YCP: అనంత సభపై వైసీపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు డుమ్మా
ABN, Publish Date - Jan 29 , 2024 | 01:15 PM
Andhrapradesh: అనంతపురంలో జరుగనున్న ‘‘సిద్దం’’ సభ ఏర్పాట్లపై వైసీపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డీనేటర్లు హాజరయ్యారు.
తిరుపతి, జనవరి 29: అనంతపురంలో జరుగనున్న ‘‘సిద్దం’’ సభ ఏర్పాట్లపై వైసీపీ సన్నాహక సమావేశం నిర్వహించింది. సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కోఆర్డీనేటర్లు హాజరయ్యారు. అయితే సీటు రాని ఎమ్మెల్యేలు మాత్రం సమావేశానికి డుమ్మాకొట్టారు. మంత్రి జయరాం, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, ఆదిమూలం, నవాజ్ భాషా, తిప్పేస్వామి సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, రాజంపేట, కదిరి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, సిద్దారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సమావేశానికి డుమ్మాకొట్టారు. కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేకుండానే మంత్రి పెద్దిరెడ్డి సమావేశాన్ని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొత్త ఇంచార్జ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: పెద్దిరెడ్డి
సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురంలో జరగనున్న ‘‘సిద్దం’’ సభకు ఏర్పాట్లపై చర్చించామన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నామన్నారు. సీమలో ఓడిపోయిన మూడు స్థానాల్లోనూ గెలవాలని సమాయత్తం అవుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే ఓ పెద్ద సభగా అనంతపురం సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సత్యవేడు శాసనసభ్యుడు ఆదిమూలం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ఆయన్ను కష్టపడి గెలిపించామన్నారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కొందరు శాసనసభ్యులు వ్యక్తిగత కారణాలతోనే సమావేశానికి రాలేదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 29 , 2024 | 04:38 PM