తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి!
ABN, Publish Date - Feb 13 , 2024 | 12:47 AM
ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఆశావహుల మధ్య, వర్గాల నడుమ సర్దుబాటు చేయకుండానే, సయోధ్య కుదుర్చకుండానే వైసీపీ ఇంఛార్జులను ప్రకటించేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఇంఛార్జుల ప్రకటనపై పార్టీ నేతలు, శ్రేణుల్లో అసంతృప్తి, అసమ్మతి సద్దుమణగకపోగా మరింత ఎక్కువైంది.
ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఆశావహుల మధ్య, వర్గాల నడుమ సర్దుబాటు చేయకుండానే, సయోధ్య కుదుర్చకుండానే వైసీపీ ఇంఛార్జులను ప్రకటించేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఇంఛార్జుల ప్రకటనపై పార్టీ నేతలు, శ్రేణుల్లో అసంతృప్తి, అసమ్మతి సద్దుమణగకపోగా మరింత ఎక్కువైంది. ఇంఛార్జుల ప్రకటనతో వర్గ విభేదాలు సర్దుకుంటాయని వైసీపీ అధిష్ఠానం వేసిన అంచనాలు దీంతో తలకిందులవుతున్నాయి. కొన్ని స్థానాల్లో ఇంఛార్జుల స్వభావం సొంత పార్టీలోని వ్యతిరేక వర్గీయులతో అగాధం మరింత పెరిగిపోయేందుకు కారణమవుతోంది. వ్యతిరేకిస్తున్న వారిని కలుపుకునిపోయేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. దీంతో విభేదిస్తున్న నేతల అహం దెబ్బతిని ఎన్నికల వేళ తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది.
తిరుపతి, ఆంధ్రజ్యోతి
వెంకటగిరిలో ఇంఛార్జికి, నేతలకు నడుమ అగాధం
వెంకటగిరిలో ఏడాది కిందటే ఇంఛార్జిగా నియమితులైనప్పటికీ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి నియోజకవర్గంలో పార్టీపై పూర్తిగా పట్టు రాలేదు. సిటింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సన్నిహితులని భావించిన నాయకులందరినీ దూరం పెట్టారనే ఆరోపణలున్నాయి.ఆనం పార్టీని వీడిపోయి, రామ్‌కుమార్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినా కూడా ఆనం సన్నిహితులతో ఆయన సయోధ్య కుదుర్చుకోలేదు.వారితో ఎన్నికల్లో నష్టం కలుగుతుందని భావించిన ఆయన తల్లి, మాజీ మంత్రి రాజ్యలక్ష్మి నేరుగా రంగంలోకి దిగి కుమారుడికి దూరంగా వున్న నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. పలువురు నాయకుల ఇళ్లకు వెళ్ళడంతో పాటు మరికొందరిని తన ఇంటికి ఆహ్వానించి కుమారుడికి ఎన్నికల్లో సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆమె పట్ల వారికి గౌరవం వున్నప్పటికీ వారు సర్దుకోలేకపోతున్నారు. రామ్‌కుమార్‌రెడ్డి మహా అయితే తన సన్నిహితులను పంపి నచ్చజెప్పేందుకు యత్నించడం తప్ప ఆయన ఇంటి నుంచీ కాలు కదపడం లేదని సమాచారం. దీంతో అసంతృప్తితో దూరంగా వున్న నాయకుల అహం దెబ్బ తింటోంది. ఇదివరకూ ఎలా వున్నా ఎన్నికల సమయంలో ఇంఛార్జికి, అసంతృప్త నాయకులకూ నడుమ అంతరం అంతకంతకూ పెరిగిపోతోంది. చొరవగా శ్రేణుల్లోకి వెళ్ళలేని, ఓ మెట్టు దిగి రాజకీయాలు చేయలేని స్వభావం రామ్‌కుమార్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టిస్తోంది.
గూడూరులో వరప్రసాద్‌ను పట్టించుకోని అధిష్ఠానం
గూడూరులో సిటింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి కొత్త ఇంఛార్జిగా ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్‌ను వైసీపీ అధిష్ఠానం ప్రకటించేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోగా ప్రత్యామ్నాయం కూడా సూచించలేదు. ఐదేళ్ళు ఎంపీగా, ఐదేళ్ళు ఎమ్మెల్యేగా తాను సేవలందించిన పార్టీ నుంచీ ఈ రకమైన ధోరణి ఎదురుకావడం వరప్రసాదరావు మనసును కలచివేసినట్టు సమాచారం. దీంతో ఆయన తన పదేళ్ళ రాజకీయ నేపధ్యాన్నే అర్హతగా, ప్రామాణికతగా తీసుకుని జనసేన, బీజేపీలలో ఏదో ఒక పార్టీ నుంచీ తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని రంగంలోకి దిగినట్టు తెలిసింది. వరప్రసాదరావు తిరుపతి పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ తన సన్నిహితులతో, పరిచయస్తులతో వరుసగా భేటీ అవుతున్నారు. వారి మద్దతు కోరుతున్నారు.అయినప్పటికీ వైసీపీ అధిష్ఠానం ఆయనతో సర్దుబాటుకు యత్నించకపోవడం వరప్రసాదరావును, ఆయన సన్నిహితులను మరింత రెచ్చగొడుతోంది. దీంతో ఆయన రెట్టించిన పట్టుదలతో చాపకింద నీరులా ఇతర పార్టీల్లో తన అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తున్నారు. నిస్సందేహంగా ఇవి వైసీపీకి తిరుపతి పార్లమెంటులో, ప్రత్యేకించి గూడూరు సెగ్మెంట్‌లో నష్టం చేకూర్చే పరిణామాలే.
