TSPSC Paper Leakage Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు నిందితులకు రిమాండ్
ABN, First Publish Date - 2023-03-23T18:36:03+05:30
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసు నిందితులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. 9 మంది నిందితులు ఈ నెల 28 వరకు రిమాండ్ ఉంటారు. రమేష్, సురేష్, షమీమ్కు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించగా, నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) ఇంటి దొంగల బాగోతం బయటపడుతోంది. ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు (Question Paper Leakage Case)లో సిట్ (SIT) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూప్ 1 (Group 1) పరీక్షలో 103 మందికి వందకుపైగా మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. గ్రూప్ 1 రాసిన వారిలో 20 మంది టీఎస్పీఎస్సీలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు. దీంతో సిట్ అధికారులు టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న రాజశేఖర్ రెడ్డితో సహ 42 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎఫ్ఐఆర్ (FIR) జాబితాలో చేర్చారు. దీంతో నిందితుల సంఖ్య మొత్తం 12కు చేరుకుంది.
టీఎస్పీఎస్సీలో సిస్టం ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి 120 మార్కులు వచ్చాయి. నిన్న మరో ముగ్గురిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్ 1 రాసి టాప్ మార్కులు సాధించిన రమేష్, షమీమ్, సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. రమేష్ టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, షమీమ్ శాశ్వత ఉద్యోగి, సురేష్ గతంలో టీఎస్పీఎస్సీ టెక్నికల్ సెక్షన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి బయటకు వెళ్ళాడని సిట్ తెలిపింది.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రవీణ్, రాజ్ శేఖర్ పెన్ డ్రైవ్‌లను అధికారులు సీజ్ చేశారు. పెన్ డ్రైవ్‌లకు కూడా ప్రవీణ్, రాజ్ శేఖర్ పాస్‌వార్డ్ పెట్టారు. రూ. 14 లక్షల నగదు ఆర్ధిక లావాదేవీలపై సిట్ ఆధారాలను సేకరించింది. ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నిలేశ్, గోపాల్ ద్వారా రూ.14 లక్షల నగదు అందినట్లు ఆధారాలను సిట్ సేకరించింది. రాజశేఖర్ కాంటాక్ట్స్, వాట్స్ అప్ చాటింగ్ వివరాలను సిట్ అధికారులు సేకరించారు.
Updated Date - 2023-03-23T18:45:39+05:30 IST