Bhadradri: భద్రాద్రిలో ‘లడ్డూ’ వివాదం
ABN, First Publish Date - 2023-01-09T21:06:13+05:30
భక్తులకు బూజుపట్టిన లడ్డూలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు రావడంతో...
భద్రాచలం: భక్తులకు బూజుపట్టిన లడ్డూలను విక్రయించిన సంఘటన భద్రాద్రి దేవస్థానం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆదివారం ప్రసాదం కొన్న కొందరు భక్తులకు బూజుపట్టిన లడ్డూలు రావడంతో వారు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రం(పోటు)ను సీజ్ చేసేందుకు పోలీసు అధికారులు ప్రయత్నించారు. ఎలాంటి ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా రామాలయంలో ప్రసాదాల పోటును సీజ్ చేసేందుకు ప్రయత్నించడంతో వారిని దేవస్థానం వైదిక, పరిపాలన అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. పవిత్రమైన ప్రసాదాల తయారీ కేంద్రంలోకి పోలీసులు ప్రవేశించడం ఎంత మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. భధ్రాద్రి దేవస్థానం ఈవో సెలవులో ఉన్నప్పుడు కనీసం స్థానిక అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా రావడమేంటని సీఐతో వాదనకు దిగారు. లడ్డూల పరిశీలన, విచారణకు సహకరిస్తాం కాని పోటును సీజ్ చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
నోటీసు ఇవ్వకపోవడంపై అభ్యంతరం
ఎంతో పవిత్రమైన రామాలయంలో ప్రసాదాల తయారీ కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ప్రవేశించి సీజ్ చేయాలని యత్నించడం పోలీసుల అత్యుత్సాహమేనని దేవస్థానం వైదిక, పరిపాలన, అధికారులు, సిబ్బంది విమర్శిస్తున్నారు. ఈక్రమంలో దేవస్థానం సిబ్బంది ముందు అప్పటికప్పుడు నోటీసును రాసి ఇచ్చేందుకు సీఐ నాగరాజురెడ్డి ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న టీఎన్‌జీవో నాయకులు సీఐని ప్రశ్నించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేసి ప్రసాదాల తయారీ కేంద్రంలోని ప్రసాదాల్లో నాణ్యత లేదని తేల్చారా? ఏ విధంగా మీరు సీజ్ చేస్తారంటూ ప్రశ్నించారు. దేవస్థానం ప్రసాదాల తయారీ నాణ్యత గురించి ఫుడ్ కార్పొరేషన్ అందించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఈ సందర్భంగా వారు అధికారులకు చూపారు. భద్రాద్రి దేవస్థానం చరిత్రలో ఈ విధంగా పోలీసు అధికారులు పోటును సీజ్ చేసేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి అని దేవస్థానం వర్గాలు వాపోయాయి. పోటు వద్దకు వచ్చిన పోలీసులు బయటకు వెళ్లకుండా దేవస్థానం వైదిక పరిపాలన సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు గంటల పాటు ‘జై శ్రీరామ్’ అంటూ దేవస్థానం వైదిక, పరిపాలన సిబ్బంది చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
విచారణకు ఆదేశించిన దేవాదాయ శాఖ కమిషనర్
భద్రాద్రి దేవస్థానంలో ముక్కోటికి సిద్ధం చేసిన లడ్డూలు కొన్ని బూజుపట్టాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి, దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రమాదేవి ఈ కమిటీలో నియమించినట్టు దేవస్థానం అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Updated Date - 2023-01-09T21:06:24+05:30 IST