Gaddar: 1997 ఏప్రిల్ 6న గద్దర్ శరీరంలోకి పోలీసు తూటాలు.. ఇప్పటికీ ఒకటి శరీరంలోనే... ఎందుకంటే..
ABN, First Publish Date - 2023-08-06T16:45:57+05:30
ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం పట్ల ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, పార్టీలకు అతీతంగా నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు, పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గద్దర్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తుచేసుకుందాం.
ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం పట్ల ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, పార్టీలకు అతీతంగా నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు, పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గద్దర్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తుచేసుకుందాం.
కవిగా, గాయకుడిగా, ప్రజా ఉద్యమకారుడిగా విశేషమైన ప్రజాధరణ పొందిన గద్దర్.. చొక్కా లేకుండా కింద గోచి ధోతి, పైన గొంగళి, ఎర్రజెండా చుట్టిన కర్రతో ప్రత్యేక ఆహార్యాన్ని కలిగివుండేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఈ విధంగా ఉండేవారు. అయితే కొంతకాలం తర్వాత ఆ ఆహార్యానికి స్వస్తిపలికారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1975లో బ్యాంకు రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ రాశారు. జాబ్ రావడంతో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా చేరారు. అనంతరం వివాహం చేసుకున్నారు. భార్య పేరు విమల. తన ముగ్గురు పిల్లలకు సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల అని పేర్లు పెట్టారు.
ఇక 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్యమండలిలో చేరాక ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్‌లుగా, సీడీలుగా రికార్డ్ అయ్యి విపరీతంగా అమ్ముడుపోయేవంటే ఆయన పాటలకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
బహిరంగ సభకు 2 లక్షల మంది..
మొదటి నుంచి విప్లవ భావాలున్న గద్దర్ విప్లవంలో పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్స్ పట్ల ఉదారంగా వ్యవహరించి నిషేధం ఎత్తి వేశారు. దీంతో 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ఏకంగా 2 లక్షల మంది హాజరయ్యారు. ఇక ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక అంశాలపై బుర్రకథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించేవారు. పల్లెల్లో అకృత్యాలు, దళితుల మేల్కొలుపు కోసం కృషి చేశారు.
శరీరంలో బుల్లెట్ అలాగే ఉంది...
1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై పోలీసులు తుపాకీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఆయన శరీరంలోకి కొన్ని బుల్లెట్లు దూసుకెళ్లాయి. అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులు ఒక బుల్లెట్‌ని శరీరంలో అలాగే ఉంచారు. అది వెన్నెముకలో ఇరుక్కుపోవడంతో దాన్ని తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు దాన్ని శరీరంలో అలాగే వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ ఆ బుల్లెట్ ఉంది. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావులను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్‌కౌంటర్లను ఆయన తీవ్రంగా నిరసించారు.
Updated Date - 2023-08-06T16:45:57+05:30 IST