TS News: చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం
ABN, First Publish Date - 2023-04-14T20:19:01+05:30
పెద్దపల్లి జిల్లా (Peddapalli district) ఎన్టీపీసీ పీకేరామయ్యకాలనీ శివారు మేడిపల్లి చెరువులో మునిగి శుక్రవారం ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు.
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా (Peddapalli district) ఎన్టీపీసీ పీకేరామయ్యకాలనీ శివారు మేడిపల్లి చెరువులో మునిగి శుక్రవారం ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ న్యూపోరట్‌పల్లి కాలనీకి చెందిన మేకల సాయి చరణ్(13), సోయం ఉమామహేశ్(13), మామిడి విక్రం(12) అనే 8వ తరగతి విద్యార్థులు పీకేరామయ్య కాలనీ శివారులోని మేడిపల్లి (Medipalli) చెరువు వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. చెరువు లోతుగా ఉండడం, ముగ్గురికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. దీన్ని గమనించిన చెరువు గట్టు మీద ఉన్న మరో బాలుడు కేకలు వేయడంతో సమీపంలోని కొంత మంది యువకులు మునిగిపోయిన పిల్లలను బయటకు తీశారు. వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ముగ్గురు చిన్నారులు అప్పటికే మృతిచెందినట్లు ఆసుపత్రి డాక్టర్లు ధ్రువీకరించారు. ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిన్నంటిన రోదనలు
చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలవడంతో ఎన్టీపీసీ న్యూ పోరట్‌పల్లి (NTPC New Poratpalli)లో విషాదం చెలకొంది. గోదావరిఖని ఆసుపత్రిలో మృతుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో సాయిచరణ్, ఉమామహేశ్ స్థానిక దుర్గయ్యపల్లి జడ్పీ పాఠశాలలో, విక్రం ఓ ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నారు. శుక్రవారం సెలవు దినం కావడంతో చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఇంటివద్దే ఉన్న తమ పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతులు విక్రం, సాయి చరణ్, ఉమామహేశ్‌ల తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని జీవిస్తున్నారు. బాధిత కుటుంబాలను పలువురు ప్రజాప్రతినిధులు ఓదార్చారు.
Updated Date - 2023-04-14T20:20:07+05:30 IST