WORKERS : కకావికలం
ABN, Publish Date - Jun 13 , 2024 | 11:37 PM
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో తమకు మంచి రోజులు వస్తాయని భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకు ముందు ప్రభుత్వాలు కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు స్వస్తి పలికింది. కార్మికుల పొట్ట కొడుతూ కార్మిక సంక్షేమ శాఖ నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు కార్మిక సంక్షేమశాఖ ద్వారా 2019 వరకూ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. టీడీపీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు భవన నిర్మాణ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కూడా సంక్షేమ పథకాలనూ ...
వైసీపీ పాలనలో నిర్మాణరంగం కుదేలు
పనులు లేకపలువురి ఇబ్బందులు
పథకాల రద్దుతో పస్తులున్న కార్మికులు
ధరల పెరుగుదలతో ఉపాధి కోల్పోయిన వైనం
లేబర్ కార్డులున్నా ప్రయోజనం సున్నా
కొత్త ప్రభుత్వంలో పథకాల పునరుద్ధరణపై కోటి ఆశలు
అనంతపురం కల్చరల్, జూన 13: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుండటంతో తమకు మంచి రోజులు వస్తాయని భవన నిర్మాణ కార్మికులు ఎదురు చూస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంతకు ముందు ప్రభుత్వాలు కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు స్వస్తి పలికింది. కార్మికుల పొట్ట కొడుతూ కార్మిక సంక్షేమ శాఖ నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు కార్మిక సంక్షేమశాఖ ద్వారా 2019 వరకూ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. టీడీపీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు భవన నిర్మాణ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కూడా సంక్షేమ పథకాలనూ అందజేశారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలకే పరిమితం చేస్తూ, భవన నిర్మాణ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అందే సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ మెమో నెం.1214ను జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3లక్షలకు పైగా భవన నిర్మాణ
కార్మికులున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇసుక, భవన నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో నిర్మాణరంగం మందగమనంలో పయనించింది. అసలే ధరల పెరుగుదలవల్ల పనుల్లేక అల్లాడిపోతుండగా... లేబర్ వెల్ఫేర్ బోర్డుద్వారా అందే సంక్షేమ పథకాలు కూడా రాకపోవడంతో కార్మికులు లబోదిబోమ న్నారు. సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఇటీవల జిల్లా కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఉపకమిషనర్ లక్ష్మీనరసయ్యకు వినతిపత్రం సమర్పించారు. అయితే ఈ నిరసనలపై ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం స్పందించలేదు. ఇపుడు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టనుంది. ఇకనుంచైనా కార్మికుల సంక్షేమానికి పూర్వవైభవం తీసుకొస్తారని కార్మికులు ఆకాంక్షిస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికులకు దూరమైన పథకాలివే...
భవన నిర్మాణరంగ కార్మికులు లేబర్ వెల్ఫేర్ బోర్డుద్వారా లేబర్ కార్డును పొందితే సంక్షేమ పథకాలను అందించేవారు. కార్మికుడు పనిలో ఉన్నపుడు లేదా పని నుంచి ఇంటికి వెళ్లేటపుడు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.2లక్షలు చొప్పున లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రమాద బీమాను అందించేవారు. కార్మికుడి పిల్లలకు వివాహం చేస్తే పెళ్లికానుక కింద రూ.10వేలు, ప్రసూతి ఖర్చులకోసం రూ.20వేలు, విద్యార్థుల స్కాలర్‌షిప్ కింద రూ.1200లు చొప్పున ఇచ్చేవారు. లేబర్ బోర్డుద్వారా ఇస్తే ముఖ్యమంత్రి పేరుకు ప్రచారముండదని భావించి ప్రభుత్వ యంత్రాంగం ఆ నిధులను వైఎ్‌సఆర్ కానుక కిందకు మార్చేశారు. ఈ పథకాలన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా మాత్రమే భవన నిర్మాణ కార్మికులకు అందేవి. ప్రస్తుత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేసి ప్రభుత్వం ద్వారా మాత్రమే అమలు చేస్తూ, ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారికి వైఎస్సార్‌బీమా కింద, పెళ్లి కానుకను వైఎస్సార్ కల్యాణమస్తు కిందకు మార్చేశారు. ఇక ఆరోగ్యశ్రీని చూపుతూ మెటర్నిటీ ఖర్చులను ఇవ్వడం మానేశారు.
కొండెక్కిన మెటీరియల్ ధరలు
గత టీడీపీ ప్రభుత్వ పాలనలో భవన నిర్మాణ సామగ్రి(మెటీరియల్) ధరలతో పోలిస్తే వైసీపీ పాలనలో కొండెక్కాయి. దీంతో చాలావరకు నిర్మాణాలను వాయిదా వేసుకున్న పరిస్థితి. ఏడాదికి కనీసం 3 లేదా 4 భవనాల నిర్మాణ పనులకు కాంట్రాక్టు తీసుకునే మేస్త్రీలు 1 లేదా 2 పనులకే పరిమితమవాల్సి వచ్చింది. పనులు తక్కువవడంతో ఉన్న పనిలోనే తమ జీవనాధారంకోసం కూలి రేట్లను పెంచామంటున్నారు తాపీమేస్త్రీలు.
