Vijayashanthi: దళితబంధు పథకం అమలుపై కేసీఆర్ వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్
ABN, First Publish Date - 2023-04-27T22:45:57+05:30
దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యలకు బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న దళితబంధు పథకం అమలుపై తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యలకు బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) కౌంటర్ ఇచ్చారు. దళితబంధు పథకం అమలులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారని సీఎం అనడం.. అంతా తనకు తెలిసే జరుగుతోందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నట్టే కదా? విజయశాంతి అని ప్రశ్నించారు. తెలంగాణను అప్పుల్లోకి నెట్టిన పార్టీ జాతీయస్థాయిలో అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలను మొగ్గలోనే తుంచెయ్యాలన్నారు.
రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టి పోస్టు యథాతథంగా..
'ఇవాళ హైదరాబాదులోని జరిగిన బీఆరెస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ గారు తమ పార్టీ ఎమ్మెల్యేలకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. తన సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారని... కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని... అలా వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని చెబుతూ... ఇది మళ్లీ రిపీట్ అయితే వారికి టికెట్ దక్కదని, ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కేసీఆర్ గారు హెచ్చరించారు. అంటే, తప్పు చేసిన ఎమ్మెల్యేలకి శిక్ష లేదు సరి కదా... తప్పు చేసినవారు మారితే మళ్లీ జనాన్ని దోచుకోవడానికి అవకాశమిస్తానని ఒక అద్భుతమైన ఆఫర్ ఇవ్వడాన్ని ఏమనుకోవాలి? వసూళ్లకి పాల్పడిన ఎమ్మెల్యేల వివరాలు తన దగ్గరున్నాయని కేసీఆర్ గారు అన్నారంటే... అంతా ఆయనకి తెలిసే జరుగుతోందని స్వయంగా ఒప్పుకున్నట్టే కదా? ఇప్పటికే తెలంగాణని అప్పుల్లోకి నెట్టిన ఇలాంటి పార్టీ జాతీయస్థాయిలో కూడా అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలని మొగ్గలోనే తుంచెయ్యకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఆ విజ్ఞత తెలంగాణ ప్రజలకుందని నా నమ్మకం.' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2023-04-27T22:48:21+05:30 IST