TSPSC Paper Leak: 17 మందికి ఎన్‌వోసీలు
ABN, First Publish Date - 2023-03-25T05:02:11+05:30
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేశారు! 17 మందికి ఎన్‌వోసీ ఇచ్చారు.
పరీక్షల పనుల నుంచి వారందరూ దూరం
అయినా.. టీఎస్‌పీఎస్సీలో ఇద్దరికి లీక్!
నిఘా లేకపోవడంతో సులభంగా బయటకు
మరో 9 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
పరీక్ష రాసినట్లు అధికారులకే తెలియదు!
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేశారు! 17 మందికి ఎన్‌వోసీ ఇచ్చారు. వారిని పరీక్ష విధుల నుంచి తప్పించి.. ఇతర బాధ్యతలు అప్పగించారు! అయినా ప్రశ్నపత్రం లీకేజీ జరగడమే కాదు.. పరీక్ష రాసిన సిబ్బందిలో కొందరికి అందింది కూడా! టీఎస్‌పీఎస్సీ లో పటిష్ఠ నిఘా వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో అభ్యర్థులకు ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేయడంలో ఇటు అధికారులు, అటు పోలీసులు కూడా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూపు-1 పేపర్ ఎంత మందికి లీకైంది? అందులో టీఎస్‌పీఎస్సీ లో ఉద్యోగస్థులు ఎందరు? వారికి వచ్చిన మార్కులు ఎన్ని? వంటి అంశాలపై రకరకాల చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అధికారులు స్పష్టమైన ప్రకటనను విడుదల చేయడం లేదు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. టీఎస్‌పీఎస్సీ లో పనిచేస్తున్న వారిలో 26 మంది గ్రూపు-1 ప్రిలిమ్స్ రాశారు. ఇందులో 17 మంది రెగ్యులర్ సిబ్బంది కాగా, 9 మంది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి నియామక పరీక్షను రాయాలంటే ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలోనే దాన్ని సమర్పించాలి. ఇందులో భాగంగా గ్రూపు-1 పరీక్ష రాసిన 17 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నతాధికారుల నుంచి ఎన్‌వోసీలు తీసుకున్నారు. మిగిలిన 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకోలేదు. ఎన్‌వోసీలు ఇచ్చిన 17 మందిని గ్రూపు-1 పరీక్ష విభాగానికి సంబంధం లేని సెక్షన్లకు మార్చినట్లు తెలిసింది.
ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 9 మంది గ్రూపు-1 పరీక్ష రాసినట్లు అధికారులకు తెలియకపోవడం గమనార్హం. పేపర్ లీకేజీ బయటపడ్డ తర్వాత జరిపిన విచారణలో ఆ విషయం తెలిసింది. లీకైన పేపర్ ఒక రెగ్యులర్ ఉద్యోగితో పాటు మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి చేరింది. వారిద్దరికీ 100కు పైగా మార్కులు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరినీ అరెస్ట్ చేశారు. గ్రూపు-1 పోస్టులకు వచ్చిన 2.80 లక్షల దరఖాస్తుల్లో సుమారు 50 వేల దరఖాస్తులు ఉద్యోగులవేనని అధికారులు గుర్తించారు. అలాగే టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా గ్రూపు-1 పరీక్షలను రాస్తున్నట్లు అంచనా వేశారు. దీంతో వారిపై ప్రత్యేక నిఘా పెట్టలేదు. ఇదే అదునుగా భావించిన కొందరు సిబ్బంది పేపర్ లీకేజీకి పాల్పడ్డారు.
ఏప్రిల్ పరీక్షలు వాయిదా?
ఏప్రిల్‌లో వ్యవసాయ అధికారులతో పాటు మరికొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ పరీక్షలను రీ-షెడ్యూల్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే.. మేలో నాలుగు ప్రధానమైన పరీక్షలను నిర్వహించాలని ఇంతకు ముందు నిర్ణయించారు. వాటికి సకాలంలో పరీక్షలు జరుగుతాయా?లేక వాటినీ రీషెడ్యూల్ చేస్తారా? అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Updated Date - 2023-03-25T05:02:28+05:30 IST