పోరాటం ఆగదు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే అధికారులు అనేక నిబంధనలు చూపుతుంటారు. మా కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అందించే లేబర్ కార్డు ప్రామాణికంగా బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలి. అపుడే కార్మికులకు న్యాయం జరుగుతుంది. లేబర్ వెల్ఫేర్ బోర్డుద్వారానే సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ఇప్పటికే అధికారులకు పలుమార్లు విన్నవించాం. కార్మికశాఖ కార్యాలయం వద్ద ధర్నాలు చేశాం. అయినా అధికారుల్లో ఎలాంటి స్పందన కనిపించలేదు. పథకాలను పునరుద్ధరించే వరకూ మా పోరాటాన్ని ఆపం.
- వెంకటనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
పథకాలను పునరుద్ధరించాలి..
గతంలో టీడీపీ పాలనలో లేబర్ వెల్ఫేర్ బోర్డుద్వారా మాకు అందే సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనముండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మా పథకాలకు కోత విధించి కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలకే పరిమితం చేయడం దుర్మార్గం. కష్టం, ప్రమాదంతో కూడుకున్న పనులు మావి. మాలాంటివారికి అన్యాయం చేయడం తగదు. రాష్ట్రంలో టీడీపీ అఽధికారం చేపట్టనుంది. ఇకనుంచైనా మా కార్మికులకు అందే పథకాలను పునరుద్ధ్దరించి ఆదుకుంటారని ఆశిస్తున్నాం.
- భాస్కర్, తాపీమేస్త్రీ
మా పథకాలు మాకే వర్తింపజేయాలి
కార్మికుల సంక్షేమంకోసం ఏర్పాటు చేయబడినది లేబర్ వెల్ఫేర్ బోర్డు. అయితే ఆ బోర్డు నిధులను వైసీపీ ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించి కార్మిక రంగాన్ని నట్టేట ముంచింది. కార్మికశాఖను నిర్వీర్యం చేసింది. కొత్త ప్రభుత్వంలోనైనా మా పథకాలను తిరిగి ప్రవేశపెట్టి మాకే వర్తింపజేయాలి.
- టి.కుమార్, తాపీమేస్త్రీ
ప్రమాదాలు జరిగితే ఆదుకునేవారు లేరు
భవన నిర్మాణ పనులకు వెళ్లినపుడు ఏదైనా ప్రమాదం జరిగి మరణం లేదా అంగవైకల్యం కలిగితే కార్మిక సంక్షేమ శాఖ ద్వారా లేబర్ కార్డు పొందిన కార్మికులకు బీమా ఉండేది. గతనెల 29న మాతోపాటు పనిచేసే మద్దిలేటి పునాదిరాళ్లు తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి మృతిచెందాడు. అయినా లేబర్ వెల్ఫేర్‌బోర్డు ద్వారా అతడి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు.
- మురళి, బేల్దారి
సగానికి పైగా పనులు తగ్గిపోయాయి : ప్రకాష్, తాపీమేస్త్రీ
గతంలో ఏడాదికి కనీసం నాలుగైదు బిల్డింగ్ కాంట్రాక్టులను తీసుకుని పనులు చేయించేవాళ్లం. మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సగానికి పైగా పనులు తగ్గిపోయాయి. దీంతో ఏడాదికి ఒకటి లేదా రెండు కాంట్రాక్టులకే పరిమితమవుతున్నాం. ఈ ప్రభుత్వంలోనైనా ధరలను నియంత్రించాలని కోరుకుంటున్నాం. అపుడే పనులు పెరుగుతాయి.
పనుల్లేక పస్తులు : లక్ష్మీదేవి, కూలీ
మెటీరియల్ ధరలు పెరిగిపోయి పనులు తక్కువవడం వల్ల మాలాంటి పేదల జీవనం కష్టంగా మారింది. పని ఉంటే కూలీ వస్తుంది, పనుల్లేనపుడు కొన్ని సందర్భాల్లో పస్తులున్న రోజులూ ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలోనైనా మెటీరియల్ ధరలను తగ్గిస్తే పనులు పెరిగి మాలాంటి వారి కడుపు నిండుతుంది.
కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాం
12 సంవత్సరాలుగా భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నా. మాలాంటి కార్మికులకోసం టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయాలి. ఇప్పటికైనా మా కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నాం.
- మహాలక్ష్మి, కూలీ
అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నా...
దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా బేల్దారి పని చేస్తున్నా. ఏనాడూ ఇలాంటి పరిస్థితి లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి పనులు తగ్గిపోయాయి. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలూ పెరిగిపోయాయి. చేసేదేమీ లేక పనుల్లేని సమయాల్లో మా మేస్త్రీ వద్ద అప్పుచేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది. ఎట్టకేలకు ప్రభుత్వం మారింది. ఇప్పటికైనా ధరలను నియంత్రిస్తే మేలు.
- వన్నూరుస్వామి, బేల్దారి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 13 , 2024 | 11:37 PM