YSRTP: షర్మిలను చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది
ABN, First Publish Date - 2023-04-17T15:28:42+05:30
వైఎస్. షర్మిలను చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే పార్టీ గళాన్ని నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సాఆర్‌టీపీ నేత గట్టు రామచంద్రరావు
హైదరాబాద్: వైఎస్. షర్మిలను చూసి బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే పార్టీ గళాన్ని నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సాఆర్‌టీపీ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. వైఎస్సాఆర్‌టీపీ (YSRTP) పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సాఆర్‌టీపీపై నిర్బంధం కొనసాగుతోంది. మమ్మల్ని అడుగు బయట పెట్టనీయడం లేదు. మా పార్టీ ఆఫీస్‌కి మేము రావడానికి కూడా అనుమతి లేదంటున్నారు. మా పార్టీ నేతల ఇండ్ల దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. షర్మిల మీద ఎందుకు ఈ నిర్బంధకాండ. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నాం. టీ సేవ్ (T-SAVE) ద్వారా అన్ని వర్గాల వారిని కలుపుకొని పోరాటం చేస్తున్నాం. అఖిలపక్షం అధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు అనుమతి ఇవ్వలేదు. చివరి వరకు అనుమతి పెండింగ్‌లో పెట్టి అనుమతి లేదని చెప్పారు. ఇందిరాపార్క్ ఉన్నదే ధర్నాలు, దీక్షలు చేయడానికి. కేసీఅర్ ఉద్యమంలో ఇందిరాపార్క్ దగ్గర ఎన్నో ధర్నాలు చేశారు. ఇందిరాపార్క్ దగ్గర ఆందోళనలు చేయకపోతే తెలంగాణ వచ్చేదా..? ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షాల ఆందోళనలు తొక్కి పెట్టాలని చూస్తున్నారు. అధికారం పక్షం ఎన్నైనా చేయొచ్చా..? ప్రతిపక్షం మాత్రం ఆందోళనలు చేయొద్దా..? దీక్ష అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటాం. ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగుల పక్షాన దీక్ష ఆపేది లేదు. అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా దీక్షకు 39 ప్రజా సంఘాల నుంచి మద్దతు ఉంది’’ అని తెలిపారు.
‘‘ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యక్తి. ఖమ్మం రాజకీయాల్లో సత్తా ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన ఏ పార్టీలో వెళ్తారనేది ఆయన ఇష్టం. మా పార్టీలో చేరేందుకు ఎప్పుడూ గేట్లు తెరిచే ఉంటాయి. పొంగులేటి వైఎస్సార్ కుటుంబానికి అభిమాని. రాజకీయాల కోసం కాకున్నా ఎప్పుడు కలుస్తూనే ఉంటారు.’’ అని గట్టు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-04-17T15:31:29+05:30 IST