జనజాతరకు కళ వచ్చేనా!
ABN, First Publish Date - 2023-02-13T00:05:17+05:30
స్వామివారి ముందు అంతా సమానులే అని చెప్పే అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయంతో జనజాతరను విజయవంతం చేస్తారా.. పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తారా.. రామలింగేశ్వరుడి దర్శనానికి ప్రొటోకాల్ అమలు చేస్తారా.. వాహనాల పాసుల పంపిణీలో జిల్లా అధికారులు ఏమైనా మతలబు చేస్తారా.. ఆరు రోజలు పాటు జరిగే జాతరకు విచ్ఛేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించి, కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మునుపటి కళ తీసుకొచ్చి విజయవంతంగా ముగిస్తారా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కీసర బ్రహ్మోత్సవాలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు మరో మూడు రోజులే గడువు
అధికారుల మధ్య సమన్వయం కుదిరేనా..
బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేనా?
పార్కింగ్‌తో పరేషాన్
స్వామివారి ముందు అంతా సమానులే అని చెప్పే అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయంతో జనజాతరను విజయవంతం చేస్తారా.. పార్కింగ్ సమస్యను పరిష్కరిస్తారా.. రామలింగేశ్వరుడి దర్శనానికి ప్రొటోకాల్ అమలు చేస్తారా.. వాహనాల పాసుల పంపిణీలో జిల్లా అధికారులు ఏమైనా మతలబు చేస్తారా.. ఆరు రోజలు పాటు జరిగే జాతరకు విచ్ఛేసే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించి, కీసరగుట్ట మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మునుపటి కళ తీసుకొచ్చి విజయవంతంగా ముగిస్తారా అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కీసర బ్రహ్మోత్సవాలకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది.
కీసర, ఫిబ్రవరి12: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవాని శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ప్రస్తుతం ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. పర్వదినాలు, శని, ఆది, సోమవారాలల్లో కూడా ఆలయానికి అధిక సంఖ్యల్లో భక్తులు విచ్ఛేస్తున్నారు. దీంతో భక్తులు టూవీలర్, కార్లలో వస్తుండటంతో క్షేత్రంపై పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. కార్తీక, శ్రావణ మాసంలో సమస్యను చెప్పనక్కర్లేదు. కాగా మహాశివరాత్రి సందర్భంగా లక్షల మంది భక్తులు, వేలల్లో వాహనాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది గురుకుల పాఠశాల వెనక భాగంలో వాహనాలు పార్కింగ్ చేసేవారు. 2020 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఎంవీరెడ్డి పార్కింగ్ స్థలంలో హరితహరంలో భాగంగా మొక్కలను నాటారు. దీంతో పార్కింగ్ సమస్య వస్తుందని ఆంధ్రజ్యోతి అప్పుడే ప్రచురించింది. అయినా అధికార యంత్రాగం మూడెళ్లు గడస్తున్నా పార్కింగ్ సమస్యపై శాశ్వత పరిష్కారం చూపడంలో పూర్తిగా విఫలమయ్యారు. శివరాత్రి వచ్చిందా, మూడు, నాలుగు సమీక్షా సమావేశాలు నిర్వహించామా?, పలు మార్లు కీసరగుట్టను సందర్శించామా?, బ్రహ్మోత్సవాలు ముగించామా? అనే విధంగా జనజాతరను ముగిస్తున్నారు. కీసరగుట్టకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అసలు పార్కింగ్ సమస్య పరిష్కారంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాసుల పంపిణీలో అనూమానాలు
ఈసారి ఎలాంటి పాసులు లేవు, అంతా ఆన్‌లైన్లోనే అన్న మంత్రి మల్లారెడ్డి మాటలపై, అధికారుల నిర్ణయంపై సర్వత్రా అనూమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వాహనాలు పాసులు రెండు వేలు, దర్శనం పాసులు కేవలం ప్రొటోకాల్ ఉన్న వారికే ఇస్తామని చెప్పి, జిల్లా అధికారులు ఇష్టానుసారంగా పాసులు ముద్రించారు. లెక్కకు మించి పాసులు పంపిణీ చేశారు. దీంతో మహాశివరాత్రి రోజు కీసరగుట్టకు వేలాది భక్తులు, వాహనాల్లో రావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. సామాన్య భక్తులకు వాహనాల రాకపోకలతో శివయ్య దర్శనం అంటు ఉంచితే, చుక్కలు కనిపించాయి. ఈ సారి వాహనాల పాసులు రద్దు చేసినట్లు తెల్చి చెప్పిన అధికారులు బ్రహ్మోత్సవాల సమయంలో కార్లకు స్టిక్కర్లు అతికించి కీసరగుట్టలో విధులు నిర్వహిస్తారా..? మంత్రి మల్లారెడ్డి తన అనుచరులకు పాసులు పంపిణీ చేసి కీసరగుట్టలో పార్కింగ్ సమస్యకు కారణం అవుతాడా అనేది వేచిచూడాలి.
