మహాశివరాత్రి జాతర ఉత్సవాలను విజయవంతం చేద్దాం
ABN, First Publish Date - 2023-02-10T00:27:16+05:30
రాజరాజేశ్వరస్వామివారి పేరిట ఏర్పడిన జిల్లా గుర్తింపును నిలబెట్టుకునే విధంగా సమష్టి కృషితో వేములవాడ మహాశివరాత్రి జాతర ఉత్సవాలను విజయవంతం చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 9: రాజరాజేశ్వరస్వామివారి పేరిట ఏర్పడిన జిల్లా గుర్తింపును నిలబెట్టుకునే విధంగా సమష్టి కృషితో వేములవాడ మహాశివరాత్రి జాతర ఉత్సవాలను విజయవంతం చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన రవాణా, పార్కింగ్, రోడ్ల మరమ్మతులు, భక్తులకు వసతి, తాగునీరు సరఫరా, విద్యుత్ సరఫరా, బందోబస్తు, ఆరోగ్యం, పారిశుధ్య నిర్వహణ, క్రౌడ్ మేనేజ్‌మెంట్, క్యూలైన్ల నిర్వహణ, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, శివార్చన సాంస్కృతిక కార్యక్రమం, సూచికల ఏరాటు, జాతరకు సంబంధించిన ప్రచారం, అనుబంధ ఆలయాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై ఇప్పటివరకు చేపట్టిన పురోగతిని ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌కు అంశాల వారీగా వివరించారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ దివ్యక్షేత్రంలో జరిగే మహా శివరాత్రి పర్వదిన వేడుకల్లో సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్ల కోసం ఉద్దేశించిన యాక్షన్ ప్లాన్ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసే క్రమంలో ఏమైనా తేడాలు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. జాతరలో కీలకమైన కంట్రోల్ రూంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూంకు అందే ఫిర్యాదులపై సత్వరమే సంబంధిత శాఖలను అప్రమత్తం చేసి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు తమ శాఖకు సంబంధించిన బాధ్యుల వివరాలను వెంటనే ఆలయ అధికారులకు అందజేయాలన్నారు. జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు సహకారం అందించేందుకు, తగిన గైడెన్స్ ఇచ్చేందుకు వీలుగా మే ఐ హెల్ప్ యూ సెంటర్లను ఏర్పాటు చేయాలని, జిల్లా సంక్షేమ అధికారి వీటి పర్యవేక్షణ బాధ్యతలను చూడాలని అన్నారు. మహాశివరాత్రి జరిగే వేములవాడ పట్టణంలో సానిటేషన్‌ను పకడ్బందీగా చేపట్టేందుకు ఏడు జోన్లుగా విభజించుకోవాలని, జాతర జరిగే మూడు రోజులు మూడు షిఫ్ట్‌లలో 24 గంటలు పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలని అన్నారు. ప్రతీ జోనుకు పారిశుధ్య సిబ్బంది, ట్రాక్టర్‌తోపాటు పర్యవేక్షణ అధికారి తప్పనిసరిగా ఉండాలన్నారు. పారిశుధ్య పర్యవేక్షణను జిల్లా పంచాయతీ అధికారికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. జాతరలో భక్తులకు గైడెన్స్ కోసం సరిపడా సైనేజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జాతరకు వచ్చే భక్తులను గైడ్ చేసేలా ముఖ్య కూడళ్లు, ప్రదేశాలలో శాశ్వత ప్రాతిపదికన రేడియం స్టిక్కర్స్‌తో కూడిన సైనేజీలను మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జాతర పనులు ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జాతరలో నిరంతర వైద్య సేవలు అందించేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టులలో పని చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్న బస్తీ దవాఖానాను శివరాత్రికి ముందే ప్రారంభించాలని సూచించారు. అన్ని రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. నాంపల్లి గుట్ట పైన గల స్టెప్ వెల్స్ క్వాలిటీని మెరుగుపరిచి వాడుకలోకి తేవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశాలు, బస్టాండ్ వద్ద భక్తుల సౌకర్యార్థం తాగునీరును అందుబాటులో ఉంచాలని సూచించారు. భోజన క్యాంటీన్ జాతర సందర్భంగా తిరిగి వినియోగంలోకి తేవాలని ఆలయ అధికారులకు సూచించారు.
అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు
- ఎస్పీ అఖిల్ మహాజన్
శివరాత్రి జాతరకు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించి పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు పట్టణంలో ట్రాఫిక్, ఆలయ పరిసరాలలో పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండడా తగిన ఏర్పాట్లు చేస్తామని, జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. క్యూ లైన్ల నిర్వహణ, ధర్మగుండం వద్ద రద్దీ, కంట్రోల్ రూం, బారీకెడింగ్ మేనేజ్ మెంట్‌ను పకడ్బందీగా చేస్తామని చెప్పారు. గతంలో కన్నా అధికంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా నేత్రాలతో జాతరను పర్యవే క్షిస్తామన్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర సంపూర్ణ సమాచారం లభించేలా ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్‌లలో డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా త్వరలోనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్, ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, వేములవాడ డీఎస్పీ కే నాగేంద్ర చారి, జిల్లా రవాణా అధికారి కొండల్‌రావు, సెస్ ఎండీ రామకృష్ణ, డీపీవో రవీందర్, ఆలయ ఈఈ రాజేశ్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, పట్టణ సీఐ వెంకటేశ్, రూరల్ సీఐ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-13T12:22:38+05:30 IST