Vijayashanthi: బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆరెస్ నేతల దుష్ప్రచారం
ABN, First Publish Date - 2023-02-12T22:05:47+05:30
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలను బీఆరెస్ నేతలు అవగాహనా రాహిత్యంతో దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలను బీఆరెస్ నేతలు అవగాహనా రాహిత్యంతో దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కట్టడాలు వేరని ఆమె అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
'తెలంగాణ ప్రభుత్వ పరిపాలనా కేంద్రంగా సీఎం కేసీఆర్ సర్కారు రాజధాని హైదరాబాదులో నిర్మించిన కొత్త సచివాలయం గుమ్మటాలను బీజేపీ అధికారంలోకి వచ్చాక కూల్చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ నేతలు అవగాహనా రాహిత్యంతో దుష్ప్రచారం చేస్తున్నరు. దేశంలో ఉన్న మిగతా ఇలాంటి గుమ్మటాలను కూడా బీజేపీ నేతలు కూల్చేస్తారా? అంటూ అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కట్టడాలు వేరు... తెలంగాణలో నిజాం కాలపు అకృత్యాలకు ప్రతిరూపాలుగా ఉన్న ఈ గుమ్మటాల కథ వేరు. తెలంగాణ ప్రజలపైకి రజాకార్లను ఉసిగొల్పి దౌర్జన్యాలతో రాచిరంపాన పెట్టిన నిజాం రాజుల కాలంలో కూడా హైదరాబాద్ నగరమే పరిపాలనా కేంద్రంగా ఉంది. ఆ నిజాంల హయాంలో నిర్మించిన కట్టడాలన్నీ గుమ్మటాలతో కూడినవే... హైదరాబాదులోనే గాక నాటి నిజాం సంస్థానం పరిధిలో వారి తొత్తులుగా వ్యవహరించిన దొరల గడీలు సైతం కొంతవరకూ ఇలాంటి శైలిలోనే కనిపిస్తాయి. ఆనాటి పీడకల లాంటి చరిత్రను మరచిపోతూ... నేడు కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ప్రశాంతంగా బతకాలని ప్రజలు ఆశిస్తుంటే.... మళ్లీ ఆనాటి బాధలు, కష్టాలు, వేదనని గుర్తు చేసేలా ఈ గుమ్మటాల నిర్మాణాలతో కొత్త పరిపాలనా కేంద్రంగా సచివాలయం దర్శనమిస్తున్నది. ఆ చేదు రజాకార్ల జ్ఞాపకాలను చెరిపెయ్యాలన్న భావనతోనే సంజయ్ గారు గుమ్మటాలపై స్పందించారు. బీఆరెస్ నేతలు ఇప్పటికైనా తప్పుడు ప్రచారం కట్టిపెట్టి మర్యాద నిలుపుకుంటే మేలు.' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2023-02-12T22:21:39+05:30 IST