ప్రొటోకాల్ పాటించేనా
స్వామివారి ముందు అంత సమానులే అనే నీతులు చెప్పే అధికారులు అసలు వారు ప్రోటోకాల్ పాటిస్తారా లేదా అని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. స్వామివారి దర్శనం కొరకు వీవీఐపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ప్రముఖులు విచ్చేసే సమయంలో వారికోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ లైన్‌లో ప్రముఖులు కాకుండా పోలీసులు, రెవెన్యూఅధికారులు తమ బంధువులు, అనుచరులు, తమకు కావాల్సిన వారిని లోపలికి పంపించడంతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. ఇది ఇలాగే కొనసాడంతో గతేడాది సామాన్య భక్తులు వెచి ఉండే క్యూలైన్ కన్నా, ప్రొటోకాల్ లైన్‌లో వచ్చిన భక్తులు చుక్కలు చూశారు. చలువ పందిళ్లలో ఇరుక్కుపోయి, భక్తులకు ఊపిరాడకపోవడంతో నానా ఇబ్బంది పడ్డారు. ఈ సారి అలా జరగకుండా చూస్తారో లేదో వేచి చూడాలి.
భక్తులు ఆనందంగా గడిపేనా!
కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సామాన్య భక్తులతోనే కళ సంతరించుకుంటుంది. భక్తులు స్వామివారి దర్శించుకొని ఆరు రోజుల పాటు క్షేత్రంపై బస చేసి కుటుంబ సమేతంగా ఇక్కడ గడుపుతారు. చిన్నారుల ఆడ విడుపు కోసం ఏర్పాటు చేసే రంగుల రాట్నం, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ ఆనందం పొందుతారు. కానీ ఈసారీ అలాంటి ఆనందం దొరుతుందొ లేదో అని అనుమానం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ మైదానంలో జాయింట్ వీల్, కొలంబస్, చిన్నారుల కొరకు ఏర్పాటు చేసే వినోదపు కార్యక్రమాలు ఏవీ కూడా అక్కడ ఏర్పాట్టు చేయవద్దని అధికారులు ఆదేశించారు. దీంతో జనాలు చూసేందుకు, ఉపవాస దీక్షలో ఏర్పాటు చేసే వినోదపు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే జన జాతర ఎలా విజయవంతం అవుతుందని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
గుర్తించని పారిశుధ్య కార్మికుల సేవలు
వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివి. వారి సేవలను గుర్తించడంలో ప్రతీసారి అధికారులు విఫలమవుతున్నారు. ఆరు రోజుల పాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాడానికి కూడా అధికారులకు చేతులు రావడం లేదు. వారికి కడుపునిండా భోజనం, చలికి దుప్పట్లు, తాగేందుకు నీరు కూడా దొరకని పరిస్థితి జాతరలో పారిశుధ్య కార్మికులకు ఎదుర్కొంటున్నారు. తమను పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని కార్మికులు కోరుతున్నారు.
ఎవరికీ వారే పెత్తనం!
మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, వాటి నిర్వహణ, విద్యార్థులకు, విధులు నిర్వహించే వారికి భోజన సౌకర్యాం ఇలా చెప్పుకుంటు పోతే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమౌతున్నారని భక్తులు వాపోతున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి ఏర్పాటు చేసే 15 కమిటీల్లో ఏ ఒక్క కమిటీ సభ్యుడు కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆరు రోజుల పాటు జరిగే జాతరలో ప్రజాప్రతినిధులతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు ఇలా ఎవరికీ వారే తమ పెత్తనం చూపిస్తూ సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈసారైనా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - 2023-02-13T12:16:57+05:30 IST