్‌పై దృష్టి సారించారు. సరాసరిగా ఒక్కో అభ్యర్థి మెయిన్స్ కోసం సరాసరి రూ.50వేల వరకు ఖర్చు చేశారు. ప్రిలిమ్స్ రద్దుతో అనేక సెంటర్లు ఇప్పటికే మెయిన్స్ కోచింగ్ తరగతులను రద్దు చేశాయి. కోచింగ్ సెంటర్లన్నీ మొత్తం ఫీజు ఒకేసారి వసూలు చేస్తున్నందున.. ఫీజు తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. దీంతో అప్పులు చేసి శిక్షణ పొందుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. కోర్సు మధ్యలో ఆపేసినా.. సగం ఫీజు కూడా తిరిగిచ్చేందుకు సంస్థలు సిద్ధంగా లేవు. ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అశోక్‌నగర్‌లో క్రాష్ కోర్సులకు సంబంధించిన ఫ్లెక్స్‌లు దర్శనమిస్తున్నాయి.
Updated Date - 2023-03-20T02:39:51+05:30 IST