Vemula Veeresham: బీఆర్‌ఎస్‌కు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రాజీనామా
ABN, First Publish Date - 2023-08-23T17:28:02+05:30
బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన అనంతరం అసమ్మతి నేతల అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నకిరేకల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కేటాయించడంతో అసమ్మతి రేగింది. నకిరేకల్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు.
నకిరేకల్: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన అనంతరం అసమ్మతి నేతల అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నకిరేకల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కేటాయించడంతో అసమ్మతి రేగింది. నకిరేకల్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం సుమారు 10వేల మంది బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశమయినట్లు తెలిసింది. ప్రతీ మండలం నుంచి 100 మందిని మాట్లాడించేందుకు సుదీర్ఘ షెడ్యూల్‌ను ఖరారు చేసి సమావేశం కావడం గమనార్హం. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా? అనే అంశంపై వీరేశం వర్గం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది.
సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. మంగళవారం దేవరకొండలో మునిసిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు సమావేశమై ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను మార్చాలని, ఆయన గెలిచే అవకాశాలు లేవని, ఆయన స్థానంలో వడ్త్య దేవేందర్‌నాయక్‌ను బరిలో దించాలని తీర్మానించారు. మరోవైపు నాగార్జునసాగర్‌లో కడారి అంజయ్య యాదవ్ తన అనుచరులతో హాలియాలో సమావేశమై చర్చించారు. ఉప ఎన్నిక సమయంలో బుజ్జగించి పార్టీలో చేర్చుకున్నారని, తాజా జాబితాలోనూ అవకాశం ఇవ్వకపోవడంపై భవిష్యత్ రాజకీయ నిర్ణయం తీసుకోవాలని చర్చించినట్టు తెలిసింది. ఇదే తరహాలో నల్లగొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేత పిల్లి రామరాజు యాదవ్ నల్లగొండలో తన అనుచరులతో బుధవారం సమావేశమై సాయంత్రం మీడియాకు తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. తాను బరిలో ఉండడం ఖాయమని, అది ఏ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగానా అనే అంశంపై బుధవారం తన ప్రధాన అనుచరులతో చర్చించనున్నారు. కోదాడ నియోజకవర్గంలో కీలక నేత కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఏ ప్రకటన చేస్తారనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ నేతల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతిరెడ్డి రెండు రోజులుగా నియోజకవర్గాల్లో మకాం వేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్, జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వారు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంపీగా కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూర్యాపేటలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు కాంగ్రెస్ నుంచి ఆశావహులు పీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. మాజీఎమ్మెల్యే బాలునాయక్ దరఖాస్తు చేసుకొని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేను కలిశారు.
Updated Date - 2023-08-23T17:28:05+05:30 IST