TS News: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్యకేసులో వీడిన మిస్టరీ
ABN, First Publish Date - 2023-06-18T19:51:08+05:30
జనగామ జిల్లా (Jangaon District) బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (Retired MPDO Ramakrishnaiah) కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది.
జనగామ: జనగామ జిల్లా (Jangaon District) బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (Retired MPDO Ramakrishnaiah) కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన రామకృష్ణయ్య జనగామ మండలం చంపక్‌హిల్స్‌లోని ఓ మూతబడ్డ క్రషర్ వద్ద నీటి గుంటలో ఆదివారం శవమై కనిపించాడు. ఈనెల 15న ఆయన బచ్చన్నపేట నుంచి సొంత గ్రామమైన పోచన్నపేటకు వస్తుండగా గ్రామ సమీపంలో పలువురు దుండగులు ఆయన బైక్‌ను అడ్డుకొని కిడ్నాప్ చేశారు. ఈ విషయంపై ఆయన కుమారుడు నల్ల అశోక్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. రామకృష్ణయ్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అనుమానం ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేశారు. విచారణలో భాగంగా పోలీసులకు పట్టుబడిన నిందితులు రామకృష్ణయ్యను తాము హత్య చేసి చంపక్‌హిల్స్‌లోని క్రషర్ వద్ద గల నీటి గుంటలో పడేసినట్లుగా అంగీకరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చంపక్‌హిల్స్ వద్ద నీటి గుంటలో ఉన్న రామకృష్ణయ్య మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు.
ఘటనాస్థలంలోనే పోస్ట్‌మార్టం
రామకృష్ణయ్య మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. కిడ్నాప్, హత్య జరిగి మూడు రోజులు కావడంతో మృతదేహం ఉబ్బిపోయి తరలించడానికి వీలులేకుండా మారింది. దీనికి తోడు పెద్ద ఎత్తున దుర్వాసన రావడంతో మృతదేహానికి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో మృతుడి కుమారుడు అశోక్, బంధువులల సమక్షంలోనే డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో సంఘటన స్థలంలోని పోస్ట్‌మార్టం నిర్వహించి మృతుడు సొంత గ్రామమైన పోచన్నపేటకు తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బచ్చన్నపేట మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో హతుడి కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు.
రామకృష్ణయ్య హత్యకేసులో వీడిన మిస్టరీ
ఎంపీడీవోను ఐదుగురు సభ్యుల ముఠా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశామని, పరారీలో మరో ఇద్దరున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. నిందితుల నుంచి రూ.15 వేలు నగదు, కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జడ్పీ వైస్ చైర్పర్సన్ భర్త గిరిబోయిన అంజయ్యే హంతకుడని ఆయన తెలిపారు. సుపారీ ఇచ్చి అంజయ్యే హత్య చేయించారని రంగనాథ్ ప్రకటించారు.
Updated Date - 2023-06-18T19:51:08+05:30 IST