YS Sharmila vs Telangana Police: షర్మిల వర్సెస్ పోలీసుల ఎపిసోడ్‌లో కీలక పరిణామం..!
ABN, First Publish Date - 2023-04-24T22:17:47+05:30
వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు (YS Sharmila) నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు 14 రోజుల రిమాండ్ (Sharmila Remand) విధిస్తున్నట్లు..
హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలకు (YS Sharmila) నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు 14 రోజుల రిమాండ్ (Sharmila Remand) విధిస్తున్నట్లు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. మే 8 వరకు షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం. షర్మిలను సోమవారం రాత్రే చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. షర్మిల బెయిల్‌కు అప్లై చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. షర్మిల బెయిల్‌పై విచారణను మంగళవాారానికి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. TSPSC దర్యాప్తుపై సిట్ అధికారికి వినతిపత్రం ఇవ్వాలని షర్మిల నిర్ణయించుకున్నారు. లోటస్ పాండ్‌లోని ఇంటి నుంచి సోమవారం మధ్యాహ్నం సిట్ ఆఫీస్‌కు వెళుతున్న క్రమంలో బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులతో షర్మిల దురుసుగా ప్రవర్తించారు. షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షర్మిల వ్యవహార శైలిపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు సెక్షన్ల కింద షర్మిలపై కేసు నమోదైంది.
ఈ కేసులో A1గా షర్మిల, A2గా షర్మిల డ్రైవర్ బాబు, A3గా యాకబ్‌ను పోలీసులు చేర్చారు. నిందితుడు యాకబ్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ అనంతరం.. నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షర్మిల అరెస్ట్ విషయం తెలిసి ఆమె తల్లి విజయలక్ష్మి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో.. జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించ లేదు. పోలీసులతో విజయలక్ష్మి వాగ్వాదానికి దిగారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మహిళా పోలీసుపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులతో షర్మిల, విజయమ్మ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఉన్న షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు.
ఈ పరిణామాలపై విజయలక్ష్మి ఏమన్నారంటే..
* నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోంది: విజయలక్ష్మి
* ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్ చేస్తారా?
* షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు
* ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?
* పోలీసులు మీద పడుతుంటే ఆవేశం రాదా?
* జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర మహిళా పోలీసులు నామీద పడ్డారు
* నేను కొట్టాలనుకుంటే కొట్టగలను.. కానీ కొట్టలేదు
* షర్మిల అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయిస్తాం
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏమన్నారంటే..
* సిట్ ఆఫీస్‌కు నేను ఒక్కరినే వెళ్లాలనుకున్నా: షర్మిల
* TSPSC దర్యాప్తుపై సిట్ అధికారికి వినతిపత్రం ఇవ్వాలనుకున్నా
* కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు.. మా అనుమానాలను అధికారికి చెప్పడం మా బాధ్యత
* సిట్ ఆఫీస్‌కు వెళ్లడానికి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు
* నేను ధర్నాకు పోలేదు, ముట్టడి అని పిలుపునివ్వలేదు
* నన్ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు?
* నేనేమైనా క్రిమినల్‌నా..? హంతకురాలినా?
* నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా..?
* నాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు
* నేను వెళ్తుంటే మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశారు
* ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు?
* రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా బాధ్యత: షర్మిల
Updated Date - 2023-04-24T22:35:26+05:30 IST