Ponguleti: బీఆర్ఎస్‌కు ఆ రోజు ఎంతో దూరంలో లేదు
ABN, First Publish Date - 2023-01-10T14:37:04+05:30
బీఆర్ఎస్ (BRS) పార్టీ హైకమాండ్ తీరుపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. పదవులు ఇచ్చినా ఇవ్వక పోయినా
భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ (BRS) పార్టీ హైకమాండ్ తీరుపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. పదవులు ఇచ్చినా ఇవ్వక పోయినా మనిషిని మనిషిలా చూడాలని కోరారు. పినపాక నియోజకవర్గ మద్దతుదారులతో ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదనతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార మదంతో రెచ్చిపోయినా... ప్రజలు తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. కష్టాలు చెప్పుకుంటేనే ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం కేటీఆర్‌తో ఉన్న చనువుతోనే ఇంతకాలంలో బీఆర్ఎస్‌లో కొనసాగినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ మారిన తర్వాత ఎలాంటి కష్టాలొచ్చాయో సమయం వచ్చినప్పుడు చెబుతానని పొంగులేటి వెల్లడించారు.
ఇంకా ఏమన్నారంటే..
‘‘నేను అడిగితే సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సెక్యూరిటీ తగ్గించినా నేను అడగను. ఇప్పుడున్న ఇద్దరు గన్‌మెన్లను కూడా వెనక్కి తీసుకోండి. నేను భూదందాలు చేయలేదు. కానీ గొంతు ఎత్తకుండా మాత్రం ఉండలేను. రాజకీయంగా గాడ్‌ఫాదర్ ఎవరూలేరు. నాకు గాడ్‌ఫాదర్ ఖమ్మం జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలే. నాలుగేళ్లుగా పదవులు లేకపోవడానికి కారణం ఏంటో మీకు తెలుసు.’’ అని వివరించారు.
అభిప్రాయాలు సేకరణ..
పార్టీ మార్పుపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయాలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఆయన ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న తన శ్రేయోభిలాషులు, అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పినపాక నియోజకవర్గ నేతలతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే ఆయన ఏర్పాటు చేసిన సమావేశం దగ్గర ఫ్లెక్సీల్లో ఇక్కడా కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) ఫొటోలు లేవు. దీంతో పొంగులేటి.. బీజేపీలో చేరడం ఖాయమని.. ఇందుకు ఫ్లెక్సీలే నిదర్శనం అని పొంగులేటి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఈనెల 18న అమిత్ షా (Amit Shah)తో పొంగులేటి భేటీకానున్నారు. ఆ సమావేశం అనంతరం బీజేపీ (BJP)లో చేరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ప్రధాని మోదీ (Modi)తో కూడా పొంగులేటి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. అమిత్ షాతో భేటీ. మరోవైపు కేసీఆర్ ఖమ్మంలో సభ ఏర్పాటు చేయడం తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తి రేపుతోంది.
Updated Date - 2023-01-10T15:52:08+05:30 IST