ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మద్యం గ్లాసులు, ఎముకలతో బస్సులు చెక్‌పాయింట్‌ ఎలా దాటాయ్‌?

ABN, Publish Date - Mar 13 , 2024 | 01:36 AM

పసిబిడ్డల పాల సీసాలు కూడా కొండపైకి అనుమతించరే... అలాంటిది మద్యం గ్లాసులు, ఎముకలున్న బస్సులు మాత్రం పదుల సంఖ్యలో కొండపైకి ఎలా చేరుకున్నాయి?..

బస్సులో ఎముకలు, వైసీపీ టోపీ

తిరుపతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : పసిబిడ్డల పాల సీసాలు కూడా కొండపైకి అనుమతించరే... అలాంటిది మద్యం గ్లాసులు, ఎముకలున్న బస్సులు మాత్రం పదుల సంఖ్యలో కొండపైకి ఎలా చేరుకున్నాయి?.... వైసీపీ సిద్ధం సభకు వెళ్ళిన తిరుమల డిపో ఆర్టీసీ బస్సులు వైసీపీ టోపీలతో పాటు మద్యం గ్లాసులు, మాంసం తినగా మిగిలిన ఎముకలతో కొండపైకి చేరుకున్న ఉదంతం మీడియాలో చూసిన పలువురి నోట వినిపిస్తున్న ప్రశ్న ఇది. తిరుమల ఆర్టీసీ డిపో బస్సులైనంత మాత్రాన వాటికి అలిపిరి చెక్‌ పాయింట్‌లో మినహాయింపులేమీ వుండవు. ఇతర వాహనాలను తనిఖీ చేసిన రీతిలోనే సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండపైకి అనుమతించాల్సి వుంది. ఈ డిపో నుంచీ మొత్తం 40 బస్సులను సిద్ధం సభకు కేటాయించగా అవి తిరిగొచ్చాక ఒకదాన్ని కూడా అలిపిరిలో చెక్‌ చేయలేదని సమాచారం. పదుల సంఖ్యలో బస్సుల్లో వైసీపీ టోపీలు, మద్యం గ్లాసులు, ఖాళీ బిరియానీ ప్యాకెట్లు, బిరియానీ తినగా మిగిలిన ఎముకలు సీట్ల కింద పడి వున్నాయి. ఈ ఘటన అలిపిరి టోల్‌గేట్‌లో భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

తప్పిదం ఆర్టీసీపైకి నెట్టేసే యత్నం

తిరుమల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో నిషేధిత, అవాంఛనీయ వస్తువులతో కొండపైకి చేరుకున్న వ్యవహారంలో తప్పిదాన్ని ఆర్టీసీ సిబ్బందిపైకి నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ సభకు జనాన్ని తరలించే డ్యూటీ అయినా లేక కేటాయించిన రూటులో ప్రయాణీకులను తరలించే డ్యూటీ అయినా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్లు తమకు నిర్దేశించిన విధులు మాత్రమే నిర్వర్తిస్తారు. అంతేకానీ బస్సుల శుభ్రత వారి డ్యూటీ కాదు. బస్సు గ్యారేజీకి చేరాక అక్కడి సిబ్బంది బస్సులను శుభ్రపరుస్తారు. తిరుమలకు వెళ్ళే బస్సుల్లో నిషేధిత వస్తువులు లేకుండా చూడాల్సిన బాధ్యత డ్రైవరు, కండక్టర్లపై కూడా వుంది. అయితే ఆ విషయంలో ఆ బాధ్యత వారిమీద కన్నా అలిపిరి టోల్‌గేట్‌ సెక్యూరిటీ సిబ్బందిపై ఎక్కువగా వుంటుంది. ఆర్టీసీ బస్సా లేక ప్రైవేటు వాహనాలా అన్నదానితో నిమిత్తం లేకుండా ప్రతి వాహనం తనిఖీ చేసి పంపాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిది. ఆ విధుల్లో వారు ఘోరంగా విఫలమైనట్టు సోమవారం నాటి ఘటన తేటతెల్లం చేస్తోంది. టీటీడీ సెక్యూరిటీ విభాగం వైఫల్యాన్ని కప్పిపెట్టి ఆర్టీసీపరంగా విచారణకు ఆదేశించడం, ఆర్టీసీ డ్రైవర్లపై చర్యలకు ఉపక్రమించడం విమర్శలకు దారి తీస్తోంది. వైసీపీ టోపీ, మద్యం గ్లాసులు, బిరియానీ ప్యాకెట్లు, ఎముకలు వంటి నిషేధిత వస్తువులే కానీ తిరుమల భద్రతకు ప్రమాదకరమేమీ కాదు. వాటివల్ల కొండ పవిత్రత దెబ్బతింటుందే కానీ ఎవరికీ ప్రమాదకరం కాదు. ఇదే ఆర్టీసీ బస్సుల్లో పై వస్తువులు కాకుండా ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలు వంటివి తరలించే వుంటే పరిస్థితి ఏమిటన్నది పలువురి ప్రశ్న. ఈ కోణంలో ఆలోచిస్తే అలిపిరి చెక్‌ పాయింట్‌ డొల్లతనం ఏమిటో జనానికి సులువుగా అర్ధమవుతుంది.

