Anam Ramanarayana Reddy: జగన్ ఒక చీటర్.. బ్లాక్ మెయిలర్
ABN, Publish Date - Sep 23 , 2024 | 04:36 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి గత పాలకులు దోపిడికి పాల్పడ్డారన్నారు.
నెల్లూరు, సెప్టెంబర్ 24: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడి గత పాలకులు దోపిడికి పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పరీక్షలు నిర్వహిస్తే.. నివేదికల్లో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని స్పష్టమైందన్నారు.
లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి సరఫరా చేసే సంస్థకు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాల్సి ఉందన్నారు. కానీ ఏడాది కూడా అనుభవం లేని కంపెనీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ కట్ట పెట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం.. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డినే హత్య చేశాడని ఈ సందర్భంగా మంత్రి ఆనం గుర్తు చేశారు. అలాగే తిరుమలను దోచుకోమని మరో బాబాయిని పంపించాడంటూ వైవీ సుబ్బారెడ్డిని పరోక్షంగా విమర్శించారు.
ఇంత అపచారం జరిగితే.. తనకు ఏమి తెలియని నంగనాచిలా ప్రధానికి లేఖ రాశాడంటూ వైఎస్ జగన్ వ్వవహారిస్తున్న తీరుపై మండిపడ్డారు. వైఎస్ జగన్ ఒక చీటర్.. బ్లాక్ మెయిలర్ అని ఆయన అభివర్ణించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బ తీశాడన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు ఇటీవల పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో గడిచిన 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల మధ్యకు కూటమి ప్రభుత్వం తీసుకు వెళ్తుంది. అందులోభాగంగా ఆత్మకూరు పట్టణంలోని పేరారెడ్డిపల్లిలో గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆయన పైవిధంగా స్పందించారు.
Updated Date - Sep 23 , 2024 | 04:39 PM