AP Liquor brands : జే బ్రాండ్లకు చెక్..!
ABN, Publish Date - Jun 11 , 2024 | 02:43 AM
బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ మద్యం డిపోలకు చేరుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయిన ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి తిరిగి వచ్చేస్తున్నాయి. కమీషన్ల కోసం ఇంతకాలం తొక్కిపట్టిన బ్రాండ్ల కంపెనీలకు ఇప్పుడు విముక్తి లభించినట్టయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పాత విధానాన్ని పక్కనబెట్టిన బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు నిబంధనల ప్రకారం ఆర్డర్లు ఇస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్లకు చెక్ పడనుంది.
తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్
ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు
వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే
కప్పం కట్టబోమన్న బ్రాండ్లు కనుమరుగు
ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తున్న బేవరేజెస్ కార్పొరేషన్
ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందంటున్న కంపెనీలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ మద్యం డిపోలకు చేరుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇదే కింగ్‌ఫిషర్ కంపెనీ తమకు వ్యాపారమే వద్దంటూ రాష్ట్రంలో ఉన్న బ్రూవరీని మూసేసుకుని వెళ్లిపోయింది. ఆ కంపెనీకి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో బ్రూవరీ ఉంది. జగన్ ప్రభుత్వంలోని పెద్దలు అన్ని కంపెనీల తరహాలోనే కేసుకు రూ.150 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ కంపెనీ రూల్స్‌కు విరుద్ధమని, తమ వ్యాపారం జాతీయ స్థాయిలో ఉందని, ఇలాంటివి తాము ప్రోత్సహించేది లేదని కింగ్‌ఫిషర్ తేల్చి చెప్పింది. ఎంత పెద్ద కంపెనీ అయినా తమకు ఒకటేనని అప్పట్లో అధికారులు ఆర్డర్లు నిలిపివేశారు. అప్పటికే ఆర్డర్ ఇచ్చి డిపోలకు చేరిన మద్యాన్ని షాపులకు పంపకుండా నిల్వ ఉంచి, ఆరు నెలల తర్వాత బహిరంగంగా వాటిని బుల్డోజర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆ కంపెనీ రణస్థలంలో ఉన్న బ్రూవరీని మూసేసుకుని వెళ్లిపోయింది. దీంతో తాము ఉపాధి కోల్పోయామని స్థానిక ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతోపాటు లిక్కర్, ఇతర బీర్ కంపెనీలు కూడా కనిపించకుండా పోయాయి. కొంతకాలం మ్యాన్షన్‌హౌ్‌సను ఆపేశారు. బ్లెండర్స్‌ప్రైడ్, రాయల్‌స్టాగ్ లాంటి కంపెనీలు అడ్రస్ లేకుండా పోయాయి. దీనిపై వినియోగదారుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ప్రభుత్వం వింత సమాధానం చెప్పింది. ఆ బ్రాండ్లను వినియోగదారులు అడగట్లేదని, అందుకే ఆర్డర్ ఇవ్వట్లేదని వివరణ ఇచ్చింది. కానీ వాస్తవంగా జరిగిందేమింటంటే ఆ బ్రాండ్లను వినియోగదారులు అడిగినా షాపుల్లో కావాలనే అమ్మలేదు. ఇలా ఇష్టారాజ్యంగా బ్రాండ్లు మాయం చేసిన ప్రభుత్వం చివర్లో కొంత మార్పులు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆపేసిన బ్రాండ్ల యాజమాన్యాలతో మాట్లాడి కొన్నింటిని వెనక్కి తీసుకొచ్చింది. అయితే ఆర్డర్లు మాత్రం తక్కువే ఇచ్చింది. కాగా ఇప్పుడు రూల్ ప్రకారం అందరికీ సమానంగా ఆర్డర్లు ఇస్తున్నారు. ఆయా కంపెనీల కెపాసిటీ, మార్కెట్‌లో వాటికున్న డిమాండ్ ఆధారంగా బ్రాండ్లను తీసుకుంటున్నారు.