సత్యవేడులో స్తంభించిన వైసీపీ కార్యకలాపాలు
సిటింగ్ ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి లోక్‌సభకు ఇంఛార్జిగా బదిలీ చేసి ఆయన స్థానంలో తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు ఇంచార్జిగా నియమించడంతో అంతర్గత పోరు రగులుకుని తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆదిమూలం తాను ఎంపీగా పోటీ చేయనని ప్రకటించడంతో పాటు పార్టీని వీడి టీడీపీలో చేరే క్రమంలో యువనేత నారా లోకేశ్‌ను కూడా కలిసిన సంగతి తెలిసిందే. ఆదిమూలం తిరుగుబాటుతో ఎంపీ గురుమూర్తిని తిరిగి తిరుపతి లోక్‌సభ ఇంఛార్జిగా నియమించిన అధిష్ఠానం సత్యవేడుకు మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన నూకతోటి రాజే్‌షకుమార్‌ను ఇంఛార్జిగా ప్రకటించింది. అయితే ప్రకటన వెలువడి పది రోజులైనా అతడు పార్టీ శ్రేణులను కలిసే ప్రయత్నం చేయకపోవడంతో మండల, గ్రామ స్థాయి నాయకుల అహం దెబ్బతింది.దీంతో స్థానికేతరులను తమపై రుద్దవద్దంటూ నాయకులు మంత్రి పెద్దిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు.ఈ పరిస్థితుల్లో పక్షం రోజులకు పైగా సత్యవేడులో అధికార పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎన్నికల సమయంలో శ్రేణులు డీలాపడితే పార్టీ మునుగుతుందనే ఆందోళన కలగడంతో ఎట్టకేలకు ఆదివారం రాజేష్ బీఎన్ కండ్రిగ మండలంలో పర్యటించి నాయకులను, కార్యకర్తలను కలుసుకున్నారు. అయితే ముందుముందు మార్పులు లేకుండా అంతా సజావుగా జరుగుతుందో లేదోనన్న అనుమానాలు మాత్రం పార్టీ శ్రేణులను వీడడం లేదు.
జీడీనెల్లూరులో సయోధ్యకు ఫలించని స్వామి యత్నాలు
డిప్యూటీ సీఎంగా, సీఎం జగన్‌కు సన్నిహితుడిగా పేరున్నప్పటికీ కళత్తూరు నారాయణస్వామి టికెట్ విషయంలో అధిష్ఠానం నుంచీ అమర్యాదకర అనుభవాన్ని ఎదుర్కొన్నారు. నియోజకవర్గంలో పలువురు సొంత పార్టీ నాయకులు, పీఏలుగా వ్యవహరించిన రక్త సంబంధీకులు కూడా ఎదురు తిరిగారు. దీంతో అధిష్ఠానం ఆయన్ను చిత్తూరు ఎంపీ స్థానానికి ఇంఛార్జిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో చిత్తూరు ఎంపీని ఇంఛార్జిగా నియమించింది. వారం పదిరోజులకే మళ్ళీ నిర్ణయం మార్చుకుని వారి పూర్వ స్థానాలకు తిరిగి ఇంఛార్జులుగా నియమించింది. తొలి ప్రకటనపుడు గానీ మలి ప్రకటనపుడు గానీ వర్గ విభేదాలు సర్దుబాటు చేసేందుకు అధిష్ఠానం యత్నించలేదు.నారాయణస్వామిని వ్యతిరేకిస్తున్నది ప్రధానంగా మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి. ఆయన కనుసన్నల్లోనే స్వామి వ్యతిరేకవర్గ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో జ్ఞానేంద్రరెడ్డితో సర్దుబాటు చేసుకునేందుకు స్వామి యత్నిస్తున్నారు. ఇటీవల సీఎం రాక సందర్భంగా విమానాశ్రయంలో ఒకసారి, తర్వాత పెనుమూరులోని వ్యవసాయ క్షేత్రంలోనూ ఆయనతో మాట్లాడి సాయం చేయాలని అభ్యర్థించారు. అయితే క్షేత్రస్థాయిలో చేతులు కలిపేందుకు వ్యతిరేకవర్గం అంగీకరించడం లేదు. దీంతో నాయకుల చుట్టూ తిరగడం కంటే టికెట్ ప్రకటించాక నేరుగా జనం వద్దకే వెళ్ళి బతిమాలుకుంటానని నారాయణస్వామి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.
చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లెల్లో సైలెంటైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు
చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులును పక్కకు తప్పించి ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డిని ఇంఛార్జిగా ప్రకటించిన ప్రారంభంలో అంతా బాగున్నట్టే అనిపించింది. గుడిపాల, చిత్తూరు గ్రామీణ ప్రాంతాల్లో ఎంచక్కా ఎమ్మెల్యేయే స్వయంగా అనుచరవర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టి విజయానందరెడ్డి గెలుపుకోసం సహకరించాలని కోరారు. అయితే రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో అధిష్ఠానం నిర్ణయం మారిపోవడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరమయ్యారు. రాజకీయంగా వేగంగా నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన ఎమ్మెల్యే శ్రీనివాసులు పైకి మౌనంగా వున్నట్టు కనిపించినా అంతర్గతంగా ప్రత్యామ్నాయం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంటారన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పూతలపట్టులో కూడా సిటింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌ను ఇంఛార్జిగా నియమించారు. బహిరంగంగానే మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేసిన ఎంఎస్ బాబు తర్వాత పొరపాటైందని ప్రకటించి మౌనవ్రతం పాటిస్తున్నారు. మకాం బెంగళూరుకు మార్చారు. వైసీపీ, ప్రభుత్వ కార్యక్రమాలు రెండింటికీ హాజరు కావడం లేదు. ఆయనకు మద్దతు పలికిన నాయకులు, అనుచరులు కూడా ఇంఛార్జితో కలవడం లేదు. ఎమ్మెల్యే తరహాలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుంటున్నారు. వీరిని కలుపుకునిపోయేందుకు పార్టీ పరంగా కూడా ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో రెండు వర్గాల నడుమ అంతరం అలానే వుండిపోయి రోజులు గడిచే కొద్దీ పెరుగుతోంది. మదనపల్లెలో సిటింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను విస్మరించి నిషార్ అహ్మద్‌ను ఇంఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై బహిరంగంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఎమ్మెల్యే నవాజ్‌బాషా తెరమరుగయ్యారు. పార్టీ కార్యక్రమాలతో పాటు చివరికి అధికారిక కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. మకాం బెంగళూరుకు మార్చారు. ఎన్నికల్లో ఆయన చురుగ్గా పనిచేసేలా అధిష్ఠానం యత్నించడం లేదు. జిల్లా నేతలు సైతం ఆయన్ను పట్టించుకోవడం లేదు.
ఇంచార్జుల మార్పిడి లేకున్నా నగరి, సూళ్ళూరుపేటల్లో కుదరని సయోధ్య
నగరి, సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్ఠానం ఇంఛార్జులను మార్చకపోయినప్పటికీ సిటింగ్ ఎమ్మెల్యేల వర్గాలకు, వ్యతిరేక వర్గాలకు నడుమ సయోధ్య కుదరడం లేదు. నగరిలో మంత్రి రోజాయే తిరిగి పోటీ చేస్తారా లేక కొత్త అభ్యర్థి వస్తారా అన్నది తేలడం లేదు. రోజా సైతం బింకంగానే తప్ప ధీమాగా తానే పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో ఆమెను వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలతో మాట్లాడి రాజీ కుదిర్చే ప్రయత్నం ఏ స్థాయిలోనూ జరగడం లేదు. జిల్లాపై పట్టున్న ఓ మంత్రి నగరిలో జోక్యం చేసుకుంటున్నారని గతంలో అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసిన నేపధ్యంలో ఇపుడా మంత్రి తానెందుకు పట్టించుకోవాలని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీంతో వ్యతిరేకవర్గాన్ని కలుపుకుని పోయే ప్రయత్నాలకు స్వస్తి పలికిన రోజా వారు కలిగించే నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్నారు. ఆ క్రమంలో రాజకీయాలకు దూరంగా వున్న వర్గాలను, ముఖ్యులను కూడా కలసి మద్దతు కోరుతున్నారు. ఆమె తీరు సొంత పార్టీలో వ్యతిరేక వర్గాన్ని మరింతగా రెచ్చగొడుతోంది. వారి మధ్య అగాధం మరింత పెరుగుతోంది. సూళ్ళూరుపేటలో సైతం టికెట్ విషయంలో సంజీవయ్యకు అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు ప్రచారమవుతున్నా పార్టీలో వ్యతిరేకవర్గం రాజీ పడడంలేదు. సంజీవయ్యకు టికెట్ ఇస్తే ఓడిస్తామన్న శపథానికి కట్టుబడి అధిష్ఠానం ప్రకటన కోసం వేచి చూస్తున్నట్టు సమాచారం. అవసరమైతే టీడీపీ అభ్యర్థికి బహిరంగంగా కొందరు, లోపాయికారీగా కొందరు సహకరించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేకి, వ్యతిరేక వర్గానికి నడుమ విబేదాలు తొలగించి దగ్గర చేసే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు.
Updated Date - Feb 13 , 2024 | 12:47 AM