CM Chandrababu: చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంపై ఏపీ కేబినెట్‌లో చర్చ
ABN, Publish Date - Aug 28 , 2024 | 09:34 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలువురు మంత్రుల ప్రస్తావించారు. సీఎంగా చంద్రబాబు తొలిసారి బాధ్యతలు స్వీకరించి సెప్టెంబర్ 1 నాటికి 30 సంవత్సారాలు పూర్తవనున్నాయి.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలువురు మంత్రుల ప్రస్తావించారు. సీఎంగా చంద్రబాబు తొలిసారి బాధ్యతలు స్వీకరించి సెప్టెంబర్ 1 నాటికి 30 సంవత్సారాలు పూర్తవనున్నాయి. ఈ సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రికి మంత్రులు ముందస్తు శుభాకాంక్షులు తెలిపారు.
సెప్టెంబర్ 1వ తేదీకి చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి 30 ఏళ్లు పూర్తవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాజకీయ జీవితంలో కీలక ఘట్టం వేళ సీఎం చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలిపింది. తొలిసారి సీఎం అయినప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలను ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తుచేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు చేరువైన విధానంపై చర్చించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్ల నిధులు మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు ఘనత అని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి చేసి ఏపీని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళితే... కేసుల మాఫీ కోసం జగన్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులిచ్చిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Aug 28 , 2024 | 09:34 PM