చెక్‌ పాయింట్‌లో సామాన్య భక్తులకు చుక్కలు

అధికార ఆర్భాటం, పలుకుబడి కలిగిన వారి సంగతి పక్కన పెడితే సామాన్యులు అలిపిరి చెక్‌ పాయింట్‌ దాటాలంటూ దేవుడి కంటే ముందు చుక్కలు చూస్తారన్న సామెత వుంది. బస్సులు, జీపుల్లో కొండపైకి వెళ్ళే సాధారణ యాత్రికులు అలిపిరి టోల్‌ గేట్‌ చెక్‌ పాయింట్‌ వద్ద కనీసం నీళ్ళ బాటిళ్ళను తీసుకెళ్లే పరిస్థితి లేదు. కొండపైన టీటీడీ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించడంతో అలిపిరి చెక్‌ పాయింట్‌లో ప్లాస్టిక్‌ బాటిళ్ళను అనుమతించడం లేదు. బస్సుల్లో, జీపుల్లో వెళ్ళే వారు తమకు చిన్న పిల్లలున్నారని, మధ్యలో దాహమైనా, ఆకలైనా ఇబ్బంది పడతామని కాళ్ళావేళ్ళా పడినా చెక్‌పాయింట్‌ సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అంటారని నీళ్ళ బాటిళ్ళు, పాల సీసాలను లాక్కుంటారని పెద్ద పేరుంది. కొంతమంది సామాన్య యాత్రికులు కొండపైన కాటేజీల్లో వేడి నీటితో స్నానం చేసేందుకు గీజర్లు వెంట తీసుకుపోవడం పరిపాటి. అలాంటివి కూడా సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా అడ్డుకుంటుంటారు. జీపులు, కార్లు, బస్సుల్లో వచ్చే యాత్రికులు చెక్‌ పాయింట్‌లో ఖచ్చితంగా కిందకు దిగాల్సిందే. లగేజీ మొత్తం కిందకు దింపాల్సిందే. తమతో పాటు, లగేజీని కూడా సెక్యూరిటీ స్కాన్‌ చేయించుకున్నాకే చెక్‌ పాయింట్‌ దాటి తిరిగి వాహనాలు ఎక్కాల్సి వుంటుంది. యాత్రికులు దిగి లగేజీ కిందకు దింపేశాక ఖాళీ జీపులు, కార్లు, బస్సులను సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి వుంటుంది. సీట్ల కింద, సీట్ల వెనుక కవర్లు, డ్యాష్‌ బోర్డు, బోనెట్‌ లోపల కూడా తనిఖీ చేయాలి. బస్సులైతే ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ మొదలుకుని బోనెట్‌ లోపల, బస్సు ముందూ వెనుకా నేమ్‌ బోర్డు బాక్సులు కూడా తనిఖీ చేయాలి. డ్రైవర్‌, కండక్టర్లను కూడా చెక్‌ చేయాల్సి వుంటుంది. జీపులు, కార్లు, కిందకు దిగిన సామాన్య యాత్రికులను తనిఖీ చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది బస్సుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వుంటున్నారనే ఆరోపణలున్నాయి. దూర ప్రాంతాల నుంచీ యాత్రికులు జీపులు, కార్లు అద్దెకు తీసుకుని వస్తుంటారు. తిరుమల వచ్చే అద్దె వాహనాల డ్రైవర్లకు కొండపై నిబంధనలు తెలియదు. ఆ కారణంగా వాహనాల్లో ఇతర మతాలకు చెందిన చిన్నపాటి చిహ్నాలు, వస్తువులూ వున్నా తెలియక టోల్‌ గేట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆయా వస్తువులను, చిహ్నాలను తొలగించి కొండపైకి వాహనాలను అనుమతించాల్సిన చెక్‌ పాయింట్‌ సిబ్బంది దానికి బదులు వాహన డ్రైవర్‌ను గంటల కొద్దీ నిర్బంధించడం, ఉగ్రవాదులను విచారించే రీతిలో ప్రశ్నించడం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

