Chandrababu : ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్
ABN, Publish Date - Nov 08 , 2024 | 04:51 AM
ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలన్నింటికీ తగిన విధంగా కరెంటు అందజేస్తా. అందుకోసం రూ.5,409 కోట్లతో ఏడు సబ్ స్టేషన్లను ప్రారంభించా... 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశా, 10 ట్రాన్స్‌మిషన్ లైన్లు ప్రారంభించా. ఏడాదిలోపు వాటిని పూర్తిచేసి అందరికీ విద్యుత్ అందజేస్తా..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.
రూ.5,409 కోట్లతో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లు
ఏడాదిలోపు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తాం
రెండేళ్లలో అమరావతిని నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా
ఒక్కసారి ఓటేస్తే... కాటేసేందుకు వచ్చిన జగన్
కక్షతో పీపీఏ అగ్రిమెంట్లు రద్దుచేసి ప్రజలపై భారం
తాళ్లాయపాలెం సభలో సీఎం చంద్రబాబు ధ్వజం
గుంటూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘ప్రతి ఇంటికీ నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలన్నింటికీ తగిన విధంగా కరెంటు అందజేస్తా. అందుకోసం రూ.5,409 కోట్లతో ఏడు సబ్ స్టేషన్లను ప్రారంభించా... 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశా, 10 ట్రాన్స్‌మిషన్ లైన్లు ప్రారంభించా. ఏడాదిలోపు వాటిని పూర్తిచేసి అందరికీ విద్యుత్ అందజేస్తా..’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని అమరావతిలోని తాళ్లాయపాలెంలో ఏర్పాటు చేసిన 400/220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లో యంత్రాలను, విద్యుత్ పరికరాలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏపీ ట్రాన్స్‌కో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులపై ప్రదర్శించిన ఏవీని వీక్షించారు. అనంతరం కృష్టాజిల్లా పెడన, శ్రీకాకుళం జిల్లా కొల్లాం, నంద్యాల జిల్లా బేతంచర్ల, తిరుపతి జిల్లా సూళ్లురుపేట, చిత్తూరు జిల్లా వి.కోట, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, కడప జిల్లా మైదుకూరులలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లను చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు.
సత్యసాయి, గన్నవరం, జమ్మలమడుగు, మాంబట్టు సహా 14 ప్రాంతాల్లో నిర్మించనున్న సబ్‌స్టేషన్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాళ్లాయపాలెంలో రూ.509 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌తో సీఆర్డీఏ భవిష్యత్ అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా తీరతాయని తెలిపారు. ప్రపంచమే తలతిప్పి చూసేలా అమరావతిని నంబర్ వన్ నగరంగా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరావతిని కాపాడి, నిలబెట్టిన ఘనత రాజధాని రైతు ఆడబిడ్డలదేనని, ఆ ఉద్యమం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలు లేకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లతో రెండేళ్లలో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఖరాఖండీగా చెప్పినట్లు పేర్కొన్నారు.
2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిననాడే దీనికి శ్రీకారం చుట్టానని, అప్పుడే ఈ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశానని, ఐదేళ్ల వైసీపీ విధ్వంసక పాలనలో అది మరుగున పడిపోయిందని ఆరోపించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో దానిని పూర్తిచేసి ప్రారంభించానని చెప్పారు. నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ నిర్వాకంపై విరుచుకుపడ్డారు. పోయినసారి మీరందరూ ఓటేస్తే ఆ దుర్మార్గుడు కాటేసేందుకు వచ్చారని జగన్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు చేసి రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని పీపీఏలు రద్దు చేశారు. 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వం సోలార్, విండ్ పవర్‌కు టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేస్తే, వాటిని రద్దుచేసి వేధించారు. దీనిని దేశమంతా ‘ఛీ’ కొట్టింది. కేంద్ర మంత్రి హెచ్చరించినా, దావో్‌సలో పారిశ్రామికవేత్తలు నిరసనలు తెలిపినా పట్టించుకోకుండా కక్షతో జగన్ పీపీఏలు రద్దు చేశారు. వారంతా కోర్టుకెళితే రూ.12వేల కోట్లకు పైగా చెల్లించాల్సి వచ్చింది. విద్యుత్ చార్జీలు తొమ్మిదిసార్లు పెంచి ప్రజలపై రూ.32,160 కోట్ల భారం వేశారు. ఒక్క యూనిట్ సోలార్ విద్యుత్ కూడా వాడుకోకుండా రూ.9,900కోట్లు, పవన విద్యుత్‌కు రూ.500 కోట్లు, విశాఖపట్నంలో హిందూజాకు రూ.1,235 కోట్లు చెల్లించారు. వాటిద్వారా వచ్చే 2,872 మిలియన్ యూనిట్లలో ఒక్క యూనిట్ కూడా వాడుకోలేదు. చెల్లించిన మొత్తం ప్రజలపై భారంగా వేశారు. కృష్ణపట్నం స్టేజ్-2, వీటీపీఎస్ స్టేజ్-5 పనులు పూర్తిచేయకపోవడం, పోలవరం హైడల్ పవర్ పూర్తికాకపోవడం వల్ల ఆ భారం కూడా పెరిగింది’ అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెంచిన విద్యుత్ చార్జీల భారం కూడా జగన్ ప్రతిపాదనల నిర్వాకమేనని వివరించారు.
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చానని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పట్లో దాన్ని అందరూ వ్యతిరేకించారని, కానీ విద్యుత్ ఉంటేనే అభివృద్థి, పేదరికం పోతుందని చెప్పి 1998లో సంస్కరణలతో పాటు రెగ్యులేటరీ కమిషన్ తెచ్చామని, తద్వారా విద్యుత్ దుర్వినియోగం, దొంగతనాలను నివారించగలిగామని తెలిపారు. 2004 నాటికి మిగులు విద్యుత్ సాధించామని, లో-ఓల్టేజీ సమస్య లేకుండా చేశామని చెప్పారు.
Updated Date - Nov 08 , 2024 | 04:51 AM