Vijayashanthi: నీలోఫర్ ఆస్పత్రి స్థలాన్ని ఆక్రమించిన కబ్జాదారులు.. పట్టించుకోని కేసీఆర్ సర్కారు
ABN, First Publish Date - 2023-02-15T23:15:56+05:30
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రిని కబ్జాసురులు పీడిస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న నీలోఫర్ ఆస్పత్రిని కబ్జాసురులు పీడిస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి చెందిన ఫోరెన్సీక్ ల్యాబ్ స్థలాన్ని ఆక్రమించేశారని, స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగంలోకి దిగినా ఆ స్థలాన్ని ఆక్రమదారులు లెక్క చేయడం లేదని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
'తెలంగాణలో మన చిన్నారుల ఆరోగ్యం కోసం సుమారు 70 ఏళ్ల కిందట హైదరాబాదులో ఏర్పాటు చేయించిన నీలోఫర్ ఆస్పత్రిని కబ్జాసురులు పీడిస్తున్నరు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ చిన్నపిల్లల ఆస్పత్రికి చెందిన ఫోరెన్సీక్ ల్యాబ్ స్థలాన్ని ఆక్రమించేశారు. స్వయంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగంలోకి దిగినా ఆ స్థలాన్ని ఆక్రమించినవారు లెక్కచెయ్యలేదు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌కి ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో పరిశీలించేందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ ఏసీపీని స్థానిక ఎమ్మెల్యేకి చెందినవాళ్లమంటూ కొందరు ఫోన్ చేసి బెదిరించారు. ఆస్పత్రి పరిసరాల్లోనే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నా ఎవ్వరూ భయపడలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని ఇంత పెద్ద ఆస్పత్రి స్థలాన్ని ఆక్రమించిన కబ్జాకోరులకు జీహెచ్ఎంసీ అధికారులు బెదిరింపులకు గురై భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామంపై మీడియా కోడై కూస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. భావిపౌరులకు భరోసా ఇవ్వలేని ఈ సర్కారుకు ప్రజలు చెల్లుచీటీ పాడే రోజులు దగ్గరకొస్తున్నయి.' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2023-02-15T23:16:20+05:30 IST