Revanth Reddy: మహబూబ్‌నగర్‌లో నేడు రేవంత్ రెడ్డి పర్యటన
ABN, First Publish Date - 2023-11-07T07:07:42+05:30
మహబూబ్ నగర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ.. బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు.
మహబూబ్ నగర్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ.. బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తర్వాత సంపత్ కుమార్ నామినేషన్ దాఖలు సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తారు. 11:30 గంటలకు అలంపూర్ నియోజకవర్గం శాంతినగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు గద్వాలలో అభ్యర్థి సరిత తిరుపతయ్య తరపున ప్రజా గర్జన బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు మఖ్తల్‌లో అభ్యర్థి వాకిటి శ్రీహరి తరఫున ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరుగుతుంది.
కాగా రాష్ట్రంలో మరో 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ సోమవారం రాత్రి మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఇందులో రేవంత్ పేరునూ చేర్చింది. ఆయన కొడంగల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనున్నారు. కాగా, కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నుంచి మరోసారి కె.కె.మహేందర్‌రెడ్డినే అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటించింది. మూడో జాబితాలోని 16 మందిలో రేవంత్ మినహా ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి, ముగ్గురు బీసీలకు సీట్లు దక్కాయి. మిగిలిన సీట్లు రిజర్వుడు నియోజకవర్గాలు. కాగా, వనపర్తి, బోథ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వనపర్తి అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించిన అధిష్ఠానం.. తాజాగా ఆయనను మార్చి ఆ స్థానంలో తూడి మేఘారెడ్డిని ఎంపిక చేసింది.
దీంతోపాటు బోథ్ నియోజకవర్గం నుంచి వెన్నెల అశోక్ బదులుగా ఆదె గజేందర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కామారెడ్డి నుంచి రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటును కేటాయించింది. బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన జి.వివేక్‌ను చెన్నూరుకు, ఏనుగు రవీందర్‌రెడ్డికి బాన్సువాడకు అభ్యర్థులుగా ప్రకటించింది. కొద్ది రోజుల కిందట పార్టీలో చేరిన నీలం మధు మదిరాజ్‌కు పటాన్‌చెరు టికెట్‌ను ఇచ్చింది. మొత్తంగా కాంగ్రెస్ మూడో జాబితాలోనూ సగం మందికి పైగా అభ్యర్థులు ఇటీవల పార్టీలోకి వచ్చినవారే ఉండటం గమనార్హం. మూడో జాబితాతో కలిపి ఇప్పటికి మొత్తం 114 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మిగిలిన ఐదింటిలో.. కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది. మరోవైపు సీపీఎంతో సంప్రదింపులు కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మిర్యాలగూడ సీటును వారి కోసం అట్టిపెట్టింది. ఇక సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, మరో ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఆ రెండు సీట్లను పెండింగ్‌లో పెట్టింది. చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ సీటునూ కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టి ఉంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, కొడంగల్‌లో సోమవారమే నామినేషన్ వేసిన రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో ఈ నెల 10న నామినేషన్ సమర్పించనున్నారు. అదేరోజు అక్కడ కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో బహిరంగ సభ నిర్వహించి.. బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.
Updated Date - 2023-11-07T07:07:44+05:30 IST