Free Bus Women: ఫ్రీ జర్నీ చేయాలంటే ఈ కార్డులుండాలి!
ABN, First Publish Date - 2023-12-09T03:22:57+05:30
కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని శనివారం ప్రారంభించనుంది.
నేటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
మధ్యాహ్నం 2 గంటల నుంచి అమల్లోకి
అసెంబ్లీ ప్రాంగణంలో 1.30 గంటలకు
ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వర్తింపు
సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఉచితం
రాష్ట్రవ్యాప్తంగా 7292 బస్సుల్లో వినియోగం
ఏదైనా గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి
మహిళలకు జీరో టికెట్ ఇస్తాం: ఎండీ సజ్జనార్
ఆర్టీసీకి రోజుకు 7 కోట్లు తగ్గనున్న ఆదాయం!
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకాన్ని శనివారం ప్రారంభించనుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్‌తోపాటు మహిళా అధికారులు, ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. హైదరాబాద్ సిటీలో.. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రె్‌సలలోనూ ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుంది. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్‌లు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు అర్హులని టీఎ్‌సఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఇకపై బస్‌పా్‌సలతో అవసరం లేకుండా పోయింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ ఏసీ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణానికి అవకాశం లేదని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ముందస్తు రిజర్వేషన్, ఇతర కారణాల వల్ల ఈ బస్సుల్లో వర్తింపజేయడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7292 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని వర్తింపజేస్తారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా ఆర్టీసీపై అదనంగా రూ.3 వేల కోట్ల వరకు ఆర్థిక భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణ సమయంలో మహిళలు స్థానికత ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్ని రోజుల వరకు మాత్రం ఎలాంటి కార్డు చూపించకపోయినా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉచిత ప్రయాణానికి ఎలాంటి పరిమితులు, నిబంధనలు లేవని చెప్పారు. ఈ పథకంపై ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కిలోమీటర్ల ప్రయాణ పరిధి, రోజుకు నిర్ధిష్టమైన ట్రిప్పులు వంటి పరిమితులేవీ లేవన్నారు. టిమ్స్‌లో రిక్యాలిబరేషన్ పూర్తి చేసిన తర్వాత మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ జారీ చేస్తామన్నారు. జీరో టిక్కెట్ల ఆధారంగా ఆర్టీసీకి ప్రయాణ చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని, ఆ కార్డులపై ఉచిత ప్రయాణం అవకాశం లభిస్తుందని వెల్లడించారు. కాగా, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే (అంతర్రాష్ట్ర సర్వీసుల) బస్సుల్లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని తెలిపారు రోజుకు రూ.7 కోట్ల ఆదాయానికి పరిమితం..
మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం సగానికి సగం తగ్గిపోనుంది. రోజూ సుమారు 35 లక్షల నుంచి 40 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి చార్జీల రూపంలో ప్రస్తుతం రోజుకు సుమారు రూ.14 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. శనివారం నుంచి ఈ ఆదాయం రూ.7 కోట్లకు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే సాధారణ, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, కూలీలు ప్రయాణిస్తుంటారు. నెలవారీగా రాయితీ బస్‌పా్‌సలనూ వినియోగిస్తున్నారు. వీరిలో 50 శాతానికి పైగా మహిళలున్నారు. ఇక నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుండడంతో రాయితీ పాస్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. దీంతో బస్‌పా్‌సల రూపంలో వచ్చే ఆదాయం పై కూడా ప్రభావం పడుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మహిళా ప్రయాణికుల వాస్తవ చార్జీలను లెక్కగట్టి ఆర్టీసీ అందించే వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చనుంది. ఇప్పటికే ఆర్టీసీ వివిధ వర్గాల రాయితీల కింద రూ.1000 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ నిధులను వినియోగిస్తోంది.
పెరగనున్న రద్దీ..
మహిళల ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని, దాంతో బస్‌స్టేషన్లలోనూ రద్దీ పెరుగుతుందని సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో బస్‌స్టేషన్ల నిర్వహణపై దృష్టి కేంద్రీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఉచిత ప్రయాణం అమలులో క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ ఉద్యోగులకు సూచించారు. గత రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Updated Date - 2023-12-09T10:59:08+05:30 IST