ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసును సీబీఐకి ఇవ్వొద్దు

ABN, First Publish Date - 2023-01-06T04:04:42+05:30

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును సీబీఐకి బదిలీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును సీబీఐకి బదిలీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, సిట్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని డివిజన్‌ బెంచ్‌ను కోరాయి. ఈ మేరకు సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై వెంటనే సస్పెన్షన్‌ విధించాలని కోరారు. లేకపోతే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తుందన్నారు. ఒక్కసారి సీబీఐ దర్యాప్తు ప్రారంభమైతే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ వృథాగా అవుతుందని.. ప్రభుత్వం, సిట్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్టే ఇవ్వాలని కోరారు. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పులో సింగిల్‌ జడ్జి చాలా పొరపాట్లు చేశారని.. ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టడం తప్పు కాదని.. అది ఆయనకున్న హక్కు అని తెలిపారు. ప్రెస్‌మీట్‌ పెట్టడం వల్ల నిందితుల హక్కులకు భంగం కలిగిందనే ముగింపునకు రావడం సరికాదని తెలిపారు.

అధికార పరిధిని మీరిన సింగిల్‌ జడ్జి

‘‘మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు సహా మొత్తం ఎనిమిది ప్రభుత్వాలను బీజేపీ కూల్చింది. ఈ విషయాన్ని వారే గర్వంగా చెప్పుకొంటున్నారు. తెలంగాణలో అలాంటి ఘటన పునరావృతం కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీని సమర్థంగా అడ్డుకుంది. ప్రభుత్వాన్ని పడగొడుతుంటే ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకోవాలా? కోట్ల మంది ప్రజలు నమ్మకంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మధ్యలో ప్రభుత్వాన్ని కూల్చేస్తే.. ప్రజల హక్కులకు భంగం కలిగినట్లే. నిందితుల ట్రాప్‌కు సంబంధించిన ఆడియోలు, వీడియో ఆధారాలు మొత్తం పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయి. అన్ని ఆధారాలను సిట్‌ కోర్టుకు సమర్పించిన తర్వాతే సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఒక్కసారి కోర్టుకు ఆధారాలు సమర్పిస్తే అది పబ్లిక్‌ డాక్యుమెంట్‌ కింద లెక్క. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నదాని గురించే సీఎం మాట్లాడారు. తన ప్రభుత్వానికి జరుగుతున్న అన్యా యం గురించి సీఎం చెప్పుకోవడం నిందితుల హక్కులకు భంగం ఎలా అవుతుంది? సింగిల్‌ జడ్జి తన రిట్‌ అధికార పరిధిని మీరి వ్యవహరించారు. సిట్‌ దర్యాప్తును ఎందుకు కొట్టేశారు. ప్రభుత్వం అత్యంత విశ్వసనీయంగా దర్యాప్తు చేయిస్తున్నప్పుడు కేసును సీబీఐకి ఇవ్వడం సమాఖ్య విధానాన్ని అపహాస్యం చేయడమే. బీజేపీ చేతిలో ఉన్న సీబీఐకి అప్పగిస్తే ఫిర్యాదుదారుడినే (రోహిత్‌రెడ్డి) అరెస్ట్‌ చేస్తారేమో. సింగిల్‌ జడ్జి తీర్పు ప్రజాస్వామ్యాన్ని చంపడానికి అనుమతిస్తున్నట్లుగా ఉంది. దీనిని వెంటనే సస్పెండ్‌ చేయాలి’’ అని దుష్యంత్‌ దవే కోరారు. రోహిత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘సింగిల్‌ జడ్జి డీఫ్యాక్టో కంప్లైనెంట్‌ అయిన ప్రతివాది రోహిత్‌రెడ్డికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఆయన వాదనలు వినకుండానే ఆదేశాలు జారీచేశారు. నిందితులు పేర్కొన్న విధంగా ఇప్పటికే ఈడీ, ఐటీలు రంగంలోకి దిగాయి. ఇప్పుడు సీబీఐ వస్తోంది. ఫిర్యాదుదారుడిపైనే దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు వెళ్లాలి..

బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. ‘ి‘సంగిల్‌ జడ్జి ఆర్టికల్‌ 226 కింద క్రిమినల్‌ అధికార పరిధిలో ప్రస్తుత ఆదేశాలు ఇచ్చారు. ‘రాంకిషన్‌ ఫౌజీ ’ తీర్పు ప్రకారం ఈ ఆదేశాలపై అప్పీల్‌ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలి. క్రిమినల్‌ అధికార పరిధిలో ఇచ్చే తీర్పులపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదు. రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది తమ వాదనలు వినలేదని అంటున్నారు. ఆయన వాదనలను సింగిల్‌ జడ్జి చాలా స్పష్టంగా రికార్డు చేశారు. రోహిత్‌రెడ్డి కౌంటర్‌ కూడా దాఖలు చేశారు. దవే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని మాట్లాడుతున్నారు. నిందితులతో మాట్లాడిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఫిర్యాదుదారు సహా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి వచ్చిన వారేనని గుర్తించాలి. సింగిల్‌ జడ్జి తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం 74 అభ్యంతరాలను లేవనెత్తింది. ఇన్ని అభ్యంతరాలు ఏంటి? ఇది నిందితులను ట్రాప్‌ చేసిన కేసు. ట్రాప్‌ కేసు ఆధారాలు ఎవరూ ఇవ్వకుండానే పబ్లిక్‌ డొమైన్‌లోకి ఎలా చేరతాయి? దర్యాప్తు బదిలీ చేయడానికి వివక్ష, దురుద్దేశం ఉందనే ఆందోళన చాలు’’ అని పేర్కొన్నారు.

మధ్యంతర ఆదేశాలకు నిరాకరణ

సాయంత్రం కోర్టు సమయం ముగిసినా వాదనలు పూర్తికాకపోవడంతో తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం నిరాకరించింది. శుక్రవారం కూడా వాదనలు కొనసాగుతాయని తెలిపింది.

Updated Date - 2023-01-06T04:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising