దూకేద్దాం !
ABN, Publish Date - Jul 03 , 2024 | 12:24 AM
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈక్రమంలోనే కొందరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇదే వరుసలో గుంతకల్లు వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలను ముందుగానే పసిగట్టిన నలుగురు కౌన్సిలర్లు గుమ్మనూరు జయరాంకు టిక్కెట్టు ఇచ్చిన వెంటనే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ కౌన్సిలర్లలో అంతర్మథనం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో వార్డుల్లో ...
వైసీపీ కౌన్సిలర్ల చూపు టీడీపీ వైపు
పిలుపు కోసం ఎదురు చూస్తున్న వైనం
గుంతకల్లు, జూలై 2: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈక్రమంలోనే కొందరు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇదే వరుసలో గుంతకల్లు వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలను ముందుగానే పసిగట్టిన నలుగురు కౌన్సిలర్లు గుమ్మనూరు జయరాంకు టిక్కెట్టు ఇచ్చిన వెంటనే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ కౌన్సిలర్లలో అంతర్మథనం ప్రారంభమైంది. వైసీపీ హయాంలో వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదు. ఇప్పుడు పార్టీ అధికారంలో కూడా లేదు కనుక ఇదే పార్టీలో ఉంటే ఓటర్ల వద్ద పరపతి ఉండదనే ఉద్దేశ్యంతో కొందరు టీడీపీ వైపు చూస్తున్నారు. ఒకరి వెనుక ఒకరుగా ఎమ్మెల్యే జయరాంను కలిసి
సన్మానాలు చేసి, తమ సంసిద్ధతను తెలియజేస్తున్నారు. మున్సిపల్ చైర్మన పదవి విషయంగా ఇప్పటికే వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే నుంచి గ్రీన సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. చైర్మనపై అవిశ్వాస తీర్మానం పెట్టే కాలాన్ని నాలుగేళ్ల నుంచి కుదించడానికి ప్రభుత్వం యోచిస్తోందన్న అభ్రిపాయాలు వ్యక్తమౌతున్న తరుణంలో గుంతకల్లు మునిసిపాలిటీలో రాజకీయం వేడెక్కుతోంది.
టీడీపీలోకి మరో ఏడుగురు?
ఎన్నికలకు ముందు నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, ప్రస్తుతం మరో ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో టచలోకి వెళ్లినట్లు సమాచారం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జయరాం నివాసానికి వెళ్లి తమ అంగీకారాన్ని తెలుపుతున్నారు. వైసీపీ కౌన్సిలర్ల చేరికపై టీడీపీలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. మునిసిపల్ కౌన్సిల్‌లో టీడీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన నలుగురితో కలుపుకుని ఇప్పుడు టీడీపీ బలం 11కి పెరిగింది. కౌన్సిల్‌లో చైర్మనగిరి దక్కాలంటే 19 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరమౌతుంది. ఈ లెక్కన మరో ఎనిమిది మంది కౌన్సిలర్ల మద్దతు టీడీపీకి కావలసి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే వైసీపీ నుంచి 10 మందికి పైగా కౌన్సిలర్లు టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా మునిసిపాలిటీలో సీపీఐ నుంచి ఒక కౌన్సిలరు ఉన్నాడు. అతడి ఓటు కూడా టీడీపీకే వచ్చే పరిస్థితులున్నాయి. నియోజకవర్గంలో మునిసిపాలిటీ ఉంటే ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఉంటారు. నియోజకవర్గంలో గుంతకల్లు, గుత్తి మునిసిపాలిటీలు ఉన్నాయి. ఒకటికి మించి
మునిసిపాలిటీలుంటే ఎమ్మెల్యే ఎక్కడో ఒకచోట ఎక్స్ అఫిషియో మెంబర్‌గా పేరును నమోదు చోసుకోవాల్సి ఉంటుంది. పేరును నమోదు చేసుకున్నచోట చైర్మన ఎన్నికలో పాల్గొని ఓటువేసే అధికారం ఎమ్మెల్యేకు లభిస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యే గుంతకల్లు మునిసిపాలిటీలో తన పేరును నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. తద్వారా టీడీపీకి ఓ ఓటు కలిసి వస్తుంది. ఎంపీ కూడా ఈ మునిసిపాలిటీలోనే పేరు నమోదు చేసుకుంటే రెండు ఓట్లు కలిసివస్తాయి.
మార్చికల్లా పరిస్థితి తారుమారు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే కనీస గడువు నాలుగు సంవత్సరాల నుంచి తగ్గించకపోయినా వచ్చే మార్చికల్లా గుంతకల్లు మునిసిపాలిటీలో పరిస్థితులు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. వైసీపీలోనే చైర్మన పదవిని పంచుకునే విషయంగా ఉన్న ఒప్పందం నెరవేరలేదు. కౌన్సిల్ అధ్యక్ష పదవి మొదటి రెండున్నర ఏళ్లు ప్రస్తుత చైర్‌పర్సన ఎన భవానికి, తర్వాతి రెండున్నరేళ్లు మరో కౌన్సిలరైన మాజీ ఎమ్మెల్యే గాదిలింగప్ప సతీమణి వెంకట లక్ష్మికి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ముగిసి దాదాపు సంవత్సరం కావస్తోంది. కానీ అధికార మార్పిడి జరగకపోవడంపై వైసీపీ నాయకుడు గాది లింగేశ్వరబాబు (చిన్నబాబు) కినుక వహించారు. ఈ విషయంగా వైసీపీ అధిష్టానం చిన్నబాబుకు సర్దిచెప్పి ఎన భవానీని చైర్‌పర్సనగా కొనసాగించింది. సంవత్సరం కిందట పదవీ గండం నుంచి గట్టెక్కిన చైర్‌పర్సన భవాని వచ్చే మార్చిలో మరో గండాన్ని ఎదుర్కోనున్నారు. ఈసారి గట్టెక్కగలరా, లేదా? అనేది వేచి చూడాల్సిందే.
గుత్తి మునిసిపల్ కౌన్సిలర్లు కొందరు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడానికి యత్నించారు. అయితే వారు కొన్ని డిమాండ్లు పెట్టడంతో చేరికపై జయరాం పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అక్కడ కూడా కొందరు సభ్యులు టీడీపీలో చేరే యోచనతో ఉన్నారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో మరలా టిక్కెట్టును ఇచ్చేలా హామీ పొంది పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 03 , 2024 | 12:24 AM