Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పెద్దగా కనిపించని తెలుగు నేతలు
ABN, First Publish Date - 2023-05-03T18:53:47+05:30
కర్ణాటక శాసనసభ ఎన్నికల (Karnataka Assembly Elections) బహిరంగ ప్రచారం ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజుల సమయం ఉంది.
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల (Karnataka Assembly Elections) బహిరంగ ప్రచారం ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజుల సమయం ఉంది. ప్రచార హోరు తీవ్రమైంది. బీజేపీ తరపున ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని తమిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ కర్ణాటక మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అణ్ణామలైను రంగంలోకి దించింది. బెంగళూరులో స్థిరపడ్డ మలయాళీలను అకట్టుకునేందుకు కేరళ బీజేపీ నేతలు తరలివచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు నేతలు ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ (Bandi sanjay), రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాత్రం ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరపున జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని గట్టిగా వినిపించినా ఇంతవరకు ఆయన పర్యటనపై ఎలాంటి సమాచారం లేదని ఈ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి (Raghuveera Reddy), తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి రెండు రోజులు పర్యటించి వెళ్లిపోయారు.
మోదీ, షాలే సర్వస్వం...
బీజేపీలో ప్రధాని మోదీ (Prime Minister Modi), హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రచార సభలు, రోడ్‌షోలే ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ మార్కును అందుకునేందుకు బీజేపీ ఈ ఇద్దరు అగ్రనేతల మీదే ప్రధానంగా ఆధారపడి ఉంది. సీఎం బొమ్మై, యడియూరప్ప ప్రచారాలతో పోల్చితే ఈ ఇద్దరు అగ్రనేతల ప్రచారాలకే స్పందన అధికంగా ఉంటోంది. ఇక కాంగ్రెస్‌లోనూ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారమే హైలెట్‌గా ఉంది. ఈ ఇద్దరు నేతల సభ లకు జనం భారీగా తరలి వస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కూడా ప్రచారం నిర్వహిస్తున్నా కాంగ్రెస్ ప్రధానంగా రాహుల్, ప్రియాంకపైనే బాగా ఆశలు పెట్టుకుంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య కూడా పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. జేడీఎస్‌లో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నీ తామై ప్రచార బాధ్యతలు మోస్తున్నారు.
Updated Date - 2023-05-03T18:53:47+05:30 IST