Telangana Election: పెళ్లి చేసేదెట్లా!.. మంగళసూత్రానికి కనీసం లక్ష అవసరం !
ABN, First Publish Date - 2023-10-26T03:36:45+05:30
ఇది పెళ్లిళ్ల సీజన్. ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల సీజన్. అక్టోబరు-నవంబరు నెలల్లో మంచి రోజులున్నాయి. ముఖ్యంగా నవంబరు 19, 24 తేదీల్లో ఎక్కువ పెళ్లి ముహుర్తాలున్నాయి.
ఎన్నికల కోడ్‌తో వివాహ వేడుకల ఏర్పాట్లకు ఇబ్బందులు
50వేల మించి నగదుంటే పట్టేస్తున్న పోలీసులు
వస్త్రాలకు, బంగారానికి నగదులోనే చెల్లింపులు
మంగళసూత్రానికే కనీసం రూ.లక్ష అవసరం
కోడ్ వల్ల నగదు చెల్లించలేని పరిస్థితి
అక్టోబరు, నవంబరులో వేలాది వివాహాలు
బంగారం, వస్త్ర వ్యాపారాలపైనా కోడ్ ఎఫెక్ట్
హైదరాబాద్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఇది పెళ్లిళ్ల సీజన్. ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల సీజన్. అక్టోబరు-నవంబరు నెలల్లో మంచి రోజులున్నాయి. ముఖ్యంగా నవంబరు 19, 24 తేదీల్లో ఎక్కువ పెళ్లి ముహుర్తాలున్నాయి. ఆ రెండు రోజుల్లోనే తెలంగాణలో వేలాది వివాహాలు జరగనున్నట్లు పురోహితులు చెప్తున్నారు. ఎంతో సంతోషంతో, అట్టహాసంగా చేయాలనుకునే ఈ వివాహ వేడుకలు కాస్తా ఎన్నికల వల్ల ఆందోళన, భయాల మధ్య నిర్వహించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. ఆధారాలు చూపితే ఇస్తామంటున్నారు. కానీ అవి, తిరిగి ఎప్పటికి చేతికందుతాయో అని వివాహ వేడుకలు నిర్వహించేవారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. దుస్తులు, బంగారం, పెళ్లి ఏర్పాట్లు.. ఇలా దాదాపు అన్నింటికీ నగదు రూపంలోనే చెల్లింపులు జరుగుతాయి.
ముఖ్యంగా దుస్తులు, బంగారం కోసం లక్షల్లో ఖర్చు పెడతారు. మంగళసూత్రం చేయించాలన్నా లక్ష రూపాయల కంటే ఎక్కువగానే అవుతుంది. కానీ, ఎన్నికల కోడ్ వల్ల రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లలేని పరిస్థితి. దీంతో, బట్టలు, బంగారాన్ని నగదుతో కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పెద్దపల్లి పట్టణానికి చెందిన దేవేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో తన కూతురు వివాహాముందని, కోడ్ నేపథ్యంలో పెళ్లి జరిగేదెలా అన్న ఆందోళనలో తమ కుటుంబమంతా ఉందని ఆయన పేర్కొన్నారు. ఖర్చుల కోసం డబ్బులు పట్టుకొని తిరిగితే ఎక్కడ స్వాధీనం చేసుకుంటారోనన్న భయం తమను వెంటాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలిసిన బంగారం వ్యాపారికి కొద్ది మొత్తంలో నగదు చెల్లించి, ఎన్నికల తర్వాత మిగిలినది ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. తమకు వ్యాపారి తెలుసు కాబట్టి సరిపోయిందని, అదే తెలియనివారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు.
పెళ్లి పనులు పెట్టుకొని అధికారుల చుట్టూ తిరగాలా?
నగదును స్వాధీనం చేసుకున్నప్పటికీ సరైన ఆధారాలు చూపితే ఆ డబ్బును తిరిగిస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ, ఇంట్లో పెళ్లి పనులు పెట్టుకొని అధికారుల చుట్టూ ఎవరు తిరుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెళ్లికార్డు చూపితే ఇబ్బందులుండవని ఎన్నికల అధికారులంటున్నారు. కానీ ఒక్కసారి డబ్బును స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆధారాలు చూపి, వారి దగ్గర్నించి తెచ్చుకోవడం వెంటనే జరగదని, నిబంధనల మేరకు రోజుల సమయం పడుతుందని అంటున్నారు. ఇదిలావుంటే బంగారం, దుస్తుల షాపుల వ్యాపారంపైన కూడా ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. నగరాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో వ్యాపారాలు జరుగుతున్నా.. చిన్నచిన్న పట్టణాల్లో మాత్రం బంగారం, వస్త్ర వ్యాపారాలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదని ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యాపారి తెలిపారు. పెళ్లిళ్ల సీజన్‌లో బాగా జరగాల్సిన వ్యాపారం ఎన్నికల కోడ్ కారణంగా మందగించిన విషయం వాస్తవమేనంటున్నారు. అలాగే పెళ్లింటివారికి అప్పిచ్చేవాళ్లు కూడా సంకోచిస్తున్నారని తెలుస్తోంది. నగదు పట్టుబడితే మళ్లీ ఎక్కడ లెక్కలు చెప్పాల్సివస్తుందోనన్న భయం అప్పిచ్చేవారిలోనూ వ్యక్తం అవుతోంది.
యూపీఐ చెల్లింపుల్లోనూ సమస్యలు
కొన్ని జిల్లాల్లో స్కానర్ల సాయంతో జరిగే లావాదేవీల్లో సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాల్లో కొందరికి ఈ పరిస్థితి ఎదురైంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా షాపుల్లో నగదు చెల్లింపుల స్కానర్లను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఇప్పుడు షాపుల్లో చిన్నచిన్న లావాదేవీలన్నీ స్కానర్లు లేదా యూపీఐల ద్వారానే జరుగుతున్నాయి. వాటిపై కూడా నిషేధం విధిస్తే తమ వ్యాపారాలు ఎలా జరుగుతాయని వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజులుగా యూపీఐ లావాదేవీలు సక్రమంగా జరగడం లేదంటున్నారు. ఇక పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, మద్యం షాపులలో రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. తనిఖీల్లో భాగంగా అధికారులు వాళ్ల డబ్బులను కూడా పట్టుకుంటుండటంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొందరు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
Updated Date - 2023-10-26T10:54:46+05:30 IST