మీతో వ్యాపారమే వద్దు..
అరాచకాలతో విసిగిపోయిన ప్రముఖ కంపెనీలు చివరికి మీకు మద్యం అమ్మబోమని తిరస్కరించే పరిస్థితిని జగన్ ప్రభుత్వం తెచ్చుకుంది. బ్రాండ్లపై తీవ్ర వ్యతిరేకత రావడం, ఎన్నికలు సమీపించడంతో చివర్లో కొన్ని కంపెనీలకు కార్పొరేషన్ ఆర్డర్లు ఇచ్చింది. అయితే బ్లెండర్స్‌ప్రైడ్ లాంటి కంపెనీలు తాము మద్యం ఇవ్వం అని స్పష్టంచేశాయి. ఎందుకని ఆరా తీయగా ‘ఇప్పుడు ఆర్డర్ ఇస్తారు. కానీ వాటిని డిపోల్లోనే ఉంచి, షాపులకు పంపరు. చివరకు మీ బ్రాండ్లు అమ్ముడుపోలేదంటూ మాకు గ్రౌండ్ పెనాల్టీ పేరుతో కొత్త పన్నులు వేస్తారు. అసలు మీకు మద్యం అమ్మి తలనొప్పి తెచ్చుకోలేం. మీ ఆర్డర్లు వద్దు. మీతో వ్యాపారం వద్దు’ అని కొన్ని కంపెనీలు నిర్మొహమాటంగా తేల్చేశాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న బకాయిలు విడుదలకు కమీషన్లు వసూలు చేయడంపైనా కంపెనీలు అసంతృప్తితో ఉన్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి లిక్కర్ కంపెనీలకు రూ.758 కోట్లు ఇవ్వాలి. వాటిని ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ముప్పతిప్పలు పెట్టింది. చివరికి 25 శాతం కమీషన్ ఇస్తే విడుదల చేస్తామని కండీషన్ పెట్టింది. దానిపై వడ్డీల లెక్కలు వేసుకున్న కంపెనీలు కమీషన్ బకాయిలు తీసుకున్నాయి. చివరికి 20శాతం కమీషన్లు ఇచ్చి నాలుగేళ్ల తర్వాత అప్పటి బకాయిలు తీసుకున్న కంపెనీలు కూడా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని ఈ కమీషన్ల వ్యవహారంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు విసిగిపోయాయి. ఈ ప్రభుత్వంతో వ్యాపారమే తలనొప్పి అనే ఆలోచనకు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో స్వేచ్ఛ లభించిందని, ఈ కమీషన్ల వ్యవహారం ఉండదని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు.
కొత్త మద్యం పాలసీ ఎలా..?
మద్యం షాపుల కొత్త పాలసీ ఎలా ఉంటుందనే దానిపై వ్యాపార వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. గతంలో ప్రైవేటు షాపుల ద్వారా మద్యం అమ్మే పాలసీ ఉండేది. కానీ, జగన్... ప్రభుత్వ మద్యం షాపులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సెప్టెంబరుతో ఆ పాలసీ గడువు ముగుస్తుంది. కానీ, ఈలోగానే కొత్త ప్రభుత్వం పాలసీని మారుస్తుందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ పాత విధానంలో ప్రైవేటు షాపులు తీసుకొస్తారని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ షాపుల పాలసీపై తీవ్ర వ్యతిరేకత వచ్చినందున దాన్ని పక్కనపెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే జగన్ ప్రభుత్వం ఎక్సైజ్‌ను రెండు ముక్కలు చేసి సెబ్‌ను ఏర్పాటుచేసింది. దాన్ని రద్దుచేసి ఎక్సైజ్‌ను పాత రూపంలోకి తీసుకురావాలనే డిమాండ్ ఆ శాఖ ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది.
Updated Date - Jun 11 , 2024 | 04:25 AM