చెక్‌ పాయింట్‌లో కొన్ని వర్గాలకు మినహాయింపు

టీటీడీ ఉద్యోగులు, తిరుమల స్థానికులు చెక్‌ పాయింట్‌లో కిందకు దిగకుండా బస్సుల్లోనే కూర్చుని వుంటారన్న ఆరోపణలున్నాయి. వారిలో కొందరు కొండపైకి అక్రమంగా మద్యం, మాంసం వంటివి తీసుకెళ్ళడం సర్వసాధారణమని సమాచారం. బస్సులోకి సెక్యూరిటీ సిబ్బంది ఎక్కి వీరిని ప్రశ్నిస్తే టీటీడీ ఉద్యోగులు తాము స్టాఫ్‌ అని ఐడీ కార్డులు చూపడం, తిరుమల స్థానికులు తాము లోకల్‌ అని చెప్పడంతోనే సిబ్బంది మారుమాటాడకుండా బస్సు దిగేస్తుంటారన్న విమర్శలున్నాయి. కొండపైకి మద్యం తీసుకెళ్ళే వారు అక్కడ రెట్టింపుఽ ధరకు విక్రయిస్తున్నారని సమాచారం. అదే విధంగా కొండపై వ్యాపారులు, స్థానికుల్లో పలువురు సాయంత్రం తిరుపతికి వచ్చి మద్యం సేవించి రాత్రికి తిరిగి కొండకు వెళ్ళడానికి అలవాటు పడ్డారు. కొందరు రోజూ ఇలాచేస్తుండగా, మరికొందరు వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళుతుంటారు. ఇలాంటి వారు మద్యం సేవించి బస్సులు, జీపుల్లో వెళుతున్నా అలిపిరి చెక్‌పాయింట్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రోజూ రాత్రి 7-10 గంటల నడుమ ఇలాంటి వారు పెద్దసంఖ్యలో తిరుమల వెళుతుంటారు. ఖరీదైన కార్లు, పలుకుబడి కలిగిన వారి వాహనాలను సెక్యూరిటీ సిబ్బంది కన్నెత్తి కూడా చూడరని, వచ్చిన వాహనాన్ని వచ్చినట్టే చెక్‌పాయింట్‌ దాటిస్తారన్న పేరుంది. సామాన్యుల విషయంలో పాల బాటిళ్ళు, నీళ్ళ బాటిళ్ళు కూడా అనుమతించని సిబ్బంది పలుకుబడి కలిగిన వారు హైయిర్‌ డ్రైయర్లు, ఐరన్‌ బాక్సులు వంటివి తీసుకెళుతున్నా పట్టించుకోరన్న విమర్శలున్నాయి. తాజా ఘటనతోనైనా టీటీడీ యంత్రాంగం మేలుకొని అలిపిరి టోల్‌గేట్‌లో భద్రతా వైఫల్యాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరముంది. దీనికి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరముంది.

Updated Date - Mar 13 , 2024 | 01:36 AM

Advertising
Advertising