Vinayaka chavithi : పంచేద్దాం ఆనందాన్ని..
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:10 AM
పండుగలు బంధుమిత్రులను ఒకచోట కలుపుతాయి. ఇంటిల్లిపాదికీ సంతోషాన్నిస్తాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలు, సినిమాలు, ఆలయ సందర్శన.. ఇలా ఎన్నెన్నో ఆనందాలను మోసుకొస్తాయి. కానీ, కొందరి కష్టాలను, చిన్న చిన్న కోరికలను కూడా తీరుస్తాయి. పూజా సామగ్రి, వస్తు విక్రయాల ద్వారా కొంత సొమ్ము వారి చేతికి వస్తుంది. ఆ ఒక్క రోజు సంపాదనపై వారు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. మిగిలిన పండుగలతో పోలిస్తే.. వినాయచవితి ఆదాయం ...
నేడు వినాయకచవితి
వేడుకలకు సిద్ధమైన జనం మార్కెట్‌లు, కూడళ్లలో రద్దీ
పండుగలు బంధుమిత్రులను ఒకచోట కలుపుతాయి. ఇంటిల్లిపాదికీ సంతోషాన్నిస్తాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలు, సినిమాలు, ఆలయ సందర్శన.. ఇలా ఎన్నెన్నో ఆనందాలను మోసుకొస్తాయి. కానీ, కొందరి కష్టాలను, చిన్న చిన్న కోరికలను కూడా తీరుస్తాయి. పూజా సామగ్రి, వస్తు విక్రయాల ద్వారా కొంత సొమ్ము వారి చేతికి వస్తుంది. ఆ ఒక్క రోజు సంపాదనపై వారు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. మిగిలిన పండుగలతో పోలిస్తే.. వినాయచవితి ఆదాయం ఎక్కువ. గణపతి ప్రతిమలు, పూలు, పండ్లు, చెరుకులు, అరటి పిలకలు, గరిక.. ఇలా భిన్నమైన పూజా సామగ్రి ఈ వేడుకలలో వినియోగిస్తారు. ఒక్క రోజు వచ్చే
ఆదాయం కోసం కొందరు పూజా సామగ్రిని సేకరించి.. రోడ్డు పక్కన, కూడళ్లలోనా అమ్ముతుంటారు. అలాంటివారు అనంతపురం నగరంలో పదుల సంఖ్యలో కనిపిస్తారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇలాంటి ‘ఒక్క రోజు’ వ్యాపారులు చాలా మంది ఉంటారు. ఆటోవాలాలు, సంచార జాతులవారు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు.. వినాయకచవితి ఆదాయం ద్వారా ఊరట చెందుతారు. ‘వీటిని అమ్మితే ఎంతొస్తుంది..? ఆ డబ్బు ఏం చేస్తారు..?’ అని అడిగితే.. కొంతమంది తమ పిల్లలకు కొత్త బట్టలు కుట్టిస్తామని అన్నారు. మరికొందరు చదువులకు ఖర్చుపెడతామన్నారు. చిన్న చిన్న అవసరాలకు పనికొస్తాయని అన్నారు. బొజ్జ గణపతి తన భక్తుల ద్వారా ఇలా పేదలను ఆదుకుంటున్నారు చూశారా..?
ఆ కిక్కే వేరు..!
వ్యాపారం అంటేనే బేరసారాలు ఉంటాయి. కానీ, రోడ్డు పక్కన చిరు వ్యాపారులతో బేరం ఆడకుండా కొని చూడండి..! వారి కళ్లలో మెరుపు కనిపిస్తుంది. పూజా సామగ్రిని సంచిలో సర్ది మరీ మిమ్మల్ని బైకు ఎక్కిస్తారు. ‘ఇట్ల పట్టుకోండి సర్.. మీరు బండి ఎక్కండి మేడం.. నేను అందిస్తా..’ అని సంతోషంగా సాగనంపుతారు. మాల్స్‌కు వెళితే మాట మాట్లాడకుండా బిల్లును చెల్లిస్తాం. క్రెడిట్ కార్డును దర్జాగా గోకిస్తాం. చిరు వ్యాపారుల వద్ద కూడా మనం ఇంతే దర్జాగా వందో రెండొందలో ఇస్తే.. వారి కష్టాలను కొంతైనా తీర్చినవారమౌతాం..! పండుగ అంటే.. మనం ఆనందంగా ఉండటమే కాదు.. మన చుట్టూ ఆనందాన్ని నింపడం..! నింపేద్దాం..! మహా అంటే.. పూజాపత్రాల వద్ద ఓ రెండొందలు ఖర్చవుతుంది. పూల వద్ద ఓ యాభై ఎక్కువ అవుతుంది. ఏమంటారు..? ఎదుటివారి కళ్లలో ఆనందానికి మనం కారణమైతే.. ఆ ఫీలింగే వేరు..! ట్రై చెయ్యండి..! చాలా బాగుంటుంది..!
కడుపు నిండా తిను కన్నా..!
అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ సమీపంలో కన్న బిడ్డలకు గోరు ముద్దలు తినిపిస్తున్నది ఆటో డ్రైవర్ అరుణ్ కుమార్, ఆయన భార్య. రాజీవ్ కాలనీ పంచాయతీలోని ముత్యాలమ్మ కాలనీలో ఉంటారు వీరు. వినాయకచవితి పూజా సామగ్రిని నగర శివారు ప్రాంతాలలోని పొలాలు, తోటలలో సేకరించి, ఆటోలో తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భార్య, పిల్లలు ఇలా రోడ్డు పక్కన ఒక్క రోజు వ్యాపారులుగా మారారు. వారం రోజులపాటు ఆటో తోలితే వచ్చే సంపాదన ఈ ఒక్కరోజే వస్తుందని అరుణ్ కుమార్ అన్నారు. పదిహేనేళ్లుగా పండుగకు ముందు రోజు తాము పూజా సామగ్రిని విక్రయిస్తామని, వచ్చిన ఆదాయాన్ని అప్పులు తీర్చేందుకు, ఇతర అవసరాలకు వాడుకుంటామని అన్నారు. అమ్మకాలు జోరుగా సాగే సమయంలోనూ తీరిక చేసుకుని మరీ బిడ్డల ఆకలి తీర్చడం కన్నవారి ప్రేమకు అద్దం పడుతోంది.
- అనంతపురం కల్చరల్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 07 , 2024 | 12:10 AM