ఎన్నికల కొల్లేరు
ABN, Publish Date - Feb 13 , 2024 | 02:39 AM
చేతి ఖర్చులు మొదలు పార్టీ, ఎన్నికల వ్యయాల దాకా, ఏ అవసరం వచ్చినా అధికార పార్టీ నాయకులకు గుర్తొచ్చేది కొల్లేరే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ‘ఎర్రి....’
ఖర్చుల కోసం వందలాది ఎకరాల్లో అక్రమ తవ్వకాలు!
కొడుకు ఎన్నికలకు ‘ఎర్రి...’ మంత్రి తాపత్రయం
నాడు వైఎస్ హయాంలో అక్రమ చెరువుల బ్లాస్టింగ్
ఆయన కుమారుడి పాలనలో ఇప్పుడక్కడే తవ్వకాలు
ఎకరాకు రైతుల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు
మూడు మండలాల్లో వారం రోజులుగా ఎక్స్‌కవేటర్ల మోత
‘ఎర్రి...’ మంత్రికి ఇతర వైసీపీ ఎమ్మెల్యేలూ సాయం
మద్దతు ఇస్తున్న ఓ ఫారెస్ట్ రేంజర్ అధికారి
(ఏలూరు-ఆంధ్రజ్యోతి)
చేతి ఖర్చులు మొదలు పార్టీ, ఎన్నికల వ్యయాల దాకా, ఏ అవసరం వచ్చినా అధికార పార్టీ నాయకులకు గుర్తొచ్చేది కొల్లేరే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ‘ఎర్రి....’ మంత్రితోపాటు ముగ్గురు ప్రజాప్రతినిధులు కలసి కొల్లేరులో భారీ తవ్వకాలకు ఒడిగట్టారు. వందలాది ఎక్స్‌కవేటర్లతో విస్తృతంగా తవ్వకాలు జరిపిస్తూ, ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ. 50 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఓ ఫారెస్ట్ రేంజర్ సహకరిస్తుండడంతో, అధికారులను కూడా వాళ్లు మేనేజ్ చేస్తున్నారు. ఎవరెవరికి ఎంతెంత పంపాలో ఈపాటికే అదంతా చేరిపోయిందని చెబుతున్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బాంబులతో పేల్చేసిన అక్రమ చెరువులు ఉన్న తావుల్లోనే తిరిగి నిరాటంకంగా సాగుతున్న ఈ తవ్వకాలు కొల్లేరును గుల్ల చేస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో తవ్వకాలపై ఎన్ని ఆంక్షలు ఉన్నా అధికార పార్టీ నాయకులకు పట్టడం లేదు. కొల్లేరు అభయారణ్యంలో తవ్వకాలు, చేపలు, రొయ్యల చెరువులు చేపట్టకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. నిషేధిత 5వ కాంటూరులో వందలాది ఎకరాలను ఎక్స్‌కవేటర్లతో తవ్వేస్తున్నారు. బయట వ్యక్తులు లోపలకు వెళ్లకుండా, లోపలి వ్యవహారాలను బయటకు పొక్కనీకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫలితంగా దాదాపు వారంరోజుల నుంచి జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని పైడిచింతపాడు, మల్లవరం, లక్ష్మీపురం, చెట్టున్నపాడు, కొల్లేటి కోట తదితర గ్రామాల్లో భారీ తవ్వకాలు జరుగుతున్నాయి.
ఇదీ నేపథ్యం...
ఇటీవలే ‘ఎర్రి....’ మంత్రి తన కుమారుడికి పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని ఖాయం చేయించుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఇప్పటినుంచే రెండు చేతులా సంపాదించేందుకుగాను కొల్లేరుపై కన్నేశారు. అక్రమ తవ్వకాలకు తెర తీసిన కారణం ఇదేనని చెబుతున్నారు. తవ్వకాలు చేపట్టిన ప్రతి మండలంలోనూ ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ. 50 వేలు వసూలు చేసిన నేతలు, ఇప్పటికే కోట్లాది రూపాయలు దండుకున్నారు. బీమడోలు మండలంలో 300 హెక్టార్లలో, ఏలూరు రూరల్ మండలంలో 220 హెక్టార్లు, మరో మండలంలో మరికొన్ని హెక్టార్లలో..ఇలా వందలాది ఎకరాల కొల్లేరు భూములను ఎడాపెడా తవ్వేస్తున్నారు. తమ అక్రమ తవ్వకాలపై కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందకుండా జాగ్రత్తలు పడుతున్నారు. తొలుత రెండు గ్రామాల్లో చడీచప్పుడు కాకుండా మొదలైన తవ్వకాలు...క్రమేణా ఇతర గ్రామాలకూ చేరాయి.
బ్లాస్టింగ్ చేసిన చెరువుల్లో...
అప్పటి సీఎం వైఎస్ హయాంలో కొల్లేరులోని ఆక్రమిత చెరువులను బాంబులతో పేల్చేశారు. తదనంతరకాలంలో ఆయన కుమారు డు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు కొల్లేరు అక్రమ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా అధికార పార్టీ నాయకులే తవ్వకాలు నడిపిస్తున్నారని సమాచారం. అప్పట్లో బ్లాస్టింగ్ జరిపిన భూముల్లోనే ‘ఎర్రి....’ మంత్రి ప్రస్తుతం తవ్వకాలు చేయిస్తుండటం గమనార్హం. వాస్తవానికి ఈ తవ్వకాలకు 2019 నాటి ఎన్నికల సమయంలోనే బీజం పడింది. అప్పట్లో అభ్యర్థులు గా బరిలో ఉన్న పలువురు నాయకులు రైతులకు ‘కొల్లేరు’పై హామీలు ఇచ్చారు. ఆయా భూముల్లో తిరిగి తవ్వకాలు జరిపించి ఆక్వా కల్చర్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పా రు. అప్పట్లో బ్లాస్టింగ్ జరిగిన తావులను తిరి గి చెరువులుగా అభివృద్ధి చేయిస్తామని రైతులకు నమ్మబలిగారు. ఆశ కొద్దీ కొల్లేరు లంక గ్రామాల ప్రజలు గంపగుత్తగా తమ ఓట్లన్నీ వైసీపీకి వేశారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా తవ్వకాలకు ముహూర్తం కుదరలేదు. దీంతో హామీలు పొందిన రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. కొద్ది కాలంగా ఆ వ్యతిరేకత కాస్తా ఆగ్రహంగా మారడంతో దాదాపు ఆరు నెలలు క్రితం తవ్వకాలను మొదలుపెట్టారు. ఒక్కో ఎకరానికి రేటు కట్టి మరీ వసూళ్లు చేసుకున్నారు. వాస్తవానికి సంబంధిత భూముల్లో కొన్ని పట్టా భూములున్నా, అందులో వ్యవసాయానికి మినహా చేపల, రొయ్యల చెరువులు సాగు చేయడానికి వీల్లేదని అప్పట్లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా సరే అవే భూముల్లో ప్రస్తుతం యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే లక్ష్మీపురంలోని 300 ఎకరాలు, పైడిచింతపాడులో 150, మల్లవరంలో మరో 100 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.
అధికారుల ఆమ్యామ్యా...
కొల్లేరులో అఽక్రమ తవ్వకాలపై అధికారులకు సమాచారమున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. దాదాపు వారం నుంచి జరుగుతున్న తవ్వకాలకు సాక్షాత్తు అటవీశాఖలోని ఓ ఫారెస్ట్ రేంజర్ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం బీమడోలు మండలంలోని పలు గ్రామాలతో పాటు పైడిచింతపాడులో పలు ఎక్స్‌కవేటర్లు రోడ్లపైనే తిరుగుతున్నా, ఏ ఒక్క అధికారి కూడా ఆయా వాహనాల వ్యవహారాలపై ఆరా తీయడంలేదు. అటవీశాఖకు చెంది, పదేళ్లుగా కొల్లేరు రేంజర్‌లో పనిచేస్తోన్న ఓ అధికారి.... తనకున్న రాజకీయ పలుకుబడితో నిజాయితీగా పనిచేసే ఇతర అధికారులను బదిలీ చేయిస్తున్నారు. ఆయన బదిలీపై ఏ శాఖకు, ఏ ప్రాంతానికి వెళ్లినా, తిరిగి కొల్లేరులోనే పోస్టింగు వేయించుకుంటూ అక్కడ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అధికారులను మేనేజ్ చేయడం నుంచి రైతుల నుంచి వసూళ్ల కార్యక్రమం వరకు ఆయన ప్రమేయం ఉందని విశ్వసనీయ సమాచారం. స్థాయిని బట్టి ఒక్కో అధికారికి ముట్టజెప్పాల్సిన ఆమ్యామ్యాలను ఆయనే దగ్గరుండి పంపకాలు చేయించారని సమాచారం. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ఊళ్లల్లోకి కొత్త వ్యక్తులు ఎవరు వెళ్లినా, సమాచారం చేరవేసేలా పకడ్బందీ ఏర్పా ట్లు చేసుకున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలకు ముందే కాపలా ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వారు వస్తే తిరిగి ప్రాణాలతో వెనక్కు వెళ్లడం అక్కడ అసాధ్యమని చెబుతున్నారు.
Updated Date - Feb 13 , 2024 | 02:39 AM