Tammineni: సీపీఎం నేత తమ్మినేని సంచలన కామెంట్స్.. డబ్బు ప్రభావంతో ఫలితాలు తారుమారు
ABN, First Publish Date - 2023-12-07T12:05:11+05:30
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పడిందని, అందువల్లే ఫలితాలు తారుమారయ్యాయని, అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందులకు ప్రజాస్వామ్య
- ప్రజలు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నారు
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం
నేలకొండపల్లి(ఖమ్మం): ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పడిందని, అందువల్లే ఫలితాలు తారుమారయ్యాయని, అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఓడించేందులకు ప్రజాస్వామ్య విలువలను పక్కన బెట్టి ప్రలోభాలకు తెర తీశాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(CPM State Secretary Tammineni Veerabhadram) పేర్కొన్నారు. బుధవారం నేలకొండపల్లి సీపీఎం కార్యాయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కొంత అభివృద్ధి జరిగినా అహంకార ధోరణితోనే కేసీఆర్ ఓటమిపాలయ్యారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించాలని ఆకాంక్షించారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కులాలు, మతాల పేరిట చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన బీజేపీని ప్రజలు వ్యతిరేకించారని, కానీ తన సీట్లను, ఓట్ల శాతాన్ని పెంచుకోవటం ఆందోళనకరమన్నారు. తాము పోటీ చేసిన 19స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుస్తామని అంచనా వేసుకోలేదని, అధిక డబ్బు ప్రభావం ఫలితంగానే ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామన్నారు. గెలుపోటములను కమ్యూనిస్టులు సర్వసాధారణంగా భావిస్తారని, రానున్న రోజుల్లో పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, ఏటుకూరి రామారావు, రచ్చా నర్సింహారావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, రావెళ్ల అజయ్‌కుమార్, మారుతి కొండలరావు, బలుసు హనుమంతరావు, చింతలపాటి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-07T12:05:13+05:30 IST