Maoist: మావోయిస్టు దంపతుల లొంగుబాటు
ABN, First Publish Date - 2023-05-03T20:41:39+05:30
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక ఆపరేషన్ చేయూతతో కనువిప్పు కలిగి మావోయిస్టులు లొంగిపోతున్నారని
కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక ఆపరేషన్ చేయూతతో కనువిప్పు కలిగి మావోయిస్టులు లొంగిపోతున్నారని భద్రాద్రి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ (SP Dr. Vineeth) తెలిపారు. మావోయిస్టు పార్టీకి చెందిన దంపతులు మడకం సోనా, మడకం జోగీలు లొంగిపోయినట్లు బుధవారం జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం సుక్మా పోలీస్‌స్టేషన్ పరిధిలో భీమాపురం గ్రామం పెద్దబోడికల చింతల్నార్ పంచాయతీకి చెందిన మడకం సోనా 2015 ఏడాదిలో మావోయిస్టు పార్టీ (Maoist Party)లో చేరి మూడేళ్లు ఆర్టీ 9వ ప్లాటూన్‌లో పనిచేశాడు. తరువాత మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ తుళ్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న దగ్గర గార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం సోనా బీమాపురం గ్రామానికి డాక్‌మస్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు.
మడకం జోగి అలియాస్ వెకో జోగి అలియాస్ రాధ గతంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ హరిభూషన్‌కు గార్డుగా పని చేశారు. రెండేళ్ల క్రితం మడకం సోనాను వివాహం చేసుకొని అతడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, అనాగరిక అలోచనలతో ఆదివాసీల పట్ల మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న తీరుతో అసహనం చెంది వీరిద్దరూ జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ వివరించారు. మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసి ఎందరో దళ సభ్యులు ప్రశాంత జీవితం గడుపుతున్నారని తెలిపారు. ఇకనైనా యువ నాయకులు, దళ సభ్యులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీని వీడి లొంగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-05-03T20:41:39+05:30 IST