RS Praveen Kumar: TSPSC సభ్యులంతా కేసీఆర్ అనుచరులు, సన్నిహితులే.. జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయాలి
ABN, First Publish Date - 2023-03-23T21:19:45+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) కావడంతో ఉస్మానియా విద్యార్థులంతా లీకుల పట్ల ఆందోళనలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) కావడంతో ఉస్మానియా విద్యార్థులంతా లీకుల పట్ల ఆందోళనలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. తాను చెప్పేవరకు కమిషన్‌లో పనిచేస్తూ పరీక్ష రాసిన నిందితులను అరెస్టు చేయలేదని, తాను మాట్లాడేవరకు చిన్న విషయంగా చూసేవారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు లీకులు సాధారణమైన విషయం అంటున్నారని, తాను సెక్రటరీగా ఉన్నపుడు ఎక్కడా లీకులు కాలేదన్నారు. మోండా మార్కెట్ కంటే దారుణంగా ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని, హనీట్రాప్,హ్యాకింగ్ అంటూ పక్కదోవ పట్టించే కుట్ర చేశారని విమర్శించారు. TSPSCలోనే 10 మంది టాప్ మార్కులు తెచ్చుకున్నారని, దొంగలంతా కమిషన్ ఆఫీసులోనే ఉన్నారని ఆరోపించారు. ప్రవీణ్ OMR షీట్ మార్చింది అధికారులేనని, గ్రూప్ -1 2016 నోటిఫికేషన్‌లో కూడా అవినీతి జరిగిందని, ఇందులో జాగృతి నాయకులు పాసయ్యారని విమర్శించారు. ఘంటా చక్రపాణి హయాంలో రాజశేఖర్ రెడ్డి పేపర్ లీకేజీలో జైలుకు వెళ్లొచ్చాడని, ప్రస్తుత TSPSC సభ్యులంతా మెజారిటీగా ముఖ్యమంత్రి అనుచరులు, సన్నిహితులేనని ఆయన ఆరోపించారు. ఆర్టీఐ (RTI) ద్వారా సమాచారం ఇవ్వరని, జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అమెరికా నుంచి వచ్చి రాసిన వారు కూడా టాప్ మార్కులు తెచ్చుకున్నారని, జనార్దన్ రెడ్డికి తెలియకుండా ప్రశ్నాపత్రాలు బయటకు ఎలా పోయాయని ప్రశ్నించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో ఈ కేసు పూర్తి చేయాలనే కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జనార్దన్ రెడ్డిని కాపాడుతున్నారని, ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే దొంగలు బయట పడతారన్నారు. ఈ విద్యార్థులే తెలంగాణ తెచ్చారని, కానీ ఈ రోజు రాబందు పాలైందని, విద్యార్థులు తీవ్ర బాధలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆఫీసులో ఏం కుట్రలు జరుగుతున్నాయో విద్యార్థులకు తెలియడం లేదని, సిట్ అసలైన బాధ్యులను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. విద్యార్థులంతా నిరాశలో ఉండొద్దని, మళ్లీ ఏ పార్టీనీ పడితే ఆ పార్టీ వారికి సపోర్ట్ చేయవద్దని ఆయన సూచించారు. భార్యాభర్తల కేసుల్లో అత్తమామలను కూడా అరెస్టు చేస్తారని, కుటుంబ పెద్దలను అరెస్ట్ చేస్తారని, మరి కమిషన్ పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?, జనార్దన్ రెడ్డి, బోర్డు సభ్యులకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఫ్రెంచ్ రివల్యూషన్ తీసుకొచ్చింది, తెలంగాణ తీసుకొచ్చింది విద్యార్థులేనని, దొంగలు, దోపిడీ పాలకుల నుంచి తెలంగాణను కాపాడాల్సింది కూడా విద్యార్థులేనన్నారు. ఒక్క దెబ్బతో ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తి విద్యార్థులకు ఉందని, న్యాయమైన కోర్కె కోసం పోరాడే హక్కు విద్యార్థులకు ఉందన్నారు.
విద్యార్థులు మాట్లాడకుంటే ఎలా?, రాజకీయాలకు ఎందుకు రావద్దని, తాము పాత విద్యార్థులం కాదా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు నిజాలు చెప్పడానికి వస్తామని, స్వేచ్ఛయుత ఆలోచనలకు యూనివర్సిటీలు వేదిక అని ఆయన అన్నారు. కేసీఆర్ లాగే.. వీసీ కూడా నియంత అని, తాము విద్యార్థులకు రెచ్చగొట్టలేదని, పూర్వ విద్యార్థుల మిత్రులను కలవడానికి వచ్చామన్నారు. వీసీకి ఏం తెలుసని, నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పదివేల ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, 2016 గ్రూప్-1పై కూడా సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూవర్సిటీ విద్యార్థులతో ప్రవీణ్ కుమార్ ఉద్యమ ఙ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
Updated Date - 2023-03-23T21:31:49+05:30 IST