ఒంగోలు మాగుంట కుటుంబానికి కంచుకోట
ABN, Publish Date - Apr 22 , 2024 | 03:11 PM
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం తొలినాళ్లలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ.. ఎక్కువసార్లు కాంగ్రెస్ అధిక్యం కొనసాగింది. రాన్రాను మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత టీడీపీ, ఆ తర్వాత వైసీపీలకు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఆదరణ లభించింది. ఆ క్రమంలో ఇక్కడకు 1996లో నెల్లూరు నుంచి వచ్చిన మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఆదరించగా ఆ కుటుంబం ఈ ప్రాంతాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని స్థానికులుగా ముద్రపడిపోయారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం నుంచి పోటీలో ఉంటూనే ఉన్నారు
తాజా ఎన్నికల్లోనూ వారే పోటీ
పొరుగు ప్రాంత నేతలకు ఆదరణ.. అధికసార్లు వారే గెలుపు
తొలినాళ్లలో కమ్యూనిస్టులు ఆ తర్వాత కాంగ్రెస్ అధిపత్యం
పునర్విభజన తర్వాత పెరిగిన పశ్చిమ ప్రాంత ప్రభావం
గెలుపులో ఆ ఓటర్లే కీలకం
వనరులు తక్కువ, సమస్యలు ఎక్కువ
ఏడాది పొడవునా దాహం కేకలు
వెలిగొండతోనే భవిష్యత్
ఒంగోలు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి) : ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం తొలినాళ్లలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ.. ఎక్కువసార్లు కాంగ్రెస్ అధిక్యం కొనసాగింది. రాన్రాను మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత టీడీపీ, ఆ తర్వాత వైసీపీలకు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఆదరణ లభించింది. ఆ క్రమంలో ఇక్కడకు 1996లో నెల్లూరు నుంచి వచ్చిన మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఆదరించగా ఆ కుటుంబం ఈ ప్రాంతాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకొని స్థానికులుగా ముద్రపడిపోయారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం నుంచి పోటీలో ఉంటూనే ఉన్నారు. అలా ఇప్పటివరకు ఎనిమిదిసార్లు మాగుంట కుటుంబం తరఫున ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీ చేయగా ఆరుసార్లు గెలుపొందారు. ఎక్కువసార్లు గెలుపొందడమేగాక మరోసారి తాజాగా జరగనున్న ఎన్నికల్లోనూ మాగుంట శ్రీనివాసులరెడ్డి బరిలో నిలిచారు.
నియోజకవర్గ పునర్విభజనతో మారిన ముఖచిత్రం
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2009 వరకు జిల్లాలోని తూర్పు ప్రాంతం, నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం ఈ పార్లమెంట్ స్థానంలో ఉండేది. పునర్విభజన తర్వాత ఒంగోలు పార్లమెంట్ స్థానంపై పశ్చిమ ప్రాంత ప్రభావం పూర్తిగా పెరిగింది. తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గం వారే ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఎక్కువసార్లు గెలుపొందుతుండగా ప్రస్తుతం ఆ సామాజిక వర్గ రాజకీయ ఆధిపత్యం మరింత పెరిగింది.
తొలినాళ్లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఒంగోలు...
ఒంగోలు పార్లమెట్ స్థానానికి తొలి ఎన్నికలు 1952లో జరగ్గా అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఆనాడు కమ్యూనిస్టు నేతలుగా ఉన్న పీసపాటి వెంకటరాఘవయ్య, ఎం. నానాదాసులు గెలుపొందారు. 1957లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టు నేత మాదాల నారాయణస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి రొండా నారపరెడ్డి గెలుపొందగా, 1962లో పోటీ చేసిన మాదాల నారాయణస్వామి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ పౌల్‌పై విజయం సాధించారు. 1962 ఎన్నికల నాటికి కమ్యూనిస్టుల ప్రభావాన్ని అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రముఖ సినీనటుడు కొంగర జగ్గయ్యను తెచ్చి రంగంలోకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గయ్య గెలుపొందగా అప్పటి నుంచి 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ హవా సాగింది. మొత్తంగా 1952 నుంచి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ గెలిచింది. అందులో ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున మాగుంట కుటుంబం గెలుపొందింది.
సినీనటుడు కొంగర జగ్గయ్య పోటీతో ప్రారంభం...
1967 ఎన్నికలలో కొంగర జగ్గయ్య పోటీతో ప్రారంభమైన పొరుగు ప్రాంత నేతల ప్రభావం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ గెలుపొందిన లేదా ఓటమి చెందినా, ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థులలో ఎవరో ఒకరు పొరుగు ప్రాంతం వారే ఉంటూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల తరఫున పొరుగు నేతలే బరిలో దిగుతున్నా మూడు దశాబ్దాలకుపైగా ఇక్కడ రాజకీయం నడుపుతున్న మాగుంట కుటుంబం ఇక్కడ స్థానికులుగానే ముద్రపడిపోయారు.
నియోజకవర్గ పునర్విభజన అనంతరం ఒంగోలు స్థానంపై పశ్చిమ ప్రాం త ప్రభావం అధికమైంది. ఒకప్పుడు నర్సరావుపేట పార్లమెంట్ స్థానంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు 2009 నుంచి ఒంగోలులో చేరడంతో గెలుపులో ఆ ప్రాంత ఓటర్లు తీర్పు ప్రభావం అధికమైంది. ఇదిలా ఉండగా ఈ ప్రాంత ప్ర జల పరిస్థితి చూస్తే రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం. వర్షాకాలం, ఎండాకాలం అన్నది తేడా లేకుండా నిత్యం దాహం కేకలు పశ్చిమ ప్రాంతంలో వినిపిస్తుంటాయి. అంతేస్థాయిలో సాగునీటి సమస్య అధికం, విస్తారంగా భూములున్నా సాగునీరు లేక పంటలు పండక తాగేందుకు నీళ్లు లేక ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి ఉపాధి మార్గాలు లేక ఆ ప్రాంతం నుంచి వేలాది కుటుంబాలు వలసలు వెళ్లాయి. ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయితే పశ్చిమ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
Updated Date - Apr 22 , 2024 | 03